ఆ ఓదార్పు మరువలేని జ్ఞాపకం

విజయవాడలో బస్సు ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా 1980 డిసెంబర్‌లో జరిగిన ఆందోళన సందర్భంగా కాల్పుల్లో గాయపడిన మాకు సుందరయ్యగారి ఓదార్పు, యువ కార్యకర్తలమైన మా పట్ల ఆయన చూపిన శ్రద్ధ మాకు జీవితాంతం జ్ఞాపకముండిపోయే అనుభవాలు. బస్సు ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా అఖిలపక్షం పిలుపు మేరకు డిసెంబర్‌ 20న విజయవాడలో బస్సుల బంద్‌ కార్యక్రమం జరిగింది. ఉదయం 7.15 గంటలకు బందరులాకుల వద్ద బస్సులను నిలిపివేసిన ప్రజలపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జి చేయడమేకాకుండా, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో డివైఎఫ్‌ఐ కార్యకర్త గుర్రం గోవిందు మరణించాడు. నలుగురం గాయపడ్డాం. గాయపడి వారిలో నేను (మల్లంపల్లి నాగేంద్రరావు) సంపర శ్రీనివాసరావుతో పాటు విజయవాడ షాప్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు నారాయణ, కృష్ణలంకకు చెందిన చిన్నా ఉన్నాం. కాల్పుల్లో గాయపడిన నన్నూ, నారాయణనూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మిగిలిన ఇద్దర్ని ప్రజా వైద్యశాలకు తరలించారు. నాకు తొడలో నుంచి తుపాకి గుండు దూసుకుపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోజు సాయంత్రం మోటూరు హనుమంతరావుగారు, అట్లూరు శ్రీమన్నారాయణగారితో కలిసి సుందరయ్యగారు ఆస్పత్రికి వచ్చారు. మా ఇద్దరినీ పరామర్శించారు. 'భయపడకండి. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు తీసుకెళ్దాం' అని అన్నారు. ఆ మాటలూ, ఆయన ఓదార్పూ మాకు ఎనలేని ధైర్యాన్నిచ్చాయి. ఇప్పటికీ అవి నాలో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్