రాజకీయ పార్టీల నేతల పత్రికలపై ప్రత్యేక నిఘా భన్వర్‌లాల్‌

రాజకీయ పార్టీ నేతలు నడిపించే పత్రికలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఆదివారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల సొంత పత్రికల్లో తమ అభ్యర్థులను గెలిపించే విధంగా వార్తలు రాసినట్లయితే వాటిని కూడా పెయిడ్‌ ఆర్టికల్స్‌గా పరిగణిస్తా మన్నారు. ఈ పత్రికలపై సంబంధిత కమిటీలు ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. ఈ పత్రికలపై గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి పెయిడ్‌ ఆర్టికల్స్‌ పరిశీలనకు నియమించిన కమిటీలు వాటిపై దృష్టి కేంద్రికరించనున్నట్లు తెలిపారు. పెయిడ్‌ ఆర్టికల్స్‌పై అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత పరిశీలిస్తామన్నారు. కడప పట్టణంలోని మసీదులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా ఉప ఎన్నికల ప్రచారం చేశారని వచ్చిన వార్తలపై నివేదిక పంపించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లా కలెక్టర్‌ నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తామన్నారు. ఈవిఎంల మొదటి దశ తనిఖీని ఇసిఐఎల్‌ సంస్థ నిపుణులు చేశారని తెలిపారు. రెండో, మూడో దశ తనిఖీలకు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తామన్నారు. దీని కోసం నియోజకవర్గ స్థాయిలో కమిటీలున్నాయని చెప్పారు. జూన్‌ 10న ఓటర్ల జాబితా వెల్లడించనున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటరు జాబితా నమోదు కోసం ఈనెల 15వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వేల వరకూ ఓటర్లు పెరిగే అవకాశముందన్నారు. అదేవిధంగా ఈనెల 17న మధ్యాహ్నం 3 గంటలకు ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 8 పార్టీలు హాజరు కానున్నట్లు వెల్లడించారు. 139 కంపెనీల కేంద్ర బలగాలను కోరామని చెప్పారు. ఇప్పటి వరకూ రూ.8 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారని తెలిపారు. స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని, అయా పోలింగ్‌ కేంద్రాల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

Publiture