సుందరయ్యగారు స్నేహశీలి. ఆయన ఎవరితోనైనా స్నేహం చేస్తే హృదయపూర్వకంగానే చేస్తారు. ఆ మనిషితో అవసరం ఉన్నంత వరకూ మాత్రమే స్నేహం చేసి తరువాత వదలివేసే అవకాశవాద స్నేహం కాదు ఆయనది. సందర్భవశాత్తూ చెబుతున్నాను. నాతో అవసరం ఉన్నంత వరకూ మాత్రమే స్నేహం చేసి తరువాత నన్ను వదిలేసిన 'మిత్రులు' కొందరున్నారు. మా ఇద్దరిదీ వీడని స్నేహం. అందుకు నేను గర్వపడుతున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే సుందరయ్యగారు స్వార్థం ఎరుగనివారు. నిరాడంబరుడు. నిగర్వి. వినమ్రుడు. పోజులు కొట్టడం, ప్రగల్భాలు పలకడం వగైరాలు ఆయనకు తెలియవు. పొగడ్తలు నచ్చవు. ఆయన నిష్కళంక దేశభక్తుడు. ప్రజా సేవకుడు. నిజమైన కమ్యూనిస్టు. మానవతా మూర్తి. ఆయన ఒక్క కమ్యూనిస్టులకేగాక దేశభక్తులందరికీ, ప్రజా సేవకులందరికీ ఆదర్శపురుషుడు. ఆంధ్ర దేశమే కాదు యావద్భారతమూ గర్వించదగిన ప్రజా తనయుడు.
- కొండేపూడి లక్ష్మీనారాయణ
(కామ్రేడ్ సుందరయ్యకు అరుణాంజలి పుస్తకం నుంచి)