రణస్థలం మండలం పైడిభీమవరంలోని ఆంధ్రాఆర్గానిక్స్ పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తున్న పిషిణి గ్రామానికి చెందిన కోరాడ అప్పలరాజు(30)పై 140 డిగ్రీలు గల కెమికల్స్ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పలరాజు శనివారం 'ఎ' సిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా రసాయనాలు శరీరంపై పడడంతో పెద్దకేకలు పెట్టాడు. వెంటనే సహ కార్మికులు వచ్చి హుటాహుటిన విజయనగరం తిరుమల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు విశాఖపట్నం సంజీవిని ఆసుపత్రికి రిఫర్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, మండల నాయకులు అమ్మన్నాయుడు, యూనియన్ నాయకులు మైలపల్లి శ్రీనివాసరావు, మురళి, ఐ.సురేష్, నాగరాజు, విశాఖపట్నం సంజీవిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన వైద్యసేవలు అందించి, కార్మికునికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడంతో ప్రమాదాలకు కారణమని తెలిపారు. కార్మికునికి రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు మరలా జరగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.
java.lang.NullPointerException