14 డెడ్‌ లైన్‌

14వ తేదీ వరకూ వచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామంటున్న అధికారులు

ప్రజాశక్తి – భీమవరం

అటు ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా.. ఇటు పడగొట్టాలన్నా నవ సమాజ నిర్మాణంతోపాటు ప్రజల భవిష్యత్తును సైతం మార్చగలిగే ఏకైక వజ్రాయుధం ఓటు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ ఓటు హక్కు పొందేందుకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం నాటికి వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఒకపక్క అధికార యంత్రాంగం ఓటు హక్కు నమోదుకు అవగాహన కనిపిస్తున్నా ఎంతోమంది ఓటు నమోదుకు దూరమవుతున్న పరిస్థితి ఉంది.సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అప్పటి నుంచి నామినేషన్‌ సేకరణ ప్రారంభమై 25వ తేదీలోపు ముగుస్తుంది. 26 నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమై 29వ తేదీలోపు ముగియనుంది. మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే ఎన్నికల పనుల్లో హడావిడిగా గడుపుతున్నారు. అయితే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే ఓటు హక్కు నమోదు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. గతం నుంచి ఓటు హక్కుకు నిరంతరాయంగా అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటు నమోదుకు డెడ్‌ లైన్‌ విధించింది. ఈ నెల 14వ తేదీలోపు ఓటు నమోదుకు గడువు ముగియనుంది. తర్వాత చేసుకున్న దరఖాస్తులను ఎన్నికల తర్వాత పరిగణలోకి తీసుకుంటామే తప్ప ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు మాత్రం ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ కూడా జరిగింది. ఇప్పటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ వచ్చే కొత్త ఓటర్లను అనుబంధ (సప్లిమెంటరీ) జాబితాలో చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14వ తేదీలోపు వచ్చే దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుని వాటిని పది రోజుల్లోగా పరిశీలించి, అర్హత ఉంటే ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుంది. తుదిజాబితా నాటికి ఏలూరు జిల్లాలో 16,24,416 మంది ఓటర్లతో పాటు గత నెల మార్చి 30వ తేదీ నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో 14,61,377 మంది ఓటర్లు నమోదయ్యారు. రెండు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లు సంఖ్య 8,30,390 మంది కాగా, పురుష ఓటర్లు 7,93,897 మంది. పురుషుల కంటే మహిళల ఓట్లు 36,498 అధికంగా ఉన్నాయి. పశ్చిమలో మహిళా ఓటర్లు 7,44,308 మంది కాగా, పురుష ఓటర్లు 7,16,956 మంది ఉన్నారు. ఈ జిల్లాలో కూడా 27,352 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.అవగాహన అంతంత మాత్రమే .. పట్టించుకోని అధికారులుఓటరు జాబితాల పరిశీలనపై ఓటర్లు ఉదాశీనంగా వ్యవహరిస్తుంటారు. తమ ఓటు ఉందా? ఉంటే తమ పోలింగ్‌ బూత్‌లోనే ఉందా ? తమ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంది. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఆయా పోలింగ్‌ కేంద్రాలు, ఆన్లైన్లో లేదు.. అందుబాటులో ఉంచినప్పటికీ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ కూడా చూసుకున్న పరిస్థితి లేదు. సాధారణంగా ఓటు ఎక్కడ ఉందో బిఎల్‌ఒలు ఓటరుకు వివరించాలి. ఏదైనా తప్పిదం ఉంటే వారి చేత ఫారం-8 దరఖాస్తు పెట్టించి నివాస ప్రాంతానికి సమీప కేంద్రంలోకి మార్చేలా చూడాలి. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఒక్కోసారి ఓటరులో అందుబాటులో లేకపోవడంతో అధికారులకు కూడా ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఓటర్లకు కూడా పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదు. అయితే అధికారులు పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రావట్లేదనేది తెలుస్తోంది. జిల్లా అధికారుల సమీక్షలో కూడా ఇది స్పష్టమైంది.జాబితాలో పేరు లేకపోతే.. ఆందోళన వద్దు ఓటరుగా నమోదైనప్పటికీ ఎన్నికల రోజున జాబితాలో చాలా మంది తమ పేర్లు లేవని ఆందోళన చెందుతూ ఉంటారు. దానికిబదులు ముందుగానే తమ పేరు చూసుకోవడం మంచిది. ఒక వేళ పేరు కనిపించకపోతే వెంటనే కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతను పరిశీలించి అధికారులు ఓటేసే హక్కు కల్పిస్తారు. దీంతోపాటు చిరునామా మార్చుకునే అవకాశం ఉంది. దానికి ఫారం – 8ను వినియోగించాలి. 18 ఏళ్లు నిండినవారు ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌, హెచ్‌టిటిపిఎస్‌, విఒటిఇఆర్‌ఎస్‌.ఇసిఐ.జిఒవి.ఐఎన్‌, వెబ్‌సైట్‌, హెచ్‌టిటిపిఎస్‌, సిఇఒఎఎన్‌డిహెచ్‌ఆర్‌ఎ. ఎన్‌ఐసి. ఐఎన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫారమ్‌-6లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే చిరునామా, ఓటు మార్పు కోసం ఫారమ్‌-8 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలన పూర్తిచేసి, నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్తగా ఓటుహక్కు పొందినవారి పేర్లును అనుబంధ జాబితా ద్వారా, అలాగే మృతి చెందిన వారు, బదిలీ ఓటర్ల వివరాలను ఎఎస్‌డి జాబితాలో నమోదు చేసి, ఆయా పోలింగ్‌ కేంద్రాల ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేయడం జరుగుతుంది. దీనికోసం కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగింది. కాల్‌ సెంటర్‌ 08816-299616, 08816-299617 నంబర్లను సంప్రదించి తమ ఓటు వివరాలను తెలుసుకునే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది.

➡️