తప్పొకరిది - శిక్ష మరొకరికి
రాజకీయ పార్టీల నాయకులు కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ దురభిమానాలను రెచ్చగొడుతున్నారు. దీని ప్రభావం జనజీవనంపై అందునా విద్యా రంగంపై ఎంత తీవ్రంగా వుంటుందో వారికి పట్టదు. ఇంటర్ పరీక్షలు వారం రోజుల పాటు వాయిదా పడడానికి కారణం ఈ జిత్తులమారి రాజకీయనాయకులు, కుహనా మేధావులే. జాతి నిర్మాణం తరగతి గదుల్లోనే జరుగుతుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి చెప్పారు. అటువంటి జాతి నిర్మాణానికి ఆలవాలమైన విద్యా సంస్థలను తమ విద్వేషపూరిత, సంకుచిత వాదాలతో కలుషితం చేయడం శోచనీయం. విద్యార్థి జీవితంలో పరీక్షలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఇతర అన్ని పరీక్షలను దృష్టిలో వుంచుకుని ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ఖరారు చేస్తారు. దానికనుగుణంగా విద్యార్థుల మైండ్‌సెట్ ఫిక్స్ అవుతుంది. ఏ పాఠ్యాంశానికి ఎన్ని రోజులు కేటాయించాలి. ఇంటర్ తరువాత జరిగే ఎంసెట్‌కు ఎలా సిద్ధం కావాలి. ఇంటర్ ఆధారంగా జరిగే యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు, ఇతర ప్రతిష్టాత్మక కోర్సుల ఎంట్రెన్స్‌లకు ప్రిపరేషన్ ఏర్పాట్లు చేసుకోవాలి..ఇక నిర్వహణా పరంగా చూస్తే కళాశాలల్లో పరీక్షలకు ఏర్పాట్లు, వాల్యుయేషన్, ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాల తరలింపు, ఫలితాలు సకాలంలో వెల్లడించడం వంటి సన్నాహాలు చేసుకుంటారు. ఇంటర్ తరువాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి ఇంటర్ పరీక్షలు వాయిదా పడితే దాని ప్రభావం టెన్త్ పరీక్షలపై కూడా పడుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఒక్క రోజు పరీక్ష వాయిదా పడినా అటు విద్యార్థులకు, ఇటు పరీక్షా నిర్వాహకులకు అనేక సమస్యలు తెచ్చి పెడతాయి. పకృతి వైపరీత్యాలు వంటివి వచ్చినప్పుడు పరీక్షలు వాయిదా పడితే వాటిని అర్థం చేసుకోవచ్చు, కానీ, రాజకీయ పార్టీల అవకాశవాద రాజకీయాల మూలంగా పరీక్షలు వాయిదా పడితే అది క్షమార్హం కాని నేరం. విద్యార్థులు కూడా ఆలోచించాలి. ఏ ఉద్యమం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి వున్నాయో ఆలోచించనంత కాలం రాజకీయ స్వార్థ పర శక్తులు తమ ఆటలు సాగిస్తూనే వుంటాయి . ఆ ఉద్యమం న్యాయమైనది, ప్రజా ప్రయోజనాలతో కూడినది అయినప్పుడు వాటికి సంఘీభావంగా ప్రజాతంత్రయుత పద్ధతుల్లో విద్యార్థులు నిరసన తెలపవచ్చు. అది కూడా చదువుకు ఇబ్బంది కలగని రీతిలో చేయాలి. పరీక్షలు వాయిదా పడితే రాజకీయ నాయకులకు పోయేదేమీ లేదు అంతిమంగా నష్టపోయేది విద్యార్థులే.
కె ప్రియాంక, సంగారెడ్డి.
అదే తప్పు మళ్లీ చేయొద్దు
1969 నాటి తప్పులను తెలుసుకొని కూడా మరలా విద్యార్థులను ప్రాంతీయ ఉద్యమాలలోకి లాగటం మరోమారు తప్పు చేయడమే అవుతుంది. ప్రస్తుతం ప్రాంతీయవాద రాజకీయ ఉద్యమంలోకి విద్యార్థులను దించటం మొదటి తప్పు అయితే, విద్యార్థుల పరీక్షలు వాయిదా వేయడం రెండవతప్పు. విద్యార్థులకు ఉండే బలహీనత వాడుకోవటం దురదృష్టకరం. రాజకీయ ఉద్యమాలు అనేవి కొద్దిమంది విద్యార్థులను నాయకులుగా మార్చగలవు కాని, అందరి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడలేవు. ఈ రోజున దేశంలో 10+2 తరగతులకు ప్రాధాన్యత ఉన్నది. ఇది కీలకదశగా తల్లిదండ్రులు అందరూ భావిస్తున్నారు. విద్యార్థుల జీవితంలో కాలం చాలా విలువైనది. విద్యార్థులకు నేటి పోటీ ప్రపంచంలో అంతర్గతంగా, బహిర్గతంగా ప్రతి నిమిషం విలువైనది. ఒకప్పుడు విద్యార్థులకు అవకాశాలు స్థానికంగా ఉండేవి కాని, నేడు గ్లోబల్‌గా ఉన్నాయి అనేది మనమందరం గమనించాలి. కనుక తాత్కాలిక అవసరాల కోసం విద్యార్థులను ఉపయోగించుకోకుండా విద్యార్థుల శాశ్వత అవసరాలను తీర్చుకొనేందుకు అనువైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన వుంది.
ఏలూరు పిచ్చేశ్వరరావు, నందిగామ, కృష్ణాజిల్లా.
వాయిదా సరికాదు
అనుకోని పరిణామాలు ఏర్పడినప్పుడు (తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల ఉద్యమ నేపథ్యంలో) ప్రత్యేక విధానంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రైవేట్ క్లాసెస్ ద్వారా (అదనపు తరగతుల నిర్వాహణ) సిలబస్‌ను పూర్తిచేసి విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని కాపాడేలా చూడాలి. అంతేకానీ పరీక్షలు వాయిదా వేయటం వల్ల సమస్య పరిష్కారం కాదు. ముఖ్యంగా ఇంటర్, టెన్త్ విద్యార్థులు అదనపు కోర్సుల పరీక్షలకు హాజరయ్యేవారు ఈ మార్పుల వల్ల ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యాసంస్థల, ఉపాధ్యాయుల మీద ఉంది. ఎపిపిఎస్‌సి పరీక్షలు లాంటి ప్రత్యేక పరీక్షలను వాయిదా వేయటం కూడా పరీక్షార్థులను నిరుత్సాహపరిచి వారిని నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్నది. కాబట్టి యంత్రాంగం ఎప్పటివలే పరీక్షలను వాయిదా వేయకుండా అదనంగా తరగతులను కానీ, ప్రత్యామ్నాయ పద్ధతులను కానీ పాటించి విద్యార్థుల భవితను, విద్యా సంవత్సర విలువలను పరిరక్షించాలి. ఇంతకుముందు సంవత్సరాలలో సుమారుగా దశాబ్దం క్రితం ఏ చిన్న విపత్తు ఏర్పడినా రాష్ట్రంలో ప్రధానంగా టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షలు వాయిదా వేసేవారు. ఆ సంస్కృతి పునరావృతం కానీయకుండా చూడాలి.
కె.వి.ఎస్. నరసింహం, విశాఖ.
చదువులు త్యాగం చేయొద్దు!
తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో తెలంగాణా రాష్ట్ర సమితి, కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి వంటి పార్టీలు విద్యార్థుల, యువకుల భవిష్యత్‌ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నది. పోరాటంలో వీరుల్లా చావడం వుంటుంది కాని, ఆత్మహత్యలు ఉండవు. ఈ తెలంగాణ సాధన కోసం చేస్తున్న ఉద్యమం ఆత్మహత్యలకు పురిగొల్పడం వలన ఉద్యమంలో ఈ లోపం ఉన్నట్లే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు కానీ, వారి పిల్లలు గాని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. తెలంగాణ కోసం విద్యార్థులు తమ చదువులు త్యాగం చేయనక్కర్లేదు. తెలంగాణ పోరాటం పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదు అని గుర్తించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చని ఉద్యమం కోసం విద్యార్థులు ప్రాణాలు అర్పించి తల్లిదండ్రులను ఏడిపించవద్దు. మీ భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నవారిని విషాదంలో ముంచవద్దు.
వి. కామేశ్వరరావు, హైదరాబాద్.
సముచితమే
రాష్ట్రంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల వల్ల విద్యార్థుల చదువుకు విఘాతం కలిగింది. ఇంటర్‌లో లక్షలాది మంది పరీక్షలు రాయవలసి ఉంది. వీటిని హడావుడిగా పెట్టే బదులు ఆ తరువాత పెడితే మంచిది. కాబట్టి పరీక్షలు వాయిదా వేయడం సుముచితమే.
ఎస్.ఎ కరీం, తెనాలి.
చదువులకు విఘాతం
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అలజడి, గందరగోళ పరిస్థితుల్లో సగటు విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తమ వేలితో తమ కంటినే పొడుచు కుంటున్నామన్న సంగతిని ఇప్పటికైనా విద్యార్థులు గుర్తించాలి. లేకుంటే సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదమేర్పడవచ్చు.
- అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం, హైదరాబాద్.
భవనాలు- భద్రతపై మీమాట
రాష్ట్ర రాజధాని నడి బొడ్డున వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. పదిహేను మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మొదటిది సోమాజి గూడలోని పార్కు హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం. రెండవది నారాయణ గూడలో నిర్మాణంలో వున్న బహుళఅంతస్థుల భవనం కుప్పకూలిన ఘటన. ఈ రెండు ఘటనలతో భవనాలు- భద్రత ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గనుక దీనిపై మీరేమనుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మీ ప్రాంతాల్లో ఏవైనా నిర్మాణాలు జరిగి వుంటే వాటిని ఆధార సహితంగా సూటిగా, క్లుప్తంగా తెలియజేయండి. ఆదివారం వేదికలో చూడండి. ఫ్యాక్సు ద్వారా కూడా మీ అభిప్రాయాలను పంపవచ్చు.
చిరునామా: వేదిక, ప్లాట్ నెం. 21/1, ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర, అజామాబాద్ ఇండిస్టియల్ ఏరియా, ముషీరాబాద్, హైదరాబాద్-20 ఫ్యాక్స్ నెం: (040) 27639921