ఢిల్లీని వదలని పొగమంచు .. 134 విమానాలు, 22 రైళ్లు ఆలస్యం

Dec 28,2023 11:28 #Delhi, #Dense Fog

న్యూఢిల్లీ :   దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. 134 విమానాలు మరియు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని సప్దరజంగ్‌ అబ్జర్వేటరీ వద్ద విజిబిలిటీ (దృశ్యమాన్యత) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ విమానాశ్రయం సమీపంలోని పాలం 25 మీటర్ల విజిబిలిటీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, యుపిలలో దృశ్యమాన్యత 50 నుండి 25 మీటర్ల వరకు ఉంది.

ఈ ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మెరుగైన విజిబిలిటీ కనిపించినప్పటికీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో పొగమంచు కొనసాగుతోంది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో డిసెంబర్‌ 31 వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. పొగమంచు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, డ్రైవింగ్‌ సమయంలో ఫాగ్‌ లైట్లను వినియోగించాలని ఐఎండి అధికారులు హెచ్చరించారు.

ఉత్తర భారతదేశం తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో యుపిలోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌ వద్ద స్థిరపడింది. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌ దాటకపోవచ్చని ఐఎండి తెలిపింది. ఢిల్లీలో వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) కూడా పేలవంగా ఉంది. ఆనంద్‌ విమార్‌ ప్రాంతంలో ఎక్యూఐ 464 ”తీవ్రమైన” కేటగిరీగా నమోదైంది.

➡️