earthquake : తైవాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 150 మంది ఆచూకీ గల్లంతు

Apr 4,2024 16:12 #Earthquake, #Taiwan

హ్యులిన్‌ :    తైవాన్‌లో గురువారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం సహాయక బృందం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 150 మంది ఆచూకీ తెలియరాలేదని నేషనల్‌ ఫైర్‌ ఏజన్సీ తెలిపింది.

సుమారు రెండు డజన్లకు పైగా పర్యాటకులు, మరికొంత మంది పార్కులో చిక్కుకు పోయారని అన్నారు. రాక్‌ క్వారీలో మరో 64 మంది కార్మికులు ఉన్నట్లు ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాళ్లు పడి రోడ్లు దెబ్బతినడంతో మరో క్వారీలోని ఆరుగురు కార్మికులను విమానంలో తరలించినట్లు వెల్లడించింది. యూనివర్శిటీ విద్యార్థులు సహా పలువురు చిక్కుకుపోయారని తెలిపింది. నేషనల్‌ పార్క్‌లో ఉన్నట్లు ప్రకటించిన సుమారు 50 మంది ఉద్యోగుల సమాచారం కూడా తెలియాల్సి వుంది.

బుధవారం ఉదయం తైవాన్‌లో తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం ధాటికి 9 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

భూకంప కేంద్రం ఉన్న తూర్పు కౌంటీ హ్యులిన్‌లో 48 నివాసభవనాలు దెబ్బతిన్నాయని మేయర్‌ హెచ్సు చెన్‌ వీ తెలిపారు. దెబ్బతిన్న భవనాన్ని కూలిపోకుండా కార్మికులు ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించి పునాది చుట్టూ నిర్మాణ సామగ్రి ఉంచినట్లు తెలిపారు. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, బ్రిడ్జీలు, టన్నెల్స్‌ ధ్వంసమయ్యాయి. నేషనల్‌ లెజిస్లేచర్‌ భవనం, తైపిలోని విమానాశ్రయంలోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం నుండి గురువారం ఉదయం వరకు 300కు పైగా ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు.

1999లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి తైవాన్‌లో సుమారు 2,400 మంది మరణించగా, లక్షమందికి పైగా గాయపడ్డారు. చివరిసారిగా 2018లో వచ్చిన భూకంపం తీవ్రతకు హ్యులిన్‌లో సుమారు 17 మంది మరణించగా, చారిత్రాత్మక హోటల్‌ భవనం కుప్పకూలింది.

➡️