స్తానిక మేజర్ పంచాయతీకి సంబంధించిన ఏదైనా సంతకం కావాలంటే మీరు ఢిల్లీ వెళాల్సిందే. ఏమిటి సంతకానికి ఢిల్లీ వెళ్లాలా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి. ఇక్కడున్న పాలకవర్గంతోపాటు పంచాయతీ అధికారులు కూడా ఈ నెల 4వ తేదీన విహార యాత్రల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇక్కడి బాధ్యతలు చూడడానికి ఇఓపిఆర్‌డి విజయలక్ష్మిని ఇన్‌ఛార్జి ఇఓగా నియమించినప్పటికీ ఆమె పంచాయతీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలులేవు. దీంతో కార్యాలయానికి వివిధ పనులు మీద వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పాలన స్తంభించింది. కనీసం నివాస ధ్రువపత్రాలు కూడా మంజూరు చేయడానికి ఇఓ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కారణంగా నీటి కష్టాలు ప్రారంభమై మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీటి కష్టాలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు షికారు చేయడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పనులూ కూడా చేయని ఇన్‌ఛార్జి ఇఓ నీటి కష్టాలేమి తీరుస్తారని పలువురు చర్చించుకొంటున్నారు. పంచాయతీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసే అధికారం లేదంటూ ఇన్‌ఛార్జి ఇఓ చేతులేత్తేశారు. వచ్చాం.. వెళ్లాం... అన్న చందంగా పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జనన, మరణాలను నమోదు చేసే గుమస్తా కూడా సెలవులో విహార యాత్రకు వెళ్లడంతో ఆ పత్రాలు కూడా ఇవ్వడానికి ఎవరూ లేకపోయారు. జిల్లా ఉన్నతాధికారులు పాలకొండ మేజర్ పంచాయతీపై దృష్టిసారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.