దేశకోసం ... ప్రాణం తృణప్రాయం

ఇలాంటి ఎందరో యోధులు తమ బలిదానాలతో ఫాసిస్టు సేనల్ని ఓడించి సోవియట్‌ను మాత్రమే గాక ప్రపంచాన్ని కాపాడారు. ప్రజానీకం ప్రత్యేకించి ప్రతి యువకుడు చదవదగ్గ పుస్తకంగా నేను 'దిటవు గుండెలు'ను భావిస్తాను. అంతేకాదు కమ్యూనిస్టులు నిస్వార్థంగా దేశంకోసం పోరాడిన నేపథ్యం 'దిటవుగుండెలు'ది. తమ ప్రాణాన్ని తృణప్రాయంగా భావించే తత్వం నాకు నచ్చింది. ఆ రకమైన అంకితభావం, నిస్వార్థ సేవాభావం, దేశం కోసం, ప్రజల కోసం పోరాడేతత్వం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ ఆశయ స్ఫూర్తితోనే ఇప్పటికీ పనిచేస్తున్నాను.

సామాజిక స్పృహతో రాసిన ప్రతి పుస్తకమూ పాఠకుల చైతన్యాన్ని అభివృద్ధి చేయడమే గాక వారిలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆ కోవకు చెందిన పుస్తకమే 'దిటవు గుండెలు'. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్‌ సేనలు సోవియట్‌ యూనియన్‌ను ఆక్రమిస్తాయి. ఎర్రసైన్యం వీరోచిత ప్రతిఘటన, తమ మాతృభూమి రక్షణ కోసం ప్రజలు కూడా జర్మన్‌ సైన్యానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగడంతో దురాక్రమణదారులు ఊహించని ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచపు మొట్టమొదటి సోషలిస్టు దేశమైన సోవియట్‌ రష్యాలో ఎర్రజెండా రెపరెపల్ని శాశ్వతంగా అంతం చేయాలన్నది హిట్లర్‌ ఆలోచన. అందుకే లక్షలకు లక్షలుగా జర్మన్‌ సైన్యాన్ని రంగంలోకి దించి తన లక్ష్యాన్ని సాధించాలని తహతహలాడుతూ ఉంటాడు. కానీ రష్యన్ల ప్రతిఘటన ముందు హిట్లర్‌ ఎత్తులు పనిచేయవు. ఆక్రమణ ప్రాంతాల్లో 'నూతన వ్యవస్థ నిర్మాణం' పేరిట జర్మన్లు సాగించే దురాగతాలకు, సామూహిక హింసాకాండకు, ఆస్తులు కొల్లగొట్టడానికి, హద్దూపద్దూ లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో శత్రువును వెనక నుంచి దెబ్బకొట్టడానికి మరియు ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ కోసం గెరిల్లా దళాలను పంపి ఫాసిస్టులతో పోరాడాలని సోవియట్‌ పార్టీ నిర్ణయిస్తుంది. ఎర్రసైన్యంలోని సమర్థులకు, ఎంపిక చేసిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు శిక్షణనిచ్చి గెరిల్లా దళాలను రూపొందించి శత్రు ఆక్రమిత ప్రాంతాల్లో ప్రవేశపెడతారు. ద్మిత్రీరు మెద్వెదేవ్‌ నాయకత్వంలోని దళం అలాంటి గెరిల్లా దళాల్లో ఒకటి. ఉక్రెయిన్‌ ప్రాంతంలో 1942 నుంచి 1945 వరకూ ఈ గెరిల్లా దళం జరిపిన వీరోచిత, సాహసోపేత కార్యకలాపాల సమాహారమే 'దిటవు గుండెలు'. ఇది నవలగా కనపడినా నవల కాదు. ఇది పెద్ద కథగా ఉన్నా కథ కాదు. యదార్థ ఘటనల వాస్తవ చిత్రీకరణే ఈ పుస్తకం రూపం.

*********

మా కుటుంబం రాజకీయాలతో సంబంధం లేని కుటుంబం. పేద రైతుగా మా నాన్నగారు అతి కష్టంమీద నన్ను మాత్రమే చదివించగలిగారు. జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతంగావున్న బనగానపల్లె మండలంలోని హుస్సేనాపురం మా స్వగ్రామం. చిన్నతనంలో బనగానపల్లె లైబ్రరీలో పుస్తకాలు చదివే అలవాటు ఉన్నది. అయితే అభ్యుదయ సాహిత్యం కాకుండా కథలు, నవలలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అని రెగ్యులర్‌గా చదివేవాణ్ణి.

నేను ఇంటర్‌మీడియట్‌ చదవడానికి కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో చేరాను. మా సీనియర్లు కొందరు వచ్చి ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేయడానికి ఆహ్వానించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆశయాలు, పని నచ్చి నేను ఎస్‌ఎఫ్‌ఐలో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. కర్నూలు ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఒక చిన్న లైబ్రరీ నిర్వహించేవారు. అక్కడ అభ్యుదయ పుస్తకాలు, జీవిత చరిత్రలు ఉండేవి. కొత్తగా కార్యకర్తలుగా పనిచేస్తున్న విద్యార్థులతో ఈ పుస్తకాలు చదివించే కృషి జరిగేది. ఆ క్రమంలోనే దిటవు గుండెలు చదివాను. అలా ఇంటర్‌ చదివే రోజుల్లో రష్యా, చైనా, వియత్నాం దేశాల విప్లవ గాధల్ని వరుసగా చదివేవాణ్ని. వియత్నాంలో అప్పటికీ గెరిల్లా పోరాటం జరుగుతూ ఉండింది. చైనాలో విప్లవ ప్రభుత్వ విజయాలు ఉత్సాహాన్నిచ్చేవి. ప్రపంచానికి మరో కొత్త ప్రపంచాన్ని చాటిన సోవియట్‌ పట్ల ఆరాధ్యభావం వుంది. ఆ క్రమంలోనే 'దిటవు గుండెలు'ను చదివాను. నాపై ఈ పుస్తకం చూపిన ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఫాసిస్టు సేనలపై గెరిల్లా యోధులు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. అయితే గెరిల్లా యోధుడు ఫెదయేన్‌ తన మృత్యుమొహంలో ఉండి కూడా 'బ్రతికితే' తనను కమ్యూనిస్టు పార్టీ క్యాండిడేట్‌ సభ్యత్వానికి సిఫార్సు చేయమని కమాండర్‌ను అడిగే తీరు కమ్యూనిస్టు పార్టీ ప్రతి సభ్యుడు గర్వించే సందర్భం అని నేను భావిస్తాను. అది కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి ఉన్న గొప్పతనం అని నాకు అనిపించింది. నేను ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోనే కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) సభ్యునిగా చేరడానికి కూడా ఇదే ప్రేరణ.

*********

ఆ పుస్తకంలో అందరూ హీరోలే. ఎవరి పాత్ర వారు నిర్వహించారు. మెద్వెదేవ్‌, కుచేత్కోవ్‌, కుజ్నెత్సోవ్‌, షెమ్యూనోవ్‌, ఫెదయేవ్‌, షఘాన్‌, లుకేన్‌, సేమ్యనోవ్‌, ప్రిహద్కో, డాక్టర్‌ తెత్సార్‌ స్కరు ఒకరేమిటి ఇలా ఒక్కొక్కరు ఒక గొప్ప దేశభక్తుడు. ఒక్కొక్కరు ఒక సాహసయోధుడు. ఏ క్షణంలోనైనా తాము పోరాటంలో శత్రువుకు బలిగావచ్చని తెలిసినా నిర్భయంగా వారు శత్రువులతో తలపడిన తీరు, సంతోషంగా మాతృదేశ విముక్తికై ప్రాణాలు అర్పించిన తీరు ప్రతి దేశభక్తుని గుండెలు ఉప్పొంగేలా చేస్తుంది. ప్రజల్లో నుంచి గెరిల్లాలుగా చేరిన నికోలారు స్క్రూ తిన్‌స్కరు, అతని కుటుంబ సభ్యులందరి త్యాగాలు అనన్య సామాన్యమైనవి. అందులో ప్రత్యేకించి అతని భార్య మార్ఫా అతి రహస్యమైన గెరిల్లా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రాణ త్యాగం చేయాల్సి రావడం, కుమారుడు జార్జ్‌ శత్రువుకు చిక్కి చిత్రహింసల పాలుకావడం పాఠకుల గుండెల నుంచి కన్నీరు ద్రవింపజేస్తుంది. చిన్నారులు కోల్యా, వోలొద్వాలు అతి చిన్న వయస్సులో గెరిల్లా దళాల్లో చేరి చేసే కార్యకలాపాలు ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తాయి. కాత్యా, వాస్య, మారుస్య, వోల్యా లాంటి యువతుల త్యాగాలు తాము దేశ రక్షణలో ఎవరికీ తీసిపోమని మహిళలు గర్వించేలా ఉంటాయి.

సంఖ్యలో చాలా పరిమితంగా ఉంటూ, జర్మనీ సైన్యంతో పోలిస్తే సాంకేతికంగా చాలా బలహీనంగా ఉన్న స్థితిలో కూడా గెరిల్లా యోధులు శత్రువుతో తలపడడమే గాకుండా 'హుర్రా' శబ్దం చేస్తూ విరుచుకుపడడం, నలువైపుల నుంచి శత్రువుపై దాడులు చేస్తూ వారిని సామూహికంగా వధించడం రైల్వేలైన్లను పేల్చి వేస్తూ జర్మన్‌ సైన్యం కదలికలను కట్టడి చేస్తూ వారి ఫ్రంట్‌ లైన్‌కు సరఫరాలు పోకుండా అడ్డుకోవడం, ప్రజలపై దారుణాలకు, హింసకు బాధ్యులైన 'మృత్యురాజు' లను అక్కడికక్కడే వధించడం, ప్రజలను ఉత్సాహపరిచి వారిలో నుంచి గెరిల్లాలను రిక్రూట్‌ చేసుకోవడం ప్రతిదీ అత్యద్భుతంగా చిత్రీకరించడం జరిగింది.

గెరిల్లా యోధుడు కుజ్నెత్సోవ్‌కు జర్మన్‌ భాష వచ్చు. దీన్ని అవకాశంగా చేసుకుని అతనికి జర్మన్‌ సైనిక ఆఫీసర్‌గా వేషం మార్చి రోవ్నో నగరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దుర్భేద్యమైన శత్రు దుర్గాల్లోకి అతను చొచ్చుకుపోతాడు. శత్రువు కదలికలు ఎప్పటికప్పుడు దళానికి అందిస్తూ ఉండడమే గాకుండా అత్యున్నతస్థాయి జర్మన్‌ సైనిక అధికారులను రోవ్నో నగరం వీధుల్లోనే హతమార్చి జర్మన్‌ సైన్యం గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. కుజ్నెత్సోవ్‌ సాహస కృత్యాలు యువతకు ఆదర్శప్రాయాలు. అసాధ్యమనుకున్న అనేక కార్యక్రమాలు అమలు చేస్తాడు. తను మరో ముఖ్యమైన బాధ్యత అమలు చేయడానికి పోతున్న సందర్భంలో నాకేమైనా జరిగితే ఆ తర్వాతనే చదవాలనే షరతుతో ఒక లేఖను గెరిల్లా కమాండర్‌కు అందిస్తాడు. ఆ కర్తవ్య నిర్వహణలో ఆ కామ్రెడ్‌ తన ప్రాణాల్ని కోల్పోతాడు. ఆ లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పటికీ గుర్తే.

'జీవితం అంటే నాకు ఎంతో ప్రేమ. నేనింకా యువకుణ్ణే. కానీ కన్న తల్లిని ప్రేమించినట్లుగా నేను ప్రేమించే నా దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేయడం అవసరమైన పక్షంలో అందుకు నేను సిద్ధమే. సూర్యుణ్ణి రూపుమాపడం ఎంత అసాధ్యమో ప్రజలను లొంగదీసుకోవడం అంతే అసాధ్యం. అని వారు తెలుసుకొందురు గాక'.

ఇలాంటి ఎందరో యోధులు తమ బలిదానాలతో ఫాసిస్టు సేనల్ని ఓడించి సోవియట్‌ను మాత్రమే గాక ప్రపంచాన్ని కాపాడారు. ప్రజానీకం ప్రత్యేకించి ప్రతి యువకుడు చదవదగ్గ పుస్తకంగా నేను 'దిటవు గుండెలు'ను భావిస్తాను. అంతేకాదు కమ్యూనిస్టులు నిస్వార్థంగా దేశంకోసం పోరాడిన నేపథ్యం 'దిటవుగుండెలు'ది. తమ ప్రాణాన్ని తృణప్రాయంగా భావించే తత్వం నాకు నచ్చింది. ఆ రకమైన అంకితభావం, నిస్వార్థ సేవాభావం, దేశం కోసం, ప్రజల కోసం పోరాడేతత్వం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ ఆశయ స్ఫూర్తితోనే ఇప్పటికీ పనిచేస్తున్నాను.

ఆ క్రమంలోనే 'దిటవు గుండెలు'ను చదివాను. నాపై ఈ పుస్తకం చూపిన ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఫాసిస్టు సేనలపై గెరిల్లా యోధులు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. అయితే గెరిల్లా యోధుడు ఫెదయేన్‌ తన మృత్యుమొహంలో ఉండి కూడా 'బ్రతికితే' తనను కమ్యూనిస్టు పార్టీ క్యాండిడేట్‌ సభ్యత్వానికి సిఫార్సు చేయమని కమాండర్‌ను అడిగే తీరు కమ్యూనిస్టు పార్టీ ప్రతి సభ్యుడు గర్వించే సందర్భం అని నేను భావిస్తాను. అది కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి ఉన్న గొప్పతనం అని నాకు అనిపించింది. నేను ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోనే కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) సభ్యునిగా చేరడానికి కూడా ఇదే ప్రేరణ.

ఎం.ఎ.గఫూర్‌, సిపిఐఎం కేంద్రకమిటీ సభ్యులు

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్