వెలిగిన లండన్‌ ఒలింపిక్స్‌ జ్యోతి

  • తుది కౌంట్‌డౌన్‌ ప్రారంభం

రహస్య, సాంప్రదాయాలను మేళవిస్తూ గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో గురువారం ఆద్యంతం ఆసక్తిగా జరిగిన కార్యక్రమంలో లండన్‌ ఒలింపిక్స్‌ జ్యోతి వెలిగింది. తద్వారా ఈ ఏడాది ఒలింపిక్స్‌కు తుది కౌంట్‌డౌన్‌ మొదలయింది. ప్రాచీన గ్రీకు దుస్తులలో నటులు 2.600 ఏళ్ల కిందటి హెరా ఆలయంలో సూర్యుని కిరణాల ద్వారా గాడ్‌ అపోలోను వెలుగులోకి తెచ్చారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు జాక్వెస్‌ రొగ్గె, లండన్‌ ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ చీఫ్‌ సెబాస్టియన్‌ కోయి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీస్‌లో పర్యటించిన అనంతరం ఈ నెల 17వ తేదీ రాత్రి జరిగే కార్యక్రమంలో బ్రిటన్‌ ప్రతినిధి బృందానికి అందుతుంది. బ్రిటన్‌తో పాటు, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ను కూడా జ్యోతి చుట్టిరానుంది. తుదకు ఒలింపిక్‌ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు జరిగే తూర్పు లండన్‌లోని ఒలింపిక్‌ స్టేడియానికి జ్యోతి చేరుకుంటుంది.