కెవిపిఎస్‌ నాయకుల అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

వీరఘట్టం :

నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధులను కేటాయించి దళితుల అభివృద్ధికి ఖర్చుచేయాలన్న డిమాండ్‌తో అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన కెవిపిఎస్‌ రాష్ట్ర, జిల్లా నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద శుక్రవారం కెవిపిఎస్‌ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బి.రాము మాట్లాడుతూ, గతేడాది ఆరు వేల783 కోట్లు కేటాయించాల్సి ఉండగా, మూడు వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదని, ఖర్చు చేసినది కూడా ధనికుల ప్రయోజనాలకు ఉపయోగించారని చెప్పారు. దళితుల జనాభా 16.2 శాతం ఉంటే కేటాయింపులు మాత్రం నామ మాత్రంగానే ఉన్నాయన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం తగదన్నారు. దీన్ని ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని కోరారు. నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధులను వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వై.గేయమూర్తి, సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌ అమ్మన్నాయుడు, గిరిజన సంఘం అధ్యక్షులు బి.నాగరాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

పాలకొండలో...

దళితులకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరుతూ ఛలో హైదరాబాద్‌ నిర్వహిస్తున్న వారిపై లాఠీచార్జి చేయడం అమానుషమని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సూర్యనారాయణ, డి.ఈశ్వరరావు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో 16.5 శాతం నిధులను ఎస్సీలకు, 6 శాతం నిధులను ఎస్టీలకు కేటాయించాలని, జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులతోపాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జి.ప్రియాంక, వి.దుర్గారావు, ఆటో యూనియన్‌ నాయకులు, ఐద్వా నాయకులు పద్మ తదితరులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్