గొర్రెల బీమా పథకాన్ని అమలుచేయాలి

  • ఆంధ్రప్రదేశ్‌ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం డిమాండ్‌

గొర్రెల బీమా పథకాన్ని తక్షణమే అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్‌ గొర్రెలు, మేకల పెంపకదార్ల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మరో రెండు నెలల్లోనే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ గొర్రెల బీమా పథకాన్ని అమలుచేయకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య పేర్కొన్నారు. గతంలో ప్రతి గొర్రెకూ బీమా ప్రీమియం నాలుగు శాతం మాత్రమే ఉంటే, ఈ ఏడాది దాన్ని కంపెనీలు ఎనిమిది శాతానికి పెంచాయని తెలిపారు. ఇది గొర్రెల కాపరులకు తీవ్ర నష్టదాయకమని పేర్కొన్నారు. ప్రతిపాదిత రేటు భారంగా ఉందని సంఘాలు, పెంపకందార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సంప్రదింపుల పేరుతో ఈ పథకాన్ని ఇప్పటివరకు శ్రీకారం చుట్టలేదని తెలిపారు. దీంతో 2011-12 సంవత్సరానికి రూ. 1.25 కోట్లు కేటాయించినా నిరుపయోగమయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఏజెంట్‌ కమీషన్‌ పేరుతో సుమారు రూ. ఆరు కోట్లకుపైగా ఇన్సూరెన్స్‌ కంపెనీలు తినేశాయని, ఈ డబ్బులను వాపసు చేయాలని పశు సంవర్థక శాఖ కంపెనీలకు ఆదేశాలిచ్చినా అవి పెడచెవిన పెట్టాయని తెలిపారు. ఈ సంవత్సరం గొర్రెలను బీమా చేయాలని కోరితే ప్రీమియం పెంచితే కమీషన్‌ ఎక్కువగా వస్తుందనే ఆశతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు సిండికేటుగా ఏర్పడి ప్రీమియం రేటును ఏకంగా పెంచేశాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే అనేక వింతరోగాలు ప్రబలి జీవాలు చనిపోతున్నాయని, బీమా పథకం ఉన్నా ప్రయోజనం లేకపోవడంతో పెంపకందార్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గొర్రెల బీమా పథకం అమలుచేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ఏజెంట్లను తక్షణమే నియమించాలని, ప్రస్తుతమున్న గోపాలమిత్రలను, పశు వైద్యులను రంగంలోకి దింపి క్లస్టర్లను ఏర్పాటుచేసి గొర్రెలకు బీమా చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.