భండారు అచ్చమాంబ తొలి కథా రచయిత్రి అన్న విషయం ఒక దశాబ్దం క్రితం మాత్రమే వెలుగులోకి వచ్చింది 'అన్వేషి' అనే స్త్రీల అధ్యయన సంస్థ ప్రచురించిన 'వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా' అనే ప్రచుణలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. గురజాడ కన్నా ఎనిమిదేళ్లు ముందుగానే భండారు అచ్చమాంబ 'ధన త్రయోదశి' అనే కథని రాశారని, అది 1902 'హిందూ సుందరి' అనే పత్రికలో అచ్చయిందనీ పేర్కొన్నారు. ఈ కథలోని వస్తువు కూడా దిద్దుబాటే. అయితే ఈ దిద్దుబాటు ఆర్థిక విషయానికి, నైతిక విలువలకి సంబంధించినదిగానూ, వాస్తవికంగానూ ఉంటుంది.
ఆధునిక తెలుగు కథా సాహిత్యానికి స్త్రీలు చేసిన దోహదం తక్కువేం కాదు. ప్రారంభదశలో స్త్రీలు పురుషులను అనుకరిస్తూ పద్య రచన చేసినా, కథల విషయంలో స్త్రీలు తమదైన ధోరణిలో స్వీయ కంఠ స్వరాన్ని వినిపిస్తూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు.
20వ శతాబ్ద ఆరంభం నుంచీ సంఘ సంస్కర్తల ప్రభావం, స్వాతంత్రోద్యమం ప్రభావంతోనూ స్త్రీలు అభ్యుదయ ధోరణిలో రచనలు చేయడం ఆరంభించారు. కేవలం దైవభక్తి, పతిభక్తి కవితా వస్తువులుగా తీసుకొని ఆది నుంచి కవిత్వం రాస్తున్నా, గత శతాబ్దం ఆరంభం నుంచి ఆధునిక ధోరణిలో ఆలోచించి రచనలు చేయడం ఆరంభించారు. ఆనాటి నుంచి స్త్రీలు తమ సమకాలీన సమస్యలను చిత్రించడం, వారిలో కొందరు వాటి పరిష్కారాల దిశగా ఆలోచించడం ప్రారంభించారు.20వశతాబ్ది ఆరంభం నుంచీ స్త్రీలు తెలుగులో కథారచన చేయడం ప్రారంభించినా, వారిని ఆ రోజుల్లో సాహితీ లోకం కొంతవరకు నిర్లక్ష్యం చేసిందని చెప్పవచ్చు. వారి కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడినా, వాటిలో కొన్నింటినైనా ఆనాటి సంకలనాల్లో చేర్చడం జరగలేదు. కవయిత్రులకు కొంచెం ప్రాముఖ్యం లభించినప్పటికీ, కథా రచయిత్రులకు మాత్రం సముచిత స్థానం దక్కలేదని చెప్పవచ్చు. పైగా తెలుగులో కథా రచన చేసింది మొదట ఒక మహిళే అన్న సత్యాన్ని కూడా పట్టించుకోలేదు. గురజాడ వారి 'దిద్దుబాటు' కథే తొలి తెలుగు కథగా గుర్తింపు, ప్రాచుర్యం పొందింది. భండారు అచ్చమాంబ తొలి కథా రచయిత్రి అన్న విషయం ఒక దశాబ్దం క్రితం మాత్రమే వెలుగులోకి వచ్చింది 'అన్వేషి' అనే స్త్రీల అధ్యయన సంస్థ ప్రచురించిన 'వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా' అనే ప్రచుణలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. గురజాడ కన్నా ఎనిమిదేళ్లు ముందుగానే భండారు అచ్చమాంబ 'ధన త్రయోదశి' అనే కథని రాశారని, అది 1902 'హిందూ సుందరి' అనే పత్రికలో అచ్చయిందనీ పేర్కొన్నారు.
ఈ కథలోని వస్తువు కూడా దిద్దుబాటే. అయితే ఈ దిద్దుబాటు ఆర్థిక విషయానికి, నైతిక విలువలకి సంబంధించినదిగానూ, వాస్తవికంగానూ ఉంటుంది. యజమానికి సంబంధించిన డబ్బుని తన అవసరానికి వాడుకునే బలహీన క్షణం నుండి భర్తను తప్పించి, తప్పు చేయకుండా అతని మనస్సునీ - ప్రవర్తననీ సరిదిద్దిన భార్య కథే 'ధన త్రయోదశి'. ప్రతి మగవాని ఆలోచన వెనుక స్త్రీ హస్తం వుంటుందనే నానుడి జ్ఞప్తికి తెచ్చిన కథ ఇది. నిరుపేద కుటుంబంలో పిల్ల కనీసపు కోర్కెలయినా తీర్చలేక పుట్టెడు దు:ఖాన్ని గుండెల్లో దాచుకున్న విజయలక్ష్మమ్మ - తన భర్త యజమానిని ఆర్థికంగా మోసం చేయబోతే వారించి, కష్టాల్లో భార్యగా అండగా ఉండటం కథాంశం. భండారు అచ్చమాంబ కథ 'ధన త్రయోదశి' మొదటి కథ అన్న ప్రస్తావన వచ్చిన 10 సంవత్సరాలకి 'నూరేళ్ల పంట' సంకలన కర్త డాక్టర్ భార్గవీరావు 'స్త్రీ విద్య'ని తొలి తెలుగు కథగా స్వీకరించారు. నిజానికి అచ్చమాంబ రాసిన ''స్త్రీ విద్య' కన్నా ఒక నెల ముందుగా 'హిందూ సుందరి'లోనే ప్రచురితమైన కథ 'ధన త్రయోదశి' ఈ కథను తొలి కథగా వెలుగులోకి తెచ్చిన 'అన్వేషి' సంస్థకి చెందిన కె. లలితను సమర్థిస్తూ 'భూమిక' స్త్రీవాద పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి 'జండర్ స్పృహ- ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతి ఫలనాలు' పై. యు.జి.సి జాతీయ సదస్సుకు సమర్పించిన పత్రంలో స్పష్టంగా ప్రతిపాదించారు. ఈ ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ఈ కథని తమ యం.ఏ పాఠ్య గ్రంథంలో చేర్చారు.
ఆరోజుల్లో వర్థమాన కథా రచయిత్రుల్ని ఆనాటి ఇతర స్త్రీ పత్రికలతో పాటు 'గృహలక్ష్మీ' మాసపత్రిక చాలా ప్రోత్సహించిందని చెప్పాలి. గృహలక్ష్మీ తరువాత 1940 నుంచి 'భారతి' కూడా రచయిత్రులకు తగిన స్థానం కల్పించింది. ఆ తరువాత 'తెలుగు స్వతంత్ర' 'ఆంధ్రప్రభ', 'ఆంధ్ర జ్యోతి' మొదలైన వార పత్రికలు ప్రోత్సహించాయి. 1926లో ఆ. భాస్కరమ్మ 'ప్రభావతి', 1929లో పి. రుక్మిణీబాయి 'సుందరి', 1933లో సువర్ణ లక్ష్మీ నరసమాంబ 'రాజా పెళ్లి', 1938లో పులిపాక బాలా త్రిపుర సుందరమ్మ 'కోడలు', 1939లో నిడమర్తి నరసమాంబ 'కట్టుకథ' మొదలైన కథలు నాటి బాల్య వివాహాలను గూర్చి - బాల వితంతువుల దుస్థితిని గూర్చి వితంతు వివాహాల పట్ల నుండే సంకోచాలను గూర్చి చిత్రించాయి.
వితంతువుగా దుర్భర జీవితాన్ని అనుభవించడం కన్నా, రాజారామమోహన్ రారు వ్యతిరేకించిన సతీసహగమనమే ఉత్తమమైందనే భావనను ఆ. భాస్కరమ్మ 'ప్రభావతి' కథలో చూడవచ్చు. నాటి సమాజంలో వితంతువుల దుర్భర జీవితాన్ని ఈ కథ ఆవిష్కరించింది. వితంతువులపై నాటి జాతీయోద్యమ ప్రభావాన్ని, వారు దేశ సేవకు అంకితం కావడాన్ని రుక్మిణీబాయి 'సుందరి' కథ నిర్వచిస్తుంది. అట్లే వితంతువులకు పునర్వివాహం అవసరతను నొక్కి చెప్పిన కథ 'రాజాపెళ్లి' ఈ కథలో వితంతువైన రాజరాజేశ్వరి కుటుంబ పెద్దల ఆమోదంతో పునర్విహం చేసుకుంటుంది. వితంతువుల పునర్వివాహ ఆవశ్యకతను రచయిత్రి ఈ కథలో నొక్కి చెప్పారు.
బాల్య వివాహం - స్వ్రీ విద్య బహు భార్యత్వం ఈ మూడు అంశాలతో ముడిపడిన కథ సమయమంత్రి వందేమాతరం 'లీలావతి' కథ. స్త్రీకి వివాహం కన్నా ముందు విద్య అవసరమని, మగవాడికి బహు భార్యత్వం సామాజిక విరుద్ధమని చాటి చెప్పిన కథ ఇది. అత్తింటి ఆరళ్ళలకు బలవుతున్న స్త్రీల వ్యధా భరిత జీవనాన్ని చిత్రించిన కథ సుందరమ్మ 'కోడలు' కథ. ఈ కథలో అత్తపెట్టే బాధలను మౌనంగా భరించిన రాజేశ్వరి వంటి సహన మూర్తులు నాటి సమాజంలోనే కాదు, నేటి సమాజంలోనూ ఉన్నారు. స్త్రీకి స్త్రీయే విరోధి అనే సామెతను ఈ కథ మరోసారి గుర్తుకు తెస్తుంది. వితంతు వివాహాలు ఆవశ్యకమని ప్రబోధించిన మరో కధారత్నం నరసమాంబ 'కట్టుకథ'. వితంతువైన మాలతిని, మోహన్ అనే యువకుడు మోహించడం ఇందలి ఇతివృత్తం. 1940 వరకూ బాల్య వివాహాలను గూర్చి వచ్చిన కథలన్నీ 'గృహలక్ష్మీ'లో ప్రచురితమైనవే.
1941లో ఇల్లిందల సరస్వతి రాసిన 'కాగితపు పూలు' కథ 'భారతి'లో వచ్చింది. లేని మాతృత్వాన్ని నటించి, భర్తనీ అత్తవారినీ సంతోష పెట్టాలనుకున్న కథా నాయిక మరో స్త్రీని ఆమె పేదరికాన్ని సాకుగా తీసుకుని మోసం చేసి ఆమె బిడ్డను కాజేసి ఆమెను జీవితాంతం ఎంతటి మానసిక వ్యధకి గురి చేసిందో ఈ కథలో రచయిత్రి చిత్రించారు. ఈ కథలో వాస్తవికతతో పాటు కొంత నాటకీయత కూడా ప్రవేశపెట్టడం జరిగింది.
కుటుంబ జీవనంలో మహిళల దినచర్యనూ, అందులో భాగంగా వారు పొందే నిట్టూర్పులనూ, రేపటి రోజు వస్తుందనే ఆశనూ, ఈ రోజు చేయలేని పనులను రేపు చేసుకోవచ్చుననే భావనతో వున్న గృహిణుల గాథే ఆచంట శారదాదేవి 'ఒక్కరోజు' కథ. ఇది 1948లో భారతిలో ప్రచురితమయింది.
ఈ కథలో రచయిత్రి తాత్వక ధోరణిని ప్రదర్శిస్తారు. అటు ప్రేమికుడికీ, ఇటు భర్తకీ దూరమై 'ఆఘ్రాత పుష్పంలా' ఎవరికీ చెందకుండా ఒంటరిగా మిగిలిన స్త్రీ జీవితాన్ని వివరించిన కథ. జయంతి 'ఆఘ్రాత పుష్పం'. ఈ కథలోని డాక్టర్ సరోజ ధనవంతుని ఇంటి ఇల్లాలు. తన భర్త అక్రమ సంబంధాలను సహించలేక, అతడితో కాపురం చేయలేక, కోరుకున్న ప్రియుడిని దక్కించుకోలేక ఆఘ్రాత పుష్పంలా ఆమె జీవితాంతం అడవి గాచిన వెన్నెలాగా మారిపోతుంది. గత శతాబ్ది పూర్వార్థం దాకా మహిళలు వితంతువులుగా జీవించడం, భర్తలు అత్తలు- పుట్టింటి వితంతు ఆడపడుచుల వేధింపులు అనుభవించడం, మూగరోదనలో జీవించడం లాంటి అంశాలు కథా వస్తువులయ్యాయి. కానీ ప్రతి కథ వెనుక స్త్రీ సమానత్వం ప్రాతిపదికన మానవత్వ పంథాలో సాగాలని, అలా సాగడానికి సమాజం సహకరించాలనే అంతస్సూత్రం దర్శనమిస్తుంది.