కొల్‌కతా విక్టరీ

  • ఢిల్లీకి ఓటమి

కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ టోర్నీలో విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఫిరోజ్‌షా కొట్లా మైదానంలో సోమవారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంభీర్‌ సేన 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కొల్‌కతా 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై సులువైన విజయం సాధించింది. తొలుత సెహ్వాగ్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జట్టులో వార్నర్‌ (21), సెహ్వాగ్‌ (23), జయవర్ధనే (30), ఇర్ఫాన్‌ (36) రాణించారు. బదులుగా కెకెఆర్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులతో విజయం ముంగిట నిలిచింది. కల్లీస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

154 పరుగుల లక్ష్య ఛేదనలో కొల్‌కతాకు శుభారంభం లభించింది. కెప్టెన్‌ గంభీర్‌ (36) వెనుతిరిగినా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కల్లీస్‌ (30)ను ఉమేష్‌ ఔట్‌ చేశాడు. మెక్‌కల్లమ్‌, కల్లీస్‌ జోడీ 2 వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కొల్‌కతా 12.3 ఓవర్లలో వంద పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 40 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మెక్‌కల్లమ్‌ (56) జట్టు విజయం ఖాయం చేశాడు. యూసుఫ్‌ పఠాన్‌ (7) లాంచనాన్ని పూర్తి చేశాడు.

మొదట టాస్‌ గెలిచి ఢిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ వీరూ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఈ మ్యాచ్‌ల్లో కెవిన్‌ పీటర్సన్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. సెహ్వాగ్‌ (23, 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌) కల్లీస్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. డేవిడ్‌ వార్నర్‌ (21, 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌) కల్లీస్‌ బౌలింగ్‌లో కీపర్‌ మెక్‌కల్లమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెపర్లు 9 పరుగుల తేడాతో ఔటయ్యారు. జయవర్ధనే, టేలర్‌ జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. జయవర్ధనేను (30)ను కెప్టెన్‌ గంభీర్‌ రనౌట్‌ చేశాడు. 5 పరుగుల తేడాతో రాస్‌ టేలర్‌ (16) సంగ్వాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ 100 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో ఇర్ఫాన్‌ దూకుడుగా ఆడాడు. ఇర్ఫాన్‌ 36 పరుగుల (22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌) వ్యక్తగత స్కోరు వద్ద నరైనె బౌలింగ్‌ స్టంపౌటయ్యాడు. ఢిల్లీ 19.2 ఓవర్లలో 150 పరుగుల మార్క్‌కి చేరుకుంది. నరైనె వేసిన చివరి ఓవర్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌, ఇద్దరు రనౌటయ్యారు. దాంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కొల్‌కతా బౌలర్లలో నరైనె (2/23), కల్లీస్‌ (2/20) చెరో రెండు వికెట్లు తీశారు. బ్రెట్‌లీ (1/39), సంగ్వాన్‌ (1/42) చెరో వికెట్‌ తీశారు.