2 టిఎంసిలు విడుదల చేయాలి

ప్రజాశక్తి -నాగులుప్పలపాడు : నాగార్జునసాగర్‌ నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 2టి ఎంసిల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ రామచంద్రరావుకు రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. విజయవాడలోని రాష్ట్ర నీటిపారుదల శాఖ చీప్‌ ఇంజినీరు కార్యాలయంలో రామచంద్రరావును మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతు సంఘాల నాయకులు ప్రాజెక్టు గురించి వివరించారు. కందుల ఓబుల్‌ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టును ఖరీఫ్‌లో 60వేల ఎకరాలు, రబీలో 80వేల ఎకరాలకు సాగునీరు, 43గ్రామాలకు తాగునీరు అందించేలా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు 3వ నంబరు గేటు కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఫలితంగా సుమారు 10టి ఎంసిల నీరు సముద్రం పాలైనట్లు తెలిపారు. అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టలేదని తెలిపారు. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి ఈనెల 8న 2వ నంబరు గేటు కొట్టుకుపోయినట్లు తెలిపారు. దీంతో సుమారు 4టిఎంసిల నీరు సముద్రం పాలైనట్లు తెలిపారు. కనీసం స్టాప్‌లాక్‌లు కూడా పనిచేయక పోకవడంతో నీరంతా వృథాగా పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఒకటిన్నర టిఎంసిల నీరు కూడా లేదన్నారు. ఫలితంగా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొందన్నారు. తొలుత వర్షాభావ పరిస్థితులు, తర్వాత తుపాను ప్రభావంతో పంటలన్ని దెబ్బతిన్నట్లు తెలిపారు. దీంతో మరో సారి ఆలస్యంగా రైతులు పంటలు సాగు చేసినట్లు తెలిపారు. ఆ పంటలను కాపాడు కోవాలంటే సాగర్‌ నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 2టిఎంసిల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. దెబ్బతిన్న గేట్లకు వెంటనే మర్మతులు చేపట్టాలన్నారు. గుండ్లకమ్మ కాలువల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి పూడిక తీత పనలు చేపట్టాలన్నారు. దీంతో స్పందించిన నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ రామచంద్రరావు సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేటప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకుంటామని హమీఇచ్చారు. నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ను కలిసిన వారిలో రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వై. కేశవరావు,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జె. జయంతిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి. శ్రీకాంత్‌, రైతులు మారెళ్ళ అనిల్‌ , దొడ్డక చంద్ర, కాకాని మొరార్జి తదితరులు పాల్గొన్నారు.

➡️