రాధేయ కవిత్వం 'అవిశ్రాంతం'

  • సామాజిక రుగ్మతులను చీల్చి చెండాడేందుకు అంతర్‌ బహిర్‌ ఘర్షణలు మనిషిలో ఆవహించే తీరు ఎంతో అనుభవపూర్వకంగా కవి వ్యక్తీకరించాడు. పాఠకుల హృదయాలకు ఆసక్తికరంగా అందించగలిగాడు. జీవితంలో ఎంత తడిమినా అందని పార్శ్వపు అగాధాలను, మార్మిక స్పర్శలను, దిగులు వర్ణాల్ని శిల్పీకరించగలగాడు. చిత్రాలుగా చూపెట్టగలిగాడు.

మనస్సు మండు వేసవిలో కవిత్వంలో స్నానం చేసి చల్లని వేపచెట్టు నీడన విశ్రాంతి తీసుకున్నట్లుంది ''రాధేయ కవిత్వం ''అవిశ్రాంతం'' చదువుతుంటే! స్వచ్ఛమైన కవిత్వా స్వాధన కోసం ఎదురు చూసేవారికి 'అవిశ్రాంతం' ఎంతో ఆనందాన్నిస్తుంది. రాధేయ కవిత్వంలో రగిలే రక్త జ్వాలలున్నారు, కదిలే కన్నీటి కెరటాలున్నారు, మనిషిని ఆసాంతం తడిపి ముద్దచేసే స్వేద వర్షం ఉంది. అన్నింటికి మించి సామాజిక ఘర్షణ ఉంది, శ్రమైక జీవన హర్షం వుంది. సాహిత్య ప్రకర్షముంది. ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితా 'కవి' అవిశ్రాంత కవితా ప్రస్థానంనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈయన కవిత్వం, పల్లె ఒడిలో ఊయలలూగినంత ఆనందాన్ని, పట్టణం సుడి గుండాల్లో ఉక్కిరిబిక్కిరైనంత ఉత్కంఠను, ధ్వంసమైన నమ్మకంలోంచి నిటారుగా నిలబడేందుకు ప్రోది చేసుకున్న విశ్వాసాలను, సాంద్రీకృత మహా మౌనంలోంచి గళం విప్పిన గడుసరి భాషణలును వ్యక్తీకరిస్తుంటుంది. సామాజిక రుగ్మతులను చీల్చి చెండాడేందుకు అంతర్‌ బహిర్‌ ఘర్షణలు మనిషిలో ఆవహించే తీరు ఎంతో అనుభవపూర్వకంగా కవి వ్యక్తీకరించాడు. పాఠకుల హృదయాలకు ఆసక్తికరంగా అందించగలిగాడు. జీవితంలో ఎంత తడిమినా అందని పార్శ్వపు అగాధాలను, మార్మిక స్పర్శలను, దిగులు వర్ణాల్ని శిల్పీకరించగలిగాడు. చిత్రాలుగా చూపెట్టగలిగాడు.

''కవిత్వమే తోడు నీడగా! అనే కవితలో కవిత్వమే జీవితమైన వాడు చేయవలసిన విధికృతాలను విపులంగా వివరిస్తాడు కవి. ''అగ్గిసెగలోంచి/ నిప్పు కణికల్ని వెలికితీసినట్లుగా/ భావోద్వేగం నుంచి/ భాషను పిండుకోవాలి/ వూట చెలమలోంచి/ భావధారను చేదుకోవాలి/ గాయాల కొలిమిలోంచి/ వాస్తవాల్ని సానబెట్టాలి అంటారు. ''సిద్ధాంతం కన్నా/ అనుభవం గొప్పదని రాయాలి/ సమిష్టి అనుభవాల్ని/ స్వానుభవాలుగా మార్చుకొని/ శిశిరంలోంచి వసంతంలోకి/ అడుగుపెట్టేదే కవిత్వం' అంటే కవిత్వానికి సమయోచితమైన సరికొత్త నిర్వచనమిస్తాడు కవి.

కవిత్వం నాకు కన్ను మూతపడని జ్వరం/ కవిత్వం నాకన్రెప్పల మీద వాలిన నమ్మకమైన కల/ ఒక్క కవితా వాక్యం/ ఈ గుండె లోతుల్లోంచి/ పెల్లుబికి రావాలంటే/ ఎన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెట్టాలో''/ అంటూ ఆషామాషీగా కవిత్వం రాయొద్దంటూ ఒక హెచ్చరిక లాంటి అనుభవాన్ని ఆవిష్కరిస్తాడుకవి. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిరాధరణకు గురిచేసే బిడ్డల వైఖరిని ''క్షమయాధరిత్రి'' అనే కవితలో ఎత్తిచూపుతాడు కవి'' నీ చెమట చుక్కల్ని కూడేసుకొని/ చెప్పించిన చదువుకు సాక్ష్యం వాడు/ కార్పొరేట్‌ విజ్ఞానచ్ఛాయల్లో ఎదిగి/ బుద్ధి జీవుడైన నీ ఏకైక కుమారుడు/ అమ్మా నాన్నలకింత అన్నం పెట్టలేనివాడు/ డాలర్ల వేటలో అగ్రరాజ్యాలకు/ దాస్యం చేయడానికైనా/ సిద్ధమౌతాడు/ అంటూ తల్లిదండ్రుల మీదకంటే 'ఫారెన్‌' మీద పెంచుకునే మోజు నేటి యువతకు కార్పొరేట్‌ విద్యా సంస్కృతి వలన కలుగుతుందనే ఆలోచన ఇందులో కలిగిస్తాడు కవి.

బాల్యాన్ని బంధీ చేయకండి, బడిలో విత్తండి, మొక్కయై మొలసి మహావృక్షమై దేశానికి మంచి ఫలాలనూ, నీడను ఇస్తుంది అనే కాన్‌సెప్ట్‌లతో ''కోల్పోతున్న మూల్యం' అనే కవితను రాశారు కవి. ''వసంతం వలసపోయినట్లు/ విద్యా, విజ్ఞానం, మార్కెట్‌ సరుకులై/ వారి దరిద్రంతో పరాచికాలాడితే/ వారి కలల ప్రపంచం/ కుప్ప కూలిపోకేం చేస్తుంది'' అంటారు. చివరకు బాల్యం కోల్పోయిన బాల కార్మికుల వలన దేశానికి ఎంత నష్టమోననే భావన కలిగిస్తూ'' నీవు కోల్పోయిన బాల్యం/ ఈ దేశం చెల్లించలేని మూల్యం'' అంటాడు. మూఢ విశ్వాసాలను, సంప్రదాయ సంకెళ్లను ఆచారాల అంధత్వాన్ని ఎత్తి చూపుతూ, మనిషిని ప్రేమించే స్వభావం కోసం, ప్రతిభను గుర్తించే జ్ఞానం కోసం ''మనువుని కాదు'' 'మార్క్స్‌ని' చదవండి/ కౌటిల్యుని కాదు 'ప్లేటో'ని చదవండి/ భారత రాజ్యాంగం అర్థం కావాలంటే/ అంబేద్కర్‌ను చదవండి/ అంటారు.

''సౌందర్య రాహిత్యంలో...'' అనే కవితలో పల్లెలు ఏవిధంగా చితికి చివికిపోయిందో ఎంతో గొప్పగా కళ్లకు కట్టించాడు'' అమాయకత్వానికి/ అచ్చమైన ఆకృతిలా/ ఇక్కడో పల్లెపట్టు వుండాలి/ ఇప్పుడు కన్పించేదేమిటి? అంటూ పల్లెలోని యువత పనుల కోసం వలస పోవడం వలన ముసలి తల్లిదండ్రులు ఎదురుచూచే తీరును ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి. ''ఇక్కడే ఈ చీలిన కాలిబాటలో/ ఓ మాతృమూర్తి నిలబడి/ తన నుదురుకు చేయి అడ్డం పెట్టుకొని/ పనికోసం పట్నంబోయిన/ కన్న పేగుకోసం ఎదురుచూసేది''/ కంటి చూపు మందగించిన వృద్దులు నుదుటి మీద చేయి పెట్టుకొని ఎదురు చేసే తీరు చిత్రీకరించారు రాధేయ. ఆ ముసలి తల్లిని మన మనసుల్లో బొమ్మ కట్టిస్తాడు.

స్త్రీవాదాన్ని సమర్ధిస్తూ రాసిన కవిత ''సజల నేత్రసాక్షిగా'' చరిత్ర పుటల్లో దాగిన/ ఓ దీర్ఘకాలిక వ్యధ/ లింగ వివక్ష కారణంగా/ మౌన హింసను భరిస్తూ/ స్వీయ మరణాన్ని/ స్వయంగానే కలవరిస్తోంది// అంటూ పురుష స్వామ్య వివక్షలో మగ్గి అరిగిపోయే ఓ చాకిరీ యంత్రంగా స్త్రీని వర్ణిస్తాడు కవి. ప్రశ్నించే స్వరం స్త్రీకి అవసరమనే చైతన్యాన్ని నూరిపోస్తాడు. ఆత్మవిశ్వాసమే అభిమాన ధనంగా బతికే విధానాన్ని వర్తమాన మహిళ అలవరుచుకోవాలనేది ఆకాంక్ష.

''నిశ్శబ్దాల్ని పీల్చడం తెల్సినవాడు/ అక్షరాల్ని సృష్టించగలడు/ ద్ణుఖాన్ని తట్టిలేపితే/ ఎడారి విస్తరిస్తుంది/ కన్నీళ్లను కవ్వించావో/ సముద్రమే మేల్కొంటుంది'' అంటూ ''అవిశ్రాంతం'' అనే కవితలో తన సాహిత్య కృషిని ప్రస్తావిస్తూ ''మరణించాక జీవించడం/ మరణాన్ని జయించడం/ ఒక్క కవికే సాధ్యం/ జనన మరణాల రహస్య శోధన / కవిత్వమే/ అంటూ కవికి కవిత్వానికి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తాడు. ''మనిషి వ్యక్తిత్వాన్ని/ మార్కెట్లో రూపొందించి/ ఖరీదైన కలల కొనుగోలు శక్తికి/ దాసోహం చేసింది/ గ్లోబలైజేషన్‌/ క్రీడలు/ మన తార్కిక జ్ఞానాన్ని/ ఎగతాళి చేస్తున్నాయి/ ధ్వంసమౌతున్న సమస్త విలువలకూ/ ఈ జీవితం ప్రత్యక్ష సాక్ష్యమైంది'' అంటూ ''ఎడారి వసంతం'' అనే కవితలో సమస్త జీవన రంగాల్లో గ్లోబలైజేషన్‌ నీడలు సామ్రాజ్యవాదం కంటే ప్రమాదకరంగా అభివర్ణిసాడు కవి. శిల్పం మీద పట్టు, శబ్దం మీద సాధికారత, లోతైన భావాల్ని అన్వయ కాఠిన్యం లేకుండా పదచిత్రాలుగా మలచి కవిత్వం ''అవిశ్రాంతం''లో ఆరవోసిన రాధేయ అభినందనీయుడు.

మనిషి సామాజిక విధ్వంసక మూలాల్ని పసిగట్టి యుద్ధ సన్నద్ధమయ్యే చైతన్యాన్ని కలిగించే బావుకత, భాషా సామాగ్రి ఉన్న కవిగా రాధేయను ప్రతి పాఠకుడు గుర్తించగలుగుతాడు.ఈ మధ్య కాలంలో వెలువడిన కవితా సంపుటిల్లో ''అవిశ్రాంతం'' ఓ మంచి కవితా సంపుటి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్