2012 లండన్ ఒలింపిక్స్‌లో సోమాలియా పాల్గొంటోంది. విశేషమేముంద నుకుంటున్నారా? ఉంది. నిషేధిత అల్ ఖయిదా ఉగ్రవాదుల తుపాకీ తూటాల యుద్ధ భూమిగా సోమాలియా నిలిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొనరాదని సోమాలియను అల్ ఖయిదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు గురిచేసింది. 20 సంవత్సరాలుగా క్రియాశీల ప్రభుత్వ పాలన ఎరుగని సోమాలియా వెరవలేదు. ముందుకే సాగి విశ్వక్రీడా వేదిక మీద కాలుపెట్టడం విశేషమే కదా!
ఇతర దేశాల అథ్లెట్లు కనీసం ఊహించని సవాళ్లను అదిగమించిన సోమాలియా అథ్లెట్లు అంతర్జాతీయ క్రీడా వేదిక మీద పతకాల వేటకు సంసిద్దులైనారు. తూటాలు తమ క్రీడాసంకల్పాన్ని అడ్డుకోజాలవని సోమాలియా ప్రపంచానికి చాటినట్లయింది.కష్టనష్టాల కోర్చి అంకితభావంతో భవితపై ఆశావహ దృక్పధంతో నిలువడం ద్వారానే (ఆటల్లో) విజయానికి చేరువకాగలిగామని మహిళ అథ్లెట్ జంజామ్ మహ్మద్ ఫరా(18) తెలిపింది. ఈ ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు పాల్గొంటున్నారు. ఈ నలుగురు శిక్షణ పొందిన తీరు ఒళు ్ల గగుర్పొడిచేదిగా వుంది. ఉగ్రవాదుల కిరాతక తూటాల రంధ్రాలతో నలుగురు అథ్లెట్లు శిక్షణ పొందే శిబిరాలు చూపరులకు భయం గొలుపుతున్నాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ద్వారా సోమాలియా మీద పడిన యుద్ధపీడిత దేశమనే ముద్రను తొలగించాలని అథ్లెట్లు ధృఢంగా నిలిచారు.
ఈ ధృడత్వం వెనుక స్వయంగా అథ్లెటయిన కోచ్ అహ్మద్ అలీ అబీకర్ కృషి కీలకం. ఎప్పుడూ సముద్ర దొంగలు, యుద్ధం, కరవుకాటకాలు వంటి సమస్యల పరంగా అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచే సోమాలియాలోనూ పతక విజేతలున్నారని ప్రపంచానికి చాటడం లక్ష్యంగా ఒలింపిక్ బృందాన్ని తీర్చిదిద్దాడు.
సోమాలియాలో ఆటలు సజీవమనే వాస్తవాన్ని లోకానికి వెల్లడించేందుకు అథ్లెట్లు తయారుగా ఉన్నారనేందుకు వారిలో తొణికిసలాడే క్రీడాస్ఫూర్తిని చూడాలని అబీకర్ వ్యాఖ్యానించాడు. దేశ రాజధాని మొగదిషులో ఉగ్రవాద మూకల్లోని ఇరు పక్షాలు తూటాలతో తలపడిన సందర్భంలో అంత వరకు శిక్షణకు ఉపయోగించుకుంటున్న ప్రాధమిక పాఠశాల భవనాన్ని ఖాళీ చేసి మరొ చోటుకు తరలడం ఎంతటి కష్టమైన పరిస్థితుల్లో జట్టు శిక్షణ పొందిందీ తెలియజేస్తుంది. ఇలాంటి క్లిష్టమైన వాతావరణంలో ఆరు నెలల పాటు శ్రమించారు.

నిరంతరం కొనసాగే యుద్ధం, అరకొర సదుపాయాలు, శిక్షణకు తగిన విధంగా ఆర్థిక చేయూత లభించకపోవడం వంటి అవరోధాలను అధిగమించిన అథ్లెట్లు తమ దేశం కోసం పతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు.
గాయాలు తగిలిన సందర్భాల్లో, అథ్లెట్లు అస్వస్థతకు గురయినపుడు రాజధాని నగరం మొగదిషులో అందుబాటులోని సాధారణ వైద్యచికిత్సతోనే సరిపుచ్చుకోవాల్సివచ్చిందని అబీకర్ శిక్షణ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. షెబబ్ ఉగ్రవాదుల హెచ్చరికల సమయాల్లో మైదానాల్లో కాక కేవలం ఇన్‌డోర్‌లోనే శిక్షణ కొనసాగించాల్సిన అనివార్యతలు అనుభవించారు. పతకాలు గెలవాలన్న తన కలలను సాకారం చేసుకోనీయకుండా షెబబ్ ఉగ్రవాదులు తరచూ బెదిరింపులకు పాల్పడే వారని ఫరా జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.
ఆటల దుస్తుల్లో ఉన్న తమను సాటి ప్రజలు ఆనందంగా చూడలేకపోయారని తెలిపింది. స్వీయ నిర్భంధంలోనే శిక్షణ ముగించామంది. సోమాలియా ఒలింపిక్ కమిటీ అద్యక్షుడు అడెన్ యబరావో వీష్‌ను ఈ ఏప్రిల్‌లోనే షెబబ్ ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. శిక్షణలోని ఒక అథ్లెట్ తండ్రి ప్రాణభయంతో 2009లోనే పరాయి దేశానికి పారి పోయాడు.
రెండు విభాగాల్లో పోటీ
ప్రధానంగా రెండు విభాగాల్లో పతకాలు సాధించేందుకు సోమాలియాకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. పురుషుల, మహిళల విభాగాలు రెంటిలో పతకం గెలుచుకునే అవకాశాలున్నాయి. 2011 ఖతార్‌లో జరిగిన పాన్ అరబ్ గేమ్స్‌లో 1500 మీటర్ల విభాగంలో మహ్మద్ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే లండన్ క్రీడా వేదిక మీద సోమాలియా విజయ పతాకం ఎగురవేయడ మొక్కటే అబీకర్ ధ్యేయంగా కనిపించడం లేదు. 1987లో వరల్డ్ ఛాంపియన్‌గా 1,500 మీటర్ల విభాగంలో చరిత్ర సృష్టించిన సోమాలియా దిగ్గజం అబ్డీబిలీ అబ్డీ ప్రదర్శనను మించిన ప్రదర్శనతో లండన్‌లో సోమాలియా పతకాన్ని రెపరెపలాడించాలని వ్యూహరచన సాగిస్తున్నాడు.