రూ.1000 కోట్ల నిధుల సమీకరణలో ఐఐఎఫ్‌ఎల్‌ సమస్తా

Dec 2,2023 20:47 #Business

న్యూఢిల్లీ : బ్యాంకింగేతర విత్త సంస్థ, మైక్రోఫైనాన్స్‌ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్‌ సమస్తా రూ.1,000 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం నాన్‌ కన్వర్టెడ్‌ డిబెంచర్‌ (ఎన్‌సిడి) సెక్యూర్డ్‌ బాండ్లను జారీ చేయనున్నామని పేర్కొంది. సంస్థ మూలధన అవసరాలు, వ్యాపార విస్తరణ కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. 60 నెలల కాలపరిమితి కలిగిన బాండ్లపై గరిష్టంగా 10.50 శాతం వడ్డీ అందించనున్నట్లు తెలిపింది. అదే విధంగా 24, 36, 60 నెలల కాలపరిమితితో కూడిన బాండ్లపై నెలసరి లేదా ఏడాదికి ఒక్క సారి వడ్డీ రేటును పొందవచ్చని పేర్కొంది. ఈ ఇష్యూ డిసెంబర్‌ 4న ప్రారంభమై.. 15న ముగుస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ బాండ్లను బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ వేదికలపై లిస్టింగ్‌ చేయనున్నట్లు పేర్కొంది. రూ.1,000 ముఖ విలువ కలిగిన ఈ బాండ్లను ఒక దరఖాస్తులో కనీసం రూ.10,000 కొనాల్సి ఉంటుంది. ఐఐఎఫ్‌ఎల్‌ సమస్తా ఫైనాన్స్‌కు 1500 శాఖలు ఉన్నాయని ఆ సంస్థ ఎండి, సిఇఒ వెంకటేష్‌ ఎన్‌ తెలిపారు. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి తమ సంస్థ రూ.12,196 కోట్ల ఎయుఎంను కలిగి ఉందన్నారు. 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో సంస్థ రూ.233 కోట్ల లాభాలు నమోదు చేసిందన్నారు.

➡️