అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి గురువారం లేఖ రాశారు. శిశు మరణాలు తగ్గింపు, పౌష్టికాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఐసిడిఎస్ పథకం రాష్ట్రంలో అరకొరగా అమలు జరగటం శోచనీయమని పేర్కొన్నారు. కాగ్ వెల్లడించిన వాస్తవాలు ఐసిడిఎస్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి నివాస ప్రాంతంలో ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు 2001 లోనే ప్రభుత్వాన్ని ఆదేశించిందని గుర్తుచేశారు. దశాబ్ధం గడిచినా నేటికీ ఈ ఆదేశాన్ని అమలు చేయలేదని తెలిపారు. పైగా రాష్ట్రంలో 91,307 కేంద్రాలను మంజూరు చేయగా 83,438 కేంద్రాలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మరో 7,824 కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం సరైనది కాదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమికంగా బరువు తూచే యంత్రాలు కూడా సరైనవి సరఫరా చేయకపోవటం విచారకరమని విమర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆటస్థలం, ఇతర అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రం నుండి రూ.56.32 కోట్లు కేటాయించినా వాటికనుగుణంగా పక్కాభవనాలు నిర్మించకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 80 శాతం అంగన్‌వాడీ కేంద్రాలు మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలకు నోచుకోటంలేదు. గాలీ, వెలుతురు లేని ఇలాంటి కేంద్రాల్లో ఉండే పిల్ల్లలకు మానసిక, శారీరక ఆరోగ్యం ఎలా సమకూరుతుందని ప్రశ్నించారు. నిధుల కేటాయింపుల్లోను, కేటాయించిన నిధులు ఖర్చు చేయటంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు తేటతెల్లమవుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థ అయిన కాగ్ నివేదిక చూశాకైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని రాఘవులు హితవు పలికారు. రాష్ట్రంలో ఐసిడిఎస్ నిర్వహణా బాధ్యతను వదిలించుకోవాలనే వైఖరి విడనాడాలి. ఐసిడిఎస్‌ని సంస్థాగతం చేసి మరింత పటిష్టవంతంగా అమలు చేయాలి. స్వచ్ఛంద సంస్థలకు లేదా ఇతర ప్రయివేటు సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే దీన్ని నిర్వహించాలి. పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని, మధ్యాహ్నభోజనాన్ని అందించాలి. రాష్ట్రంలో వున్న అంగన్‌వాడీ కేంద్రాలన్నింటికీ మౌలి క వసతులతో కూడిన పక్కా భవనాలు నిర్మించాలి. సెంటర్ నిర్వహణకు నాణ్యత కలిగిన ఉపకరణాలు అందించాలి. అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనాలివ్వాలి. ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని రాఘవులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
యుపిఎ పాలన కుంభకోణాలమయం
ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపు ఎన్నికలు?
మంత్రి బలరాం, ఎంపి రాజయ్యలకు కోర్టు సమన్లు
కళంకిత మంత్రులను తొలగించాలి: బిజెపి
సోలార్ బైక్, మిక్సీ ఆవిష్కరణ
కొనసాగుతున్న యానిమేటర్ల దీక్షలు
పోలీసుల అదుపులో అభయ గోల్డ్ ఎమ్‌డి
అగ్రిగోల్డ్ భూదందాపై ఇటిఎస్ సర్వేకు సన్నద్ధం
అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య