జాషువా గుండె చప్పుడు

'నాదు కన్నీటి కథ సమన్వయము సేయ

నార్ద్ర హృదయంబుగూడ గొంతవసరంబు'

అన్నాడు గుర్రం జాషువా. నిజమే, దయా హృదయం లేకపోతే జాషువాను అర్థం చేసుకోలేం. అతని జీవుని వేదనే కవిత్వమైంది. అతని అవమానాలే పద్యాలయ్యాయి. 'బాధ కవిత్వానికి పర్యాయపదం' అన్నది జాషువా కవిత్వానికి అక్షరాలా అన్వయిస్తుంది. జాషువా ఏ కొందరివాడో కాడు - అందరివాడు. తెలుగుజాతి గర్వించదగ్గ కవి.

'కులమతాలు గీచుకొన్న గీతలజొచ్చి

పంజరాన గట్టువడను నేను

నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు

తిరుగు లేదు, విశ్వనరుడ నేను' అనడం అపూర్వం.

'ఖఅఱఙవతీఝశ్రీ వీaఅ' అన్నాడు. ఇదీ జాషువా హృదయం. ఇటువంటి గుండె చప్పుళ్ళను వారం వారం వినిపిస్తున్నారు డాక్టర్‌ ద్వానా శాస్త్రి.

'చిక్కిన కాసుచేతనివిజెందు నమాయకుడెల్ల కష్టముల్‌

బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధ్యాల దగ్ధమూర్తి

నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం

డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుంగడగొట్టు బిడ్డడై'

ఇది గబ్బిలంలోని మొట్టమొదటి పద్యం. కావ్య నాయకుడైన అస్ప ృశ్యున్నిగురించి చెప్పిన పద్యం. పూర్వకావ్యాల్లో గొప్ప నాయకుడు లేదా అగ్రవర్ణ నాయకుడు / ప్రభువు గురించి మొదట కీర్తిస్తారు. దానికి భిన్నంగా జాషువా అట్టడుగు వర్గానికి చెందిన అంటరానివాడ్ని (లేదా నేటిమాటల్లో దళితుడ్ని) స్తుతిస్తూనే అతని దుస్థితిని వెల్లడిస్తున్నాడు జాషువా. సామాన్యంగా శృంగారానికి, శాంతానికి, కరుణకీ వాడే ఉత్పలమాల ఛందస్సును ఆవేదనకి వాడటమే జాషువా ప్రత్యేకత!

ఎంత దక్కితే అంతలోనే తృప్తిచెందే స్వభావం కలవాడు. కాస్త బువ్వతోనే కష్టాలన్నిటినీ మర్చిపోయేవాడు. నాలుగు దిక్కులున్నా దిక్కులేనివాడు. అటువంటి అరుంధతీసుతుడైన దళితుడు భరతమాతకి కడగొట్టు బిడ్డగా జన్మించాడు - అని భావం.

సమాజంలో అస్పృశ్యుడి మంచిచెడ్డలు రెండూ ఇందులో చెప్పబడ్డాయి. తృప్తి చెందడం అతని స్వభావం. అత్యాశలూ దురాశలూ లేనివాడు. కడుపులో కాస్త పడగానే తన బాధల్ని, అవమానాల్ని మర్చిపోయే సాధుశీలి.

నాలుగు దిక్కులున్నా రక్షణ లేనివాడు - దిక్కులేనివాడు!

క్షుధానల దగ్ధమూర్తి - ఆకలిమంటలచే కాలిపోతున్నవాడు.. అందుకే నల్లగా ఉంటాడు.

అరుంధతీసుతుడు - వశిష్ఠనిసుతుడు అనరెందుకని? అరుంధతిని పవిత్రంగా చూస్తారు. పెళ్ళిలో అరుంధతీ నక్షత్రాన్ని చూపించి నమస్కరించమంటారు. మరి ఆమెకు పుట్టిన వాడ్ని ఎందుకిలా అవమానపరుస్తారు? అనేది ప్రశ్న.

కడగొట్టుబిడ్డ - చివరగా పుట్టెనవాడు - 'లాస్ట్‌సన్‌'! మొదటి బిడ్డను గారాబంగా, బంగారంగా చూస్తారు. చివరపుట్టినవాడ్ని నిర్లక్ష్యం చేశారు. జనాభా లెక్కల కోసం పుట్టినట్టు! 'కడగొట్టు బిడ్డ' అనటం లేదు. నువు చెప్పినట్టు పాదాల నుంచి పుట్టినట్టుగా కూడా చెప్పుకోవచ్చు,

దిక్కు - అంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు అని కాదు. 'దిక్కున్నచోటికి చెప్పుకో', 'నాకు ఎవరు దిక్కు', 'దిక్కూమొక్కూ లేనివాడ్ని' వంటి ప్రయోగాల్లో గల 'దిక్కు'కి గల అర్థం గ్రహించాలి. దిక్కు అంటే ఆధారం, రక్షణ, నిరాదరణ లేకపోవటం వంటివి స్ఫురిస్తాయి.

ఇలా కావ్యనాయకుడిని పరిచయం చేస్తూనే సుతిమెత్తగా చురకలు వేశాడు జాషువా.

- డాక్టర్‌ ద్వానా శాస్త్రి

9849293376