అక్టోబరు మహా విప్లవం, సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధ సమయంలో కార్మికవర్గం తరఫున నిలబడి, ఒక ఆర్గనైజర్‌గా, ప్రజా సమీకరణ సారథిగా పని చేసిన 'ప్రావదా' (నిజం) పత్రిక ప్రపంచ పత్రికారంగంలోనే ఒక వేగుచుక్క. అలాంటి మహత్తర పాత్ర పోషించిన పత్రిక శతవార్షికోత్సవాలు పూర్తి చేసుకొని జనాలకు 'నిజం' చెప్పే మరో కర్తవ్య నిర్వహణలో 101వ సంవత్సరంలో అడుగుపెట్టింది.
తొలి పత్రిక జర్మనీలో 1605లో ప్రచురితమైందని ఎక్కువమంది అంగీకరిస్తారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మఖలో పుట్టి పుబ్బలో అంతరించి పోయినవి పోగా, ప్రస్తుత ప్రపంచ పెట్టుబడిదారీ దేశాల సంక్షోభానికి ముందు 2007లో ఉన్న దినపత్రికలు 6,850. వాటి సర్క్యులేషన్ 39 కోట్ల 50 లక్షలు.
ప్రావదా ఆవిర్భావం
పత్రికను ఎవరు ప్రారంభించారు అనే దాని కంటే ఎవరు, ఎవరికోసం ఉపయోగించారన్నది ముఖ్యం. 'ప్రావదా' పత్రిక తొలుత విదేశీ గడ్డపై వియన్నాలో ఉక్రేనియన్ స్పిలికా పార్టీ ఆధ్వర్యాన 1905లో ప్రారంభమైంది. తరువాత దానిని 1908 అక్టోబరు 3న తొలి సంచికతో దానిని రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ (కమ్యూనిస్టు పార్టీ) పత్రికగా మార్చి లియో ట్రాట్‌స్కీ సంపాదకత్వంలో తీసుకువచ్చారు. రష్యన్ కమ్యూనిస్టు పార్టీలో బోల్షివిక్ (అతివాద), మెన్షివిక్ (మితవాద) శక్తుల వివాదంలో పత్రికపై మితవాదులు పైచేయి సాధించారు. దాంతో బోల్షివిక్‌లు వారానికి మూడుసార్లు అచ్చువేసే 'స్టార్', 'జెవెజ్దా' అనే వారపత్రిక నడిపారు. చివరికి 1912 నాటికి మెన్షివిక్‌లు 'ప్రావదా' పత్రికను మూతవేసే స్థాయికి తీసుకువచ్చారు.
నిజాలను చాటటం కోసం ...
బోల్షివిక్‌లు 'ప్రావదా' పత్రికను 1912 ఏప్రిల్‌లో తీసుకురావటానికి ఒక నేపథ్యం ఉంది. సైబీరియాలోని బొగ్గుగని కార్మికులు తమ న్యాయమైన సమస్యలపై సమ్మెకు దిగటంతో కంపెనీ యాజమాన్యం అణచివేతకు పాల్పడింది. ఈ అన్యాయాన్ని జార్‌కు చెప్పుకుందామని ఏప్రిల్ 4న శాంతియుతంగా సెంట్ పీటర్స్‌బర్గ్‌లోని లెనా నదీతీరంలో ప్రదర్శన జరిపారు. దానిని జార్ సైనికులు అమానుషంగా అణచేందుకు ప్రయత్నించారు. వారు జరిపిన కాల్పుల్లో 270 మంది మరణించగా, మరో 250 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దాంతో అనేక పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దారుణాన్ని రష్యన్ పత్రికలు తొక్కి పెట్టేందుకు లేదా తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించాయి.
ఈ స్థితిలో జనానికి 'నిజం' చెప్పే పత్రిక తక్షణ అవసరాన్ని తీర్చేందుకు, లీగల్‌గా పత్రికను నడిపే అవకాశాన్ని ఉపయోగించుకొని లెనిన్ పక్షం రోజుల్లోనే పత్రికను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. బోల్షివిక్‌లు సెంట్ పీటర్స్‌బర్గ్ నుంచి 'ప్రావదా' దినపత్రికను ఏప్రిల్ 22న ప్రారంభించారు. తొలి సంచిక 60 వేల కాపీలు ముద్రించారు. (తరువాత కొత్త క్యాలండర్ ప్రకారం 13 రోజులు ముందుకు జరిగి ప్రారంభ తేదీ మే 2గా మారింది) మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం కాగానే జార్ 'ప్రావదా' పత్రికపై నిషేధం విధించటంతో 1914 జులైలో మూతపడింది. 'ప్రావదా' పత్రిక ప్రారంభానికి లెనిన్ ఆద్యుడైనప్పటికీ రష్యా వెలుపల ప్రవాసంలో ఉన్న కారణంగా పార్టీలో ఇతర నాయకులు, కార్మికులు దానిని నడిపారు. అయితే తొలి రెండేళ్లలో లెనిన్ 'ప్రావదా' పత్రికలో 280 వ్యాసాలు రాశారంటే పత్రికను ఒక ఆర్గనైజర్‌గా మార్చటంలో ఆయనకున్న ముందుచూపు అర్థం అవుతుంది. ఆ రచనలు రష్యాలో మెన్షివిక్‌లు, బూర్జువాలు, జారిస్టులకు వెన్నులో చలి పుట్టించాయి. అందుకే దానిని రెండేళ్లకే నిషేధించారు.
అయితే పార్టీలో చేవ, జనంలో ఆదరణ ఉండాలే గాని 'ఒక వీరుడు మరణిస్తే వేయి మంది ప్రభవింతురు' అన్నట్లు జార్ ఒక 'ప్రావదా'ను మూసివేస్తే దాని స్థానంలో మరొకటి, ఇలా ఎనిమిది రకాల 'నిజాల' పేరుతో 'ప్రావదా' పత్రికలు వెలువడతాయని ఊహించలేకపోయాడు.
లెనిన్ నేతృత్వాన ...
ప్రపంచ యుద్ధం ముగిసింది. 1917 ఫిబ్రవరిలో జార్‌ను కూలదోసి బూర్జువా ప్రజాతంత్ర శక్తులు అధికారానికి వచ్చాయి. వెంటనే ప్రవాసంలో ఉన్న లెనిన్ మారుపేరుతో ఏప్రిల్ 3న సెంట్ పీటర్స్‌బర్గ్ చేరుకొని 'ప్రావదా' సంపాదకవర్గంలో చేరి ప్రత్యక్షంగా దానిని నడిపాడు. అక్టోబరు విప్లవానికి కావాల్సిన భూమికను ఏర్పాటు చేశాడు. అక్టోబరు 25న (నవంబరు 7) బోల్షివిక్‌లు అధికారానికి వచ్చారు. అక్టోబరు 27, 28 తేదీల్లో తొలి సోషలిస్టు దేశ డిక్రీలను ప్రచురించటం ద్వారా 'ప్రావదా' చరిత్ర మరో మలుపు తిరిగింది. మరుసటి ఏడాది మార్చి 12న రష్యా రాజధాని మాస్కోకు మారింది. దాంతో ప్రావదా కూడా 16 నుంచి అక్కడి నుంచి ప్రచురితమైంది. 1920 వరకు రష్యన్ జారిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు సాగించిన అంతర్యుద్ధ సమయంలో 'ప్రావదా' ఒక ప్రజా ఆయుధంగా పని చేసింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 'ప్రావదా' పత్రికను మాస్కో నుంచి ప్రచురించటం కష్టమైందంటే నాజీలు రష్యన్లకు ఎంతటి విపత్కర స్థితిని తెచ్చిపెట్టారో అర్థం చేసుకోవచ్చు. మాస్కో నుంచి పత్రికలో అచ్చువేయాల్సిన సరంజామాను విమానంలో కాస్పియన్ సముద్ర తీరంలోని దగెస్థాన్ ఓడరేవు మఖాచెలఖాకు చేర్చి అక్కడ అచ్చు వేసి ఏడాది పాటు రష్యా అంతటా పంపిణీ చేశారు.
పత్రిక నిర్వహణలో ఎందరెందరో ...!
'ప్రావదా' పత్రికను నడిపిన వారిలో లెనిన్ సతీమణి కృపస్కయా, స్టాలిన్ వంటి వారెందరో ఉన్నారు. ప్రఖ్యాత రచయిత మాక్సిమ్ గోర్కీ సాహిత్య విభాగానికి మార్గదర్శకత్వం వహించారు. సోవియట్ యూనియన్ హయాంలో 'ప్రావదా' కమ్యూనిస్టు పార్టీ వాణిగా పని చేస్తే 'ఇజ్వెస్తియా' ప్రభుత్వ విధానాలను వెల్లడించేదిగా పనిచేసింది. 1991లో సోవియట్ యూనియన్‌ను కూలదోసిన తరువాత విద్రోహి బోరిస్ ఎల్సిన్ తొలి వేటు 'ప్రావదా'పై పడింది. ఆగస్టు 22న పత్రికను మూసివేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. కొన్ని వారాల తరువాత పత్రికలో పనిచేసే సిబ్బంది అదే పేరుతో కొత్తగా రిజిస్టర్ చేశారు. తరువాత దాని సంపాదకుడిగా వచ్చిన గెన్నడీ సెలెజనోవ్ (ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు) పత్రికను గ్రీకు వ్యాపారులకు విక్రయించాడు. ఆ తరువాత మరోసారి చేతులు మారింది. తరువాత ప్రావదాలో పనిచేసిన మాజీ సిబ్బంది కొందరు ప్రావదా ఆన్‌లైన్ పేరుతో ఇంటర్నెట్ పత్రికను నడిపారు. 1996లో గ్రీకు పెట్టుబడిదారులు ప్రావదా పయట్ పేరుతో మరొక పత్రికను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాది రష్యన్ కమ్యూనిస్టు పార్టీ పూర్వపు బోల్షివిక్ వారసత్వానికి ప్రతినిధిగా తిరిగి ప్రజాపత్రికగా 'ప్రావదా'ను ప్రారంభించి నడుపుతోంది. ఇప్పుడు శత వసంతాల ఉత్సవాన్ని మాస్కోలో ఏర్పాటు చేసింది.
పత్రిక ఒక ఆయుధం
కమ్యూనిస్టు పార్టీ, పీడిత ప్రజలకు పత్రికల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. 'ప్రావదా' పత్రిక ప్రారంభంలోనే లెనిన్ దానికి కార్మికవర్గ దృక్పథం కల్పించేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు తాను సైద్ధాంతిక వెలుగుబాటను చూపుతూనే మరోవైపు తొలి 99 సంచికల్లోనే 1,783 కార్మిక అభిప్రాయాలను ప్రచురించి పత్రికను కార్మికవర్గం సొంతం చేసుకొనేలా చూశారు. తొలి సంచిక విడుదల సమయంలోనే లెనిన్ ఒక షరతు విధించాడు. వార్తా పత్రిక ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లాలని చెప్పటంతో పాటు 'పార్టీ ఇచ్చే నిధులపై ఆధారపడవద్దు, పత్రిక ప్రచురణకు అవసరమైన నిధులను సంపాదించుకోవాలి, కార్మికుల నుంచి ఒక పెన్నీ విరాళం వసూలు చేయండి. ప్రెస్‌ను అభివృద్ధి చేసి పటిష్ట పరచండి. అందుకు డబ్బు అవసరం. పత్రికలు ప్రజలను సంతృప్తి పరిచేలా తీసుకు వచ్చినపుడే అది సాధ్యం' అని స్పష్టంగా చెప్పాడు.
వ్యాసకర్త ఫోను : 9490099006