మందలింపులోనూ మమకారం

సంపూర్ణ మాన వునిగా ఎదిగిన వ్యక్తి మందలిం పులోనూ మమకారం ధ్వనిస్తుంది. అటువంటి మహోన్నత వ్యక్తుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడిన అనుభవమే మాలాంటి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఆయన చూపిన మార్గాన చివరికంటా నడిచేలా చేస్తోంది. 1975 ఎమర్జెన్సీ రోజుల్లో మాకు యువజన సంఘంతో పరిచయం ఏర్పడింది. యువకులుగా పోరాట పథంలో నడిచాం. 1977లో మా స్వగ్రామం ప్రకాశం జిల్లా ఇంకొల్లులో సుందరయ్యగారితో పెద్ద మీటింగ్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. మా శాఖా కార్యదర్శి పి ఖైరాత్‌ఖాన్‌, బాధ్యులు అంజయ్య నాయకత్వంలో నిర్ణయం తీసుకుని బహిరంగ సభ ఖర్చుల కోసం విరాళాలు వసూలు చేశాం. ఆ సమయంలో గుంటూరులో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టారు. సుందరయ్యను కలసి సభకు ఆహ్వానిద్దామని అక్కడకు వెళ్లాం. సాయంత్రం బసవపున్నయ్య, సుందరయ్యగారిద్దరూ సమావేశం వద్దకు రాగానే విషయం చెప్పాం. విరాళాల విషయం చెప్పగానే సుందరయ్యగారు మమ్మల్ని నిలదీశారు. పార్టీ అంటే సుందరయ్యదేనా అని ప్రశ్నించారు. ఎవరిని అడిగి చందాలు వసూలు చేశారని నిలదీశారు. వెంటనే బసవపున్నయ్యగారు వారంతా కొత్తవాళ్లు కావడంతో పార్టీ పద్ధతులు తెలియవని సర్ది చెప్పారు. సభ ఏర్పాటుకు ముందుగా జిల్లా, తాలూకా కమిటీలను సంప్రదించమని సూచించారు. వెంటనే మోటూరు హనుమంతరావుగారిని కలసి చర్చించమని చెప్పారు. పార్టీలో పనిచేయడమంటే వ్యక్తి పూజ కాదని ఆనాడు ఆయన చెప్పిన మాటలే నేటికీ మాకు స్ఫూర్తిగా ఉన్నాయి. సుందరయ్యగారికి కార్యకర్తలంటే ఎనలేని ప్రేమ. యువజన సంఘం రాష్ట్ర తరగతులకు ఓసారి నేను వెళ్లాను. అక్కడ సుందరయ్యగారి క్లాసు విన్నాను. పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి ఆయన చెప్పిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. తర్వాత అనుకోకుండా సుందరయ్య గారితో పర్చూరులో బహిరంగ సభ నిర్వహించాం. ఆరోజు మమ్మల్ని ఆయన గుర్తించి పలకరించారు. సుందరయ్య గారి పేరు మీద వసూలు చేసిన సొమ్మును జిల్లా కమిటీకి జమ చేశాం. ఆ విరాళాలతో జిల్లా రైతు మహాసభ నిర్వహించారు. శాఖా కార్యదర్శిగా పనిచేసినన్ని రోజులూ క్రమం తప్పకుండా సుందరయ్యగారి వర్ధంతి సభలు నిర్వహించాము. కడదాకా పార్టీ సభ్యునిగా కొనసాగేలా నాకు స్ఫూర్తినిచ్చిన రూపం సుందరయ్యగారిదే! తుది శ్వాస విడిచే వరకూ ఆయన మార్గంలో నడుస్తాం.

- కలవకూరి హనుమంతరావు,

సిపిఎం సీనియర్‌ సభ్యులు,

ఇంకొల్లు, ప్రకాశం జిల్లా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్