వాతావరణ మార్పులతో ఆందోళనలో ఆక్వా రైతులు

Mar 20,2024 06:15 #aqua farmers, #weather report
  •  వైరస్‌ ఉధృతి, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే నష్టాలు

ప్రజాశక్తి- కాళ్ల (పశ్చిమగోదావరి) : వాతావరణ మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి వరకూ వైరస్‌ ఉధృతితో నష్టాలు చవిచూసిన వారికి ప్రస్తుతం నేలచూపులు చూస్తున్న ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లగా, ఎండ, ఉక్కబోత ఉండడంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో, చెరువుల్లో రేయింబవళ్లు ఏరియేటర్లు తిప్పాల్సి వస్తోంది. ఆక్సిజన్‌ టాబ్లెట్లు వేస్తూ ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా చూస్తున్నారు. విద్యుత్‌ కోత విధిస్తే ప్రత్యామ్నాయంగా జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. చేపల చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించే అవకాశం ఉండడంతో చెరువుల్లో ఉదయాన్నే బోటు తిప్పుతుండడంతో కెరటాలు వచ్చి ఆక్సిజన్‌ ఉత్పన్నమవుతోంది. చేపలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. వేసవిలో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో లక్షలాది రూపాయల పెట్టుబడులతో వనామి రొయ్యల పెంపకం చేపట్టారు. పగలంతా మండే ఎండలు, వేధిస్తున్నా ఉక్కబోతతో చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నాయి. ఈ తరుణంలో వర్షాలు కురిస్తే ఆక్వా సాగుపై మరింత తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,77,862 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దీనిలో 79,768 ఎకరాల్లో రొయ్యలు సాగులో ఉన్నాయి. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 49,040 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. ఏటా ఇక్కడి నుంచి దాదాపు 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. రూ.14 వేల కోట్లకుపైగా ఆదాయం తెచ్చి పెడుతోంది. ఆక్వా సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉండే పశ్చిమగోదావరి జిల్లా రైతులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

విద్యుత్‌ సబ్సిడీ ఎత్తివేతతో అధికంగా బిల్లులు
జోన్ల పేరుతో విద్యుత్‌ సబ్సిడీని ప్రభుత్వం తొలగించడంతో అక్వా రైతులపై ఆర్థిక భారం పడింది. గతంలో ఎకరా విస్తీర్ణంలో రొయ్యల చెరువు సాగు చేస్తే రూ.4 వేల నుంచి రూ.5 వేల విద్యుత్‌ బిల్లులు వచ్చేవి. ఇప్పుడు రూ.10 వేల నుంచి రూ.13 వేలు వస్తోంది. మరోవైపు మేత ధరలు సగటున కిలోకు రూ.27కు పైగా పెరిగాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి 100 నుంచి 80 కౌంట్‌ రొయ్యలను కిలోకు రూ.15 నుంచి రూ.25 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆక్వా రైతులు చెప్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, పతనమవుతున్న రొయ్యల ధరలు, వైరస్‌ల దాడితో ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో రొయ్యల సాగు కంటే చేపల పెంపకమే మేలనే నిర్ణయానికి రైతులు వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి చూపుతున్న ఆక్వా రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

పెరిగిన పెట్టుబడులు
గతంలో ఎకరాలో 80 వేల నుంచి లక్ష రొయ్య పిల్లలను వేసేశారు. ప్రస్తుతం 40 వేల నుంచి 50 వేల పిల్లలను మాత్రమే వేస్తున్నారు. పది ఎకరాల్లో రొయ్య పిల్లలు వేసి 40, 50 కౌంట్‌ వరకు పెంచాలంటే ఖర్చు రూ.40 లక్షలు దాటేస్తుంది. దీంతో, కొంతమంది చేపల సాగువైపు మళ్లుతున్నారు. రొయ్యలకు గిట్టుబాటు కల్పించాలని, విద్యుత్‌ రాయితీ ఇవ్వాలని, విపరీతంగా పెరిగిన మేతల ధరలను అదుపులోకి తీసుకురావాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి :చేకూరి పుల్లంరాజు, ఆక్వా రైతు, ప్రాతళ్లమెరక
ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. విద్యుత్‌ సబ్సిడీ, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేత, మందులు అప్పు ఇచ్చే అవకాశం లేదు. ఫీడ్‌, మందుల కంపెనీ యజమానులతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి వాటి ధరలు తగ్గిస్తే రైతులకు వెసులుబాటు కలుగుతుంది. రొయ్య పిల్లలు అందించే హేచరీలు నాణ్యమైన రొయ్యలు అందించే చర్యలు చేపట్టాలి. ఎగుమతిదారులు వంద కౌంటు ధర రూ.250 కల్పిస్తే రైతులకు ఊరట కలుగుతుంది. లేకుంటే చిన్న రైతులు ఆక్వా సాగును విరమించాల్సి వస్తుంది.

ఏరియేటర్లు నిరంతరం తిప్పాలి : ఎం.ఇందిరా ప్రియదర్శిని, మత్స్యశాఖ అధికారి, కాళ్ల
ఆక్సిజన్‌ కొరత నివారణకు చెరువులో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తగు మోతాదులో పిచికారీ చేయాలి. వేసవిలో ఉక్కబోత, ఎండ, చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఏరియేటర్లు నిరంతరం తిప్పాలి. బోట్లు, ఆయిల్‌ ఇంజన్లు ఏర్పాటు చేసి చెరువులోని నీటిని రీసైక్లింగ్‌ చేయడం ద్వారా కెరటాలు రావడంతో ఆక్సిజన్‌ ఉత్పన్నమవుతుంది. మేత తక్కువగా వేయాలి.

➡️