వంగర మండలం లకిëంపేట దళిత ప్రజల చట్టబద్ధమైన డిమాండ్లను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఈనెల 22న తలపెట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షులు పి.బెంజిమెన్ పిలుపునిచ్చారు. బెల్లుపడకాలనీలో శుక్రవారం దళితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టులని రాజకీయ ప్రకటనలు చేస్తుందే తప్ప అమలుకు చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. దళిత ప్రజల జీవనాధారమైన 250 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక సెంటు భూమిని కూడా పంపిణీ చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 89 ప్రకారం దళితులకు రావాల్సిన సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. లకిëంపేటలో జరిగిన దాడిలో ఐదుగురు మృతి చెందగా, 19 మంది క్షతగాత్రులయ్యారని, వీరితోపాటు వ్యవసాయ పనులు చేయలేని స్థితిలో ఉన్న వారికి సైతం ప్రభుత్వం శాశ్వత పునరావాసం కల్పించలేదని విమర్శించారు. ప్రధానమైన డిమాండ్ల పరిష్కారానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, 19 మంది క్షతగాత్రులకు రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు ప్రతినెలా రూ.ఐదు వేలు పింఛన్ అందించాలని, సిబిఐ విచారణ జరిపి ప్రధాన నిందితులను అరెస్టు చేయాలని తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు ఈనెల 20న ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని కోరారు. సమావేశంలో జిల్లా దళిత నాయకులు ఆర్.సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బి.నూకరాజు, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.