పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికిసిపిఎం అభ్యర్థులను గెలిపించండి

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సురేష్‌

ప్రజాశక్తి-చింతూరు

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభించాయని, అసెంబ్లీ, పార్లమెంట్‌లో సిపిఎం ప్రజా ప్రతినిధులుంటేనే వారికి న్యాయం జరుగుతుందని, అందువల్ల రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల గెలిపించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి సీసం సురేష్‌ విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఎజి.కోడేరు గ్రామపంచాయతీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మల్లెతోట గ్రామంలో గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేష్‌ మాట్లాడుతూ ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చట్ట ప్రకారంగా పరిహారం, పునరావాసం, ప్యాకేజీలు నేటికీ కల్పించడం లేదన్నారు. 2006లో ప్రాజెక్టు ప్రారంభం కాగా నాటి నుండి ఏడాదికి ఏడాది ప్రజలు ముంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే తప్పా వారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ.1,15,000 ఇచ్చిన రైతులకు రూ.5 లక్షలు ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి చేసిన వాగ్దానం ఐదేళ్లు పూర్తయిన అమలు కాలేదన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపైనా, ఈ ప్రాంతం గిరిజన, గిరిజనేతర ప్రజల సమస్యలపైనా నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మల్లెతోట గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కారం నాగేష్‌, ధర్మల మల్లయ్య, ధర్మల వీరభద్రం, కూర సుబ్బారావు, ధర్మల పోద్దయ్య, ధర్మల బుజ్జి, మడకం సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️