రాజాం నగర పంచాయతీ పరిధిలోని మెంతిపేట ఎస్సీ కాలనీ అభివృద్ధిలో కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది నెలల కిందట రూ.33 లక్షలతో పనులను ప్రారంభించినా మెంతిపేటకాలనీని గుర్తించకపోవడంపె వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై గతంలో కాలనీవాసులు ఆందోళన చేయగా మూడు లక్షలు నిధులు మంజూరు చేసినా నేటికీ పనులు ప్రారంభించకపోవడంతో కాలనీవాసులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సామాజిక భవనాలు మంజూరులోనూ, రూ.25లక్షల అభివృద్ధి పనుల్లో కూడా కమిషనర్ వివక్షత చూపారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
సామూహిక మరుగుదొడ్లు కావాలని జిఎంఆర్ ఫౌండేషన్‌కు నగరపంచాయతీ ద్వారా దరఖాస్తు చేసి ఏడాదైనా దరఖాస్తు వారికి చేరకపోవడం కమిషనర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని కాలనీవాసులు చెబుతున్నారు. కాలనీలో పబ్లిక్ కుళాయిల కోసం మహిళలు చందాలేసి పైపులైన్లు సామాన్లు కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. మెంతిపేట ఎస్సీ కాలనీకి న్యాయం చేయాలని కమిషనర్‌ను మహిళా సంఘం నాయకులు పి.వెంకటలక్ష్మి, సులోచనమ్మ, రమణమ్మతోపాటు కాంగ్రెస్ నాయకులు పి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, రామజోగులు, దుర్గారావు తదితరులు కోరుతున్నారు.