ప్రభుత్వ భద్రతా వైఫల్యం పై పాఠకుల స్పందన

భద్రతను గాలికొదిలేశారు

హైదరాబాద్‌ సంఘటన ఘోరం. మన పాలకులకు మాత్రం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా కనువిప్పు కావడం లేదు. భద్రతను గాలికొదిలేసి ఎంత సేపూ కుర్చీ కోసం పాకులాడుతున్నారు తప్ప రక్షణ కల్పించే బాధ్యత తమకేమీ లేదనుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు పాలకుల మెప్పు పొందామా? లేదా? అనే విషయంలోనే కొట్టుమిట్టాడుతున్నారు మినహా రక్షణ కల్పించే ధోరణిలో లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌ సంఘటనపై స్పందించిన తీరును పరిశీలిస్తే తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ముందే సమాచారం ఇచ్చామని కేంద్రం, సమాచారం మామూలేనని రాష్ట్రం చెబుతోంది. అంటే భద్రతపై మన పాలకులకు ఏవిధమైన స్పష్టత ఉందో గమనించవచ్చు. హైదరాబాదు లాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలి.

కట్ట రాజు, రెడ్డిపల్లి,కరీంనగర్‌ జిల్లా

ముందస్తు చర్యలేవీ?

కేంద్ర ప్రభుత్వం హైద రాబాద్‌లో బాంబు పేలుళ్లు జరగవచ్చునని హెచ్చరించి నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రొటీన్‌గా తీసుకుంది. కానీ జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంతకు ముందు హైదరా బాద్‌లో జరిగిన పేలుళ్ల నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదు. శాంతిభద్రతలనేవి రాష్ట్రానికి గుండెకాయ వంటిది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయడం దారుణం. 1998లో తమిళనాడులోని కోయం బత్తూరులో జరిగిన బాంబు పేలుడు నుంచి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వల్ల అక్కడ అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం పక్కనున్న తమిళ నాడును చూసి బుద్ధితెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర మాని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి. ఉగ్రవాద ఛాయలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకోవాలి.

ఎస్‌ దేవరాజు, కోదాడ

పాలకుల్లో చిత్తశుద్ధి అవసరం

హైదరాబాద్‌లోని బాంబు పేలుళ్లకు ఇంటెలిజెన్స్‌ వైఫల్యమే కారణమని స్పష్టంగా కన్పిస్తోంది. ఉగ్రవాద భూతం భారతావనికే కాక యావత్‌ ప్రపంచానికే కొరకరాని కొయ్యగా తయారైంది. ముఖ్యంగా మన దేశంలో ముందుచూపు కొరవడటం వల్లే ఈరోజు ఉగ్రవాదం మనకు పక్కలో బల్లెంలా ఎదిగింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన భద్రతా దళాలు ఎంతసేపూ విఐపిలను రక్షించడానికే పరిమితయ్యాయిగానీ ఉగ్రవాదాన్ని బలహీనపర్చటంపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఏదిఏమైనా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చిత్తశుద్ధితో పాలకులు వ్యవహరించాల్సి ఉంది.

బగాది శ్రీరామ్మూర్తి, ఆముదాలవలస, శ్రీకాకుళంజిల్లా

పాలకుల నిర్లక్ష్యమే కారణం

ఉగ్రవాద చర్యలకు అమాయక ప్రజలు బలికావడం కొత్తేమీ కాదు. ఈ సమస్య అంతం కాదు ఆరంభమేనని అంగీకరించినంత కాలం ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం అవుతాయి. కేవలం నిఘా సంస్థల వైఫల్యాలు మాత్రమే కాదు, పాలకుల నిర్లక్ష్యం కూడా ఉంది. వీటిని ఎదుర్కోవడంలో పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తుంది. ఉగ్రవాదాన్ని అంతమొందిం చడంలో కేవలం పాలకులే గాక ప్రతిపౌరుడూ నడుం కట్టాలి. ఇలా అందరూ కలిసికట్టుగా దేశం గురించి ఆలోచిస్తే ఉగ్రవాదం లేకుండా పోతుంది.

పిఎన్‌ రాజు, సంతబొమ్మాళి