చక్కర నియంత్రణ ఎత్తివేతపై పాఠకుల స్పందన

ధర చుక్కలంటుతుంది

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణను ఎలా ఎత్తేసిందో అదే విధంగా ఇప్పుడు చక్కెరపై కూడా నియంత్రణ ఎత్తేయాలనే ప్రయత్నంలో ఉంది. దీనివల్ల చక్కెర ధర అమాంతం పెరిగిపోతుంది. దీంతో సామాన్య ప్రజలకు చక్కెర కొనుగోలు చేయడం కష్టతరమవుతుంది. చక్కెర ధర పెరగడంతో స్వీట్‌షాపులవారు, పరిశ్రమలు చాలా నష్టపోతాయి. అలాగే రేషన్‌కార్డు ద్వారా లభించే చక్కెర కూడా లభించదు. దాని ద్వారా లభించే చక్కెరను కూడా కోల్పోతారు. ధర నియంత్రణ తొలగింపు అంటేనే కేంద్రం ఇచ్చే సబ్సిడీని ఎత్తేయడమనే అర్థం. ఆహార శాఖామంత్రి తీసుకోబోతున్న ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది నష్టపోయే అవకాశాలున్నాయి. యుపిఎ ప్రభుత్వం అన్నింటిపై ధర నియంత్రణ ఎత్తివేసి ప్రజలపై భారాలు వేసి ఆ డబ్బును కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పే యత్నమే తప్ప సామాన్య ప్రజల గురించి పట్టించుకోవడమే మానేసింది. బియ్యం, చక్కెర, పప్పుధాన్యాలు అన్నీ పెంచుకుంటూపోతే ఇక జనం ఏం తింటారు, ఎలా బ్రతుకుతారు? ఈ వ్యవహారమంతా చూస్తే యుపిఎ ప్రభుత్వం ఆలోచనా ధోరణి ప్రజలను ఆహారం కాకుండా కేవలం గాలి పీల్చుకొని బ్రతకమనేలా ఉంది.

- ఆర్‌ సురేష్‌, ఖమ్మం

మిల్లర్ల లాభాల కోసమే !

మిల్లర్లు, షుగర్‌ ఫ్యాక్టరీల వారికి మార్కెట్‌లో ఎక్కువ లాభాలు రావడానికి అనుకూలంగా చేస్తున్నారు. ముఖ్యంగా చెరకు పంటకు కావాల్సిన విత్తనం, ఎరువులు, నీరు, చెరకు కటింగ్‌ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పైగా చెరకు ఫ్యాక్టరీల వారు తూకంలో కూడా మోసం చేస్తారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచదార డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతుంది. జంక్‌ ఆహారాల్లోనూ, పిల్లల స్వీట్స్‌లోనూ, డ్రింక్‌ల తయారీలోనూ విపరీతంగా పెరిగిపోయింది. అయినా చెరకు రైతుకు గిట్టుబాటు ధర మాత్రం ఉండటం లేదు. దీంతో చెరకు రైతు చాలా నష్టపోతున్నాడు. అలాగే ఇటీవలి కాలంలో ఆహార శాఖామంత్రి చక్కెర ధరపై నియంత్రణ తొలగించే యోచన ఉందంటూ ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఇది చెరకు రైతుకు, వినియోగదారులిద్దరికీ నష్టమే.

వై సత్యనారాయణ, విజయవాడ

చక్కెరకు రెక్కలొస్తాయి

చక్కెర ధర నియంత్రణ ఎత్తివేతపై చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలే ఇంకా వాటి అభిప్రాయాలు చెప్పనేలేదు. అప్పుడే ఆహారశాఖా మంత్రి కెఎస్‌ థామస్‌కు చక్కెర నియంత్రణపై 10 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలియజేశాయంటున్నారు. ఇంకేముంది ఇది చాలదూ యుపిఎ ప్రభుత్వానికి. సెంటిమీటరు గ్యాప్‌ ఇస్తే కిలోమీటరు దూసుకుపోయేటట్లు మన కేంద్ర పాలకులు అదే ఆలోచనలో ఉన్నారు. కేంద్రంగానీ, రాష్ట్రంగానీ చక్కెర గురించే ఆలోచిస్తున్నారుగానీ, దాన్ని పండించే రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు చెరకును సాగుచేయడం నిరాశకు గురవడం జరుగుతూనే ఉంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ సి రంగరాజన్‌ కమిటీ చేసిన సిఫార్సుల పర్యవసానమే ఈ నియంత్రణ ఎత్తివేత. ఇవేగాక చక్కెరను బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే స్వేచ్ఛ మిల్లులకు ఇవ్వాలని రంగరాజన్‌ కమిటీ సూచించింది. వీటిని పరిగణనలోకి తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవాలి.

- దివ్య, హైదరాబాద్‌