01/2019 సర్క్యులర్‌ అమలుకు పోరాటం

Dec 14,2023 22:14

విజయనగరంకోట: ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు పోరాడి సాధించుకున్న 01/2019 సర్క్యులర్‌ అమలయ్యే వరకు పోరాటం చేస్తామని ఎస్‌డబ్ల్యుఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.సుందరయ్య స్పష్టంచేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ మినిస్ట్రీయల్‌ హాల్లో ఎస్‌డబ్ల్యుఎప్‌ డిపో అధ్యక్షులు సిహెచ్‌.వెంకటరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న సర్క్యులర్‌ను ప్రభుత్వం అమలు చేయకుండా పక్కన పెట్టడం అన్యాయమన్నారు. సర్క్యులర్‌ అమలైతే కార్మికుల ఉద్యోగ భద్రత లభిస్తుందని, అదే భరోసాతో విధులు నిర్వర్తించడం వల్ల ఒఆర్‌ పెరుగుతుందని తెలిపారు. నేడు ఉద్యోగులు మళ్లీ అభద్రతాభావంతో ఉద్యోగం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ భద్రత ఉండగా ఇక్కడ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఎంటిడబ్ల్యు యాక్టు సెక్షన్‌ 124, 178 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని జిల్లాల్లో సదస్సుల ఏర్పాటుచేసి, అనంతరం రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి, డిపో కార్యదర్శి చంద్రయ్య, నాయకులు ఎ.రాములు పాల్గొన్నారు.

➡️