హమాస్‌ చెర నుండి 13మంది విడుదల

Nov 26,2023 12:31 #13, #Hamas prison, #people, #released

గాజా : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య రెండో విడత బందీల విడుదలలో భాగంగా … ముందుగా హమాస్‌ 13 మందిని విడుదల చేయగా, అందుకు బదులుగా … 39 మంది పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. పాలస్తీనా అధికారి మాట్లాడుతూ … ఇజ్రాయెల్‌తో అంగీకరించిన నాలుగు రోజుల సంధిని హమాస్‌ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

హమాస్‌ 13 మందిని శనివారం అర్థరాత్రి విడుదల చేసింది. వీరంతా ఆదివారం ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఆ దేశ మిలిటరీ ధ్రువీకరించింది. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి తర్వాత వారి కుటుంబాలకు అప్పజెబుతామని తెలిపింది. విడుదలైన 13 మంది ఇజ్రాయిలీల్లో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, యువకులు ఉన్నారని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ” విడుదల చేయబడిన బందీలు ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులకు వెళుతున్నారు, అక్కడ వారు వారి కుటుంబాలతో తిరిగి కలుస్తారు ” అని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

39 మంది పాలస్తీనా వాసులు విడుదల …

ఇజ్రాయెలీ బందీల విడుదలకు బదులుగా …33 మంది మైనర్‌లతో సహా 39 మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్‌ జైళ్ల నుండి విడుదలయ్యారు. అల్‌ జజీరా టీవీ ఇజ్రాయెల్‌ ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని బీటునియా పట్టణానికి వెళ్లే మార్గంలో ఇజ్రాయెల్‌ జైలు నుండి విడుదలైన పెద్ద సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను ఉత్సాహపరిచే రెడ్‌క్రాస్‌ బస్సు అని పిలిచే ప్రత్యక్ష ఫుటేజీని ప్రసారం చేశారు. ఈ బస్సు ఆదివారం ఉదయానికి వెస్ట్‌బ్యాంక్‌కు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.

ఒప్పందంలో భాగంగా … నాలుగు రోజుల్లో 50 మంది బందీలను హమాస్‌.. 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్‌ విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయాయి. తొలి దశలో భాగంగా థారులాండ్‌కు చెందిన 10 మందిని, ఓ ఫిలిప్పీన్స్‌ జాతీయుడికి హమాస్‌ స్వేచ్ఛ కల్పించిన సంగతి తెలిసిందే. రెండో దశలో కాస్త ఆలస్యమయ్యింది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యమైందని.. దీంతో బందీల విడుదల అనుకున్న సమయానికి కావడం లేదని హమాస్‌ తెలిపింది. తొలిరోజైన శుక్రవారం 24 మందికి హమాస్‌ విముక్తి కల్పించగా.. ఇజ్రాయెల్‌ 39 మంది పాలస్తీనా పౌరులను విడుదల చేసింది.

➡️