గాలి బెయిల్‌ కేసులో మరో ఎమ్మెల్యే

  • శ్రీరాములుకు ఎసిబి నోటీసులు
  • 21న హాజరుకావాలని ఆదేశం

గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ డీల్‌ కుంభకోణం కేసులో మరో ఎమ్మెల్యే చిక్కుకున్నారు. బిజెపికి రాజీనామా చేసి తిరిగి గెలుపొందిన మాజీమంత్రి, బిఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీరాములుకు తాజాగా ఎసిబి అధికారులు నోటీసులు అందజేశారు.

ఈనెల 21వ తేదీన ఎసిబి కార్యాలయంలో హాజరుకావాలని సిఆర్‌పిసి సెక్షన్‌ 167 కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎసిబి అధికారులు అందులో పేర్కొన్నారు. కర్ణాటక బళ్లారి హామామ్‌ బావి ప్రాంతంలో ఉండే శ్రీరాములు ఇంటికి హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం వెళ్లి నోటీసులు అందజేశారు. అయితే ఆ సమయంలో శ్రీరాములు ఇంట్లో లేకపోవడంతో నోటీసులను ఆయన భార్యకు అందజేసి, మరో నోటీసును ఇంటి తలుపుకు అతికించినట్లు తెలిసింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీలో జరిగిన అక్రమాలపై గాలి జనార్ధన్‌రెడ్డి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎసిబి ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసింది. వీరిలో ఎనిమిది మందిపై ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. ఇదిలావుండగా ఎసిబి అధికారులు న్యాయస్థానంలో దాఖలు చేసిన తొలి ఎఫ్‌ఐఆర్‌లోతన పేరు లేకపోవడంతో శ్రీరాములు కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిరోజుల్లోనే ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేయడం విశేషం. ఇదే కేసులో అరెస్టయిన కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌బాబు విచారణలో శ్రీరాములు పేరు చెప్పిన నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు.

శ్రీరాములును ఎసిబి అధికారులు కేవలం విచారించి పంపుతుందా లేక అరెస్టు చేసి జైలుకు పంపనుందా అనేది 21వ తేదీనాడు తేలిపోతుంది.

నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు

గాలి బెయిల్‌ బేరసారాల్లో గాలి బంధువు దశరథరామిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఎనిమిది మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. ఈమేరకు న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ను దఃఖలు చేశారు. నాలుగు వందల పేజీల ఛార్జిషీట్‌లో 50 మంది సాక్షుల పేర్లు పేర్కొంది.

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

బెయిల్‌ డీల్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన సిబిఐ మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు ఆయన కుమారుడు రవిచంద్ర, బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌బాబు, దశరథరామిరెడ్డి, న్యాయవాది ఆదిత్యల రిమాండ్‌ను ఎసిబి ప్రత్యక న్యాయస్థానం ఈనెల 24వ తేదీ వరకు పొడిగించింది.

óాను కిరణ్‌ ముఠాపై చార్జిషీట్‌ దాఖలు చేసిన సిఐడి

హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల కేటాయింపులకు పోటీపడిన వారిని బెదిరించిన కేసులో భాను కిరణ్‌ ముఠాపై సిఐడి అధికారులు శుక్రవారం నాడు ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. భాను కిరణ్‌, మంగళి కృష్ణ, నీలం శ్రీనివాస్‌, మోహన్‌రాజులపై సిఐడి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.