దోమలు బాబోరు.. దోమలు

పజాశక్తి - శ్రీకాకుళం, గుజరాతీపేట

పల్లెలోను, పట్టణాల్లోను పారిశుధ్య లోపం ప్రజల పాలిటి శాపంగా మారింది. పంచాయతీ పాలన, పురపాలన స్థానంలో అధికారుల పాలన వచ్చినా ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని తేలిపోయింది. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడ ఉండటం మాటెలా ఉన్నా, పారిశుధ్యలోపం, కాల్వలు లేకపోవడంతో రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహించడం వల్ల దోమల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టే విషయంలో కూడా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. గతంలో తరచూ వార్డుల్లో తిరుగుతూ ఫాగింగ్‌ చేయడం వల్ల కొంతమేరకైనా దోమలు తగ్గే అవకాశం ఉండగా, ఇప్పుడు వాటిని అధికారులు పూర్తిగా విస్మరించారు.కాల్వల్లో పూడికతీత కోసం లక్షలాది రూపాయలు నిధులు వెచ్చించినా పనులు మాత్రం నామమాత్రంగా కూడా సాగ లేదు. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాలు వ్యాపించడం కొత్తేమీ కాదు. మన్యంలో గన్యా జ్వరం కొంతకాలం ఉంటే, మలేరియా జ్వరాలు మరికొద్దికాలం, డయేరియా లాంటి వ్యాధులతో కొంతకాలం గిరిజనులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా దీనిపై ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం వల్ల జనం తీవ్రంగా నష్టపోతున్నారు. సర్కారు ఆసుపత్రిలో అంతగా వైద్యం అందించకపోవడం, మందులు లేకపోవడం లాంటి కారణాలు వల్ల ప్రయివేటు ఆసుపత్రుల వైపు ప్రజలు వెళ్తూ వేలాది రూపాయలు వెచ్చించాల్సివస్తోంది. రాత్రి వేళల్లో విద్యుత్‌ కోత కూడా ప్రజల పాలిట శాపంగా మారింది.

పల్లె పట్టణం అనే తేడా లేదు. పగటి పూటే రరు మంటూ మోత. చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రాత్రి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దోమలు కాటుతో మహ్మరి మలేరియా జ్వరం సోకితే బాధితుడి జేబు గుల్లే నిర్లక్ష్యం చేస్తే ప్రాణ సంకటమే. ప్రభుత్వం మొక్కుబడిగా చేపడుతున్న చర్యలుతో ఫలితాలు రావడం లేదు. నవజాతి శిశువులు చిన్నారులు, యువత, మధ్య వయస్కులు, పండుటాకులనేది లేదు, అన్ని వర్గాలను నీడలా వెంటాడుతూ మానసిక సంఘర్షణకు గురిచేస్తోంది ఈ వ్యాధి.

మలేరియా..

చూసేందుకు చిన్న పదమే, ఇదే వైద్య ఆరోగ్యశాఖకు సవాలు విసురుతోంది. ప్రభుత్వ దవాఖానాకు వెళ్లితే ఉన్న ప్రాణం గాలిలో కలుస్తుందని చాలా మంది ప్రయివేటు వైద్యశాలలు గడప తొక్కుతున్నారు. వేలాది రూపాయలను ఈ జ్వరాలు మింగేస్తున్నాయి.

ఎక్కడెక్కడ..

కొండ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పైగా అడవుల్లో నిద్ర చేస్తే అక్కడ కుట్టిన దోమలతో వచ్చే అవకాశం ఉంది.

మలేరియా లక్షణాలు

తీవ్రమైన చలి.. వణుకుతో కూడిన జ్వరం..ఒంటినొప్పులు ఈవ్యాధి ప్రధాన లక్షణాలు దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే మలేరియా మితిమీరుతోంది. రక్త పరీక్షల ద్వారా నిర్థారణ చేయెచ్చు. ప్లాస్మోడియా జాతికి చెందిన పరాన్న జీవులు, క్రిముల ద్వారా వ్యాధి సంక్రమిస్తోంది. 'అనాఫిలిన్‌' రకం దోమ కాటుతో ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, ముందస్తుగా అధికారులు గుర్తించినా అక్కడ దోమలు వృద్ధి చెందకుండా డిడిటి పిచికారి చేసే నాథుడే లేడు. ఏటా వేలాది మందికి దోమ తెరలు పంచిపెడుతున్నట్లు అధికారులు చూపే లెక్కలు కూడా అమలు జరిగే తీరుకు విరుద్ధంగా ఉంటున్నాయి. దోమల కాటు నుంచి రక్షణ పొందాలంటే దోమ తెరలను వాడాల్సిందే. సెరిబ్రల్‌ మలేరియా వస్తే వెంటనే వైద్య చికిత్స పొందాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నం కెజిహెచ్‌ ఆసుపత్రిలో మలేరియా జ్వరాలతో చేరుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలకు చెందినవారే. దోమల నివారణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే తప్ప వ్యాధులు బారి నుంచి రక్షించడం అంత సులభసాధ్యం కాదు.