'ఆఫ్‌షోర్‌' పనులు వేగవంతం చేయాలి

మండలంలోని రేగులపాడు వద్ద నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన పలాస కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.127 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వీటిని వేగవంతం చేసేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌కు సంబంధించిన మార్కులు, ర్యాంకులు వేర్వేరుగా ప్రకటించడం వల్ల కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయన్నారు. దీని వల్ల విద్యార్థులు పూర్తిగా నష్టపోతారన్నారు.

రాష్ట్రంలో అవినీతి మహావృక్షంలా పెరిగిందని, ఉన్నతస్థాయి అధికారులు అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సాక్షి దినపత్రిక, టివి ఛానల్‌లో పెట్టుబడి దారుల అవినీతిని బయటపెట్టాలని, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఇటీవల నిర్వహించిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఫలితాలు, మార్కులు ఒకేసారి విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయా వర్గాల ప్రజలతో పోరాటాలు చేస్తామన్నారు. ఆయనతోపాటు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర సుందరలాల్‌, నాయకులు చాపర వెంకటరమణ, సింహాచలం, వెంకటరావు, కణితి దామోదరం, రమేష్‌, మహర్ణా ఉన్నారు.

పలాస కోర్టుకు హాజరైన నారాయణ

మండలంలోని కంబిరిగాంలో భూపోరాటం భాగంగా రెండేళ్ల క్రితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆధ్వర్యంలో కంబిరిగాంలో దుక్కి దున్నడం, అప్పటి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఆయన పలాస కోర్టుకు హాజరయ్యారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్