తాగునీటిపై తక్షణమే స్పందించాలి

  • ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు
  • అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి కొరత ఏర్పడితే తక్షణమే స్పందించి ఆ గ్రామంలో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగులాపల్లి శ్రీకాంత్‌ గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులు జిల్లాలో అందుబాటులో ఉన్నందున ఎక్కడా తాగునీటి ఎద్దడికి తావులేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు జిల్లాలో తాగునీటి సరఫరా, కరువు రైతులకు పంట నష్టపరిహారం పంపిణీపై కలెక్టర్‌ తన కార్యాలయంలో సమీక్షించారు. 12వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.60 కోట్లు అందుబాటులో ఉన్నందున జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మరమ్మతులకు గురైన రక్షిత నీటి సరఫరా పథకాలను మార్చి నెలాఖరులోగా పునరుద్ధరించి ఆయా గ్రామాల్లో వెంటనే ఈ పథకాల ద్వారా నీటిని అందించాలని ఎస్‌ఇ కాంతానాధ్‌ను ఆదేశించారు. గ్రామాల్లో బోర్ల మరమ్మతులకు సంబంధించి ఎంపిడిఓల వద్ద అందుబాటులో ఉన్న నిధులను వినియోగించి బోర్లకు అవసరమైన విడిభాగాలు కొనుగోలు చేయించాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి వనరులు లేని పక్షంలో ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, బోర్లను లోతు చేయడం తదితర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని చోట్ల పరిశ్రమల అవసరాల కోస1ం బోర్లను తవ్వి వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటి చోట్ల వాల్టా నిబంధనలకు అనుగుణంగా లేని బోర్లను మూసి వేయించాలని ఆర్డీవోలను ఆదేశించారు. నదుల్లో రక్షిత నీటి సరఫరా పథకాలకు సంబంధించిన బోర్లు వేసిన ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు తెలుస్తోందని, అటువంటి చోట్ల ఆర్డీవోలు దాడులు చేసి అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేసే వారిపై, అనుమతించిన ప్రదేశంలో కాకుండా వేరే చోట మైనింగ్‌ చేసే వారిపై కూడా ఆర్డీవోలు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలో కరువు ప్రాంతాల్లో రైతులకు విడుదలైన పంట నష్ట పరిహారాన్ని వెంటనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో పశుగ్రాసం లభ్యత, పశుగ్రాసం ఉత్పత్తి లేదా దిగుమతి కోసం ఒక నివేదిక సమర్పించాలని పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంహెచ్‌.షరీఫ్‌, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఇ కాంతానాధ్‌, వ్యవసాయశాఖ జెడి ఎన్‌.వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ బి.విజయసారధి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఓ సురంగి మోహనరావు, ఆర్డీవోలు ఎన్‌.సత్యనారాయణ, సిరి, అరుణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్