ముందుచూపు, నిశిత పరిశీలన, సూత్రబద్ధ విశ్లేషణ కలవారిని మనం మేధావులని అంటాం. వీరు తమదైన రంగంలో అసాధారణ ప్రజ్ఞ కలిగి ఉండి, ఇతరులకంటే భిన్నమైన వ్యక్తిత్వంతో కనిపిస్తారు. ప్రధానంగా బుద్ధిబలమే కలిగిన వారవడం చేత సాధారణ పరిస్థితుల్లో ఉదాత్తంగా ప్రవర్తించినా, క్లిష్ట సమయాల్లో పలువురు వెనకడుగు వేస్తుంటారు. అలాగే, ఆదర్శ మేధావుల సంఖ్య అతి తక్కువగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి నిజాయితీ కలిగిన ఒక విప్లవ మేధావి అద్భుత జీవిత చిత్రణే ఈ 'రూదిన్' నవల. విశ్వవిఖ్యాత రష్యన్ నవలా రచయిత తుర్గేనెవ్ రచనల్లో ఒక ఆణిముత్యమే ఈ నవల.
ఇదీ, కథ
రష్యాలోని ఆ మారుమూల పల్లెటూళ్లో 'లాసున్‌స్కయా' అనే డబ్బు గల విధవరాలి భవనం కొండ మీదుంది. తాను యూరప్ అంతా పర్యటించాననీ, వివిధ దేశాల్లో గల పెద్ద మనుషులంతా తనకు తెలుసుననీ డాంబికాలు పలికే ఆవిడ- ప్రతి వేసవిలోనూ ఆ పల్లెటూరి భవనానికొస్తుంటుంది. ఈసారి తన ముగ్గురు పిల్లలూ, నౌకర్లూ చాకర్లతో దిగింది. పెద్ద కూతురు నతాలియా 17 ఏళ్ల సుందరి. మిగిలిన ఇద్దరూ చిన్నవాళ్లు. నతాలియాకు ఫ్రెంచి నేర్పే పంతులమ్మా, చిన్న పిల్లల ట్యూషన్ మాష్టర్ చెసిస్టోవూ, ఆ ధనికురాలి ప్రాపకం సంపాదించిన పాండలిలిస్కీ ఆ పరివారంలో ఉన్నారు. ఒకరోజు ఆ ధనికురాలు విందు ఏర్పాటు చేసి, అతిథుల్ని పిలిచింది. విందుకు కారణం : చక్రవర్తి ఆంతరంగికుడొకడు తాను రాసిన ఆర్థిక, వాణిజ్యపరమైన ఒక వ్యాసాన్ని వినిపించి, ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వస్తూండటమే.
విందుకు హాజరైన వాళ్లలో ఇచ్చకాల రాయుడైన పిగసోవ్, అందగత్తె, వితంతవూ అయిన డాక్టర్ పావ్‌లోవ్నా, ఆమె అన్న పావ్‌లోవిచ్ తదితరులున్నారు. పెళ్లికాని ఈ పావ్‌లోవిచ్ నతాలియాపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ప్రధాన అతిథి ఇంకా రాకపోయేసరికి పోసుకోలు కబుర్లు చెప్పే పిగసోల్ రకరకాల వికారాలు పోతూ కొంతసేపు కాలక్షేపం కలిగించాడు. భోజనాల వేళకు అతిథికి బదులుగా, ఆయనే పంపిన మరో 'రూదిన్' వచ్చాడు. అతడు అందగాడే గానీ, మాసిన బట్టలు ధరించాడు. తనకి తాను ఒక మేధావినని భావించే పిగసోవ్, రూదిన్ ముందు కూడా తన మేధోశక్తిని ప్రదర్శించాలని చూశాడు గానీ, రూదిన్ అతడిని మాటలతోనే నోరు మూయించేసరికి, అక్కడున్నవారంతా రూదిన్‌తో మాట్లాడేందుకు కుతూ హలాన్ని ప్రదర్శించారు. అతని విజ్ఞానానికీ, మేధస్సుకీ వారంతా ఆశ్చర్యపోయి, అంత గొప్పవాడు ఆ పల్లెకొచ్చి తమతో మాట్లాడటం తమ అదృష్టమని భావించారు. ఇదంతా పాండలిలిస్కీకి ఈర్ష్య కలిగిస్తే, పావ్‌లోవ్నాకు గౌరవం కలిగింది. నతాలియా అతని మాటల్ని శ్రద్ధగా విన్నది. రూదిన్ ఎన్నో సంగతులను, నాటి విద్యా విధానం, శాస్త్రీయ అంశాలు మరెన్నింటినో కవితాత్మకంగా చెబుతూంటే, అంతా మంత్రముగ్ధుల్లా విన్నారు. అందరిపైనా అతని ప్రభావం ప్రగాఢంగా పడింది. వారి సంభాషణల్లో ఆ ఊళ్లోనే తన మిత్రుడు లెజ్‌నోవ్ ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు రూదిన్. ఇంతలోనే ఏదో వ్యవహారం మీద యజమానురాలిలో మాట్లాడేందుకు లెజ్‌నోవ్ వచ్చాడు. పని ముగించుకోగానే వెళ్లిపోయాడుగానీ, రూదిన్‌ను చూసి కూడా పలకరించలేదు. ప్రతి మానవుణ్ణి తన స్నేహితుడనుకున్నట్లే లెజ్‌నోవ్‌నీ అనుకున్నాననీ, కానీ చిన్నపాటి మనస్పర్ధతోనే అతడు తనకు దూరమయ్యాడనీ రూదిన్ బాధపడ్డాడు.
యజమానురాలి కోరికపై రూదిన్ ఆ ఇంట్లో కొద్దికాలం ఉన్నాడు. ఒకరోజు నతాలియా, ఆమె పంతులమ్మలతోపాటు తోటలో షికారుకు వెళ్లి, మాటల సందర్భంలో తనకక్కడ విశ్రాంతి తీసుకోవాలనుంది అన్నాడు. 'ఇతరుల్లా కాక, మీలాంటి వాళ్లు లోకంలో ఏదో పని చేస్తుండాలి. మీరుకాకపోతే ఇంకెవరు చేస్తారు?' అని ప్రశ్నించింది నతానియా. ఆమె మాటలు తనకు కర్తవ్యాన్ని ఉపదేశించాయని చెబుతూ, 'మీలో కవిత్వముంది. సౌందర్యం ఉన్నచోట కవిత్వముంటుంది' అన్నాడు రూదిన్. వీరిద్దరూ సన్నిహితంగా మాట్లాడుకోవడాన్ని దూరం నుంచి చూసిన పావ్‌లోవిచ్, ఇక తనకు నతాలియా దక్కదేమోనని చింతించాడు.
రూదిన్‌తో మాట్లాడటం యజమానురాలికి ఒక వ్యసనంలా తయారైంది. అతని ద్వారా నతాలియా తన సందేహాల్ని తీర్చుకునేది. వనవిహారం సందర్భంగా ఒకరిపై ఒకరికి గల ప్రేమను వారు వ్యక్తం చేసుకోవడాన్ని చాటునుంచీ విన్న పాండలలిస్కీ ఆ సంగతి ఆమె తల్లికి చేరేశాడు. ఆమె కూతుర్ని తీవ్రంగా మందలించింది. ఈ ప్రేమ కారణంగా తనను అపార్థం చేసుకోవద్దని రూదిన్ కోరినా, పావ్‌లోవిచ్ అతన్ని అగౌరపరిచాడు.
తల్లి మందలింపుల కారణంగా అతనికి దూరంగా ఉన్న నతాలియా, ఉత్తరం ద్వారా అతన్ని ఊరి బయట కలుసుకుని, అతనితో ఎక్కడికయినా వచ్చేస్తానని చెప్పింది. ఈ విషయాలేవీ తెలియని రూదిన్, ఆమె తల్లి తిరస్కారాన్ని విని ఆశ్చర్యపోయాడు. తను చేసిన నేరమేమిటి? తనమీద గల గౌరవమంతా ఉత్తదేనా? అని అయోమయానికి గురైన అతడు- ఏం చేద్దాం అని నతాలియాను అడిగాడు. 'మగాడివి, నన్నడుగుతావేం? నిన్ను నమ్మి వచ్చాను. ఏం చేద్దామో నువ్వే చెప్పు' అన్నదామె. అతను ఆలోచించి, 'సుఖాల్లో పెరిగినదానివి. నేను పేదవాణ్ణి. నీ తల్లి అంగీకారం లేకుండా మన వివాహం న్యాయం కాదు. అందువల్ల స్నేహితుల్లా విడిపోదాం' అనేసరికి, ఆమె కోపించి, వెళ్లిపోయింది.
తరువాత అక్కడినుంచి బయల్దేరతాడు రూదిన్. తను వెళ్లిపొమ్మనకుండానే అతడు వెళ్లిపోతున్నందుకు యజమానురాలు సంతోషించి, ఏం ఎరగనట్లు పలకరిస్తుంది. ఇదంతా నాటకం వేసేముందు చేసుకునే రిహార్సల్‌లా ఉంది. తాము మాట్లాడుకునేదేదో ముందే అనుకునే ప్రభుత్వాధినేతలు ఇలానే సమావేశాల్లో పాల్గొంటారనుకుంటాను అనుకున్నాడు రూదిన్. అతనికి శిష్యప్రాయంగా ఉన్న చెసిస్టోవ్ చాలాదూరం అతన్ని సాగనంపాడు.
రెండేళ్లు గడిచాయి. ఏడాదికిందటే పావ్‌లోవ్నాను లెజ్‌నోవ్ పెళ్లాడాడు. వారికో పిల్లాడు పుట్టాడు. ఇచ్చకాలమారి పిగసోవ్ వారింటికి ఓ రోజు వచ్చి, రూదిన్ గురించి అసభ్యంగా మాట్లాడేసరికి, లెజ్‌నోవ్ అతణ్ణి తీవ్రంగా మందలించి, రూదిన్ అసాధారణ వ్యక్తి అనీ, అతడెందరికో ఉత్తేజాన్నిచ్చే బోధకుడనీ పొగిడాడు. ఈ మాటలు మిగతావారితోపాటు, అప్పుడే వచ్చిన బెసిస్టోవ్ కూడా ఆశ్చర్యం అనిపించాయి. 'లోగడ రూదిన్‌ని నిందించి ఇప్పుడు సమర్థిస్తున్నావు. కారణం ఏమిటని' అడిగింది పావ్‌లోవ్నా భర్తని. 'నిన్ను ప్రేమించాను గనుక, అతని ఆకర్షణలో నువ్వెక్కడ కొట్టుకుపోతావో అని అలా నిందించాను.' అంటూ 'పిగసోవ్ పరమ వంచకుడు. రూదిన్‌ని నిందించడానికతడికెంత ధైర్యం?' అని కోపంతో పళ్లుకొరికాడు.
చాన్నాళ్లు గడిచాయి. ఒకరోజు రష్యాలో మారుమూల ఓ హోటళ్ల లెజ్‌నోవ్ అనుకోకుండా రూదిన్‌ని కలుసుకుంటాడు. ఆప్యాయంగా పలకరించి, ఏం చేస్తున్నావనీ అడిగాడు. బాగా అలసిపోయినట్టు, కుంగిపోయినట్టు ఉన్న రూదిన్ తన విషాద స్మృతుల్ని చెప్పాడు. తన జీవితమంతా ఒడిదుడుకులతోనే నడిచిందని, శారీరకంగా, మానసికంగా ఎన్నో అవస్థలు పడ్డానని, ఒకప్పుడు తానని ఇష్టపడినవాళ్లే తర్వాత వ్యతిరేకించారనీ, ఎన్నో సమస్యలు తనని బాధిస్తున్నాయనీ బాధ వ్యక్తం చేశాడు. అప్పుడు లెజ్‌నోవ్, 'సత్యాన్వేషణలో నువ్వు నిత్య యవ్వనుడివి. నేనొక ప్రేక్షకుణ్ణి మాత్రమే. సంఘర్షణ నీ ఊపిరి. నీకేం కావలసి వచ్చినా నేనున్నానని గుర్తుంచుకో' అని ఓదార్చాడు.
మరికొంత కాలం గడిచింది. అది 1848, జూన్ 26. పారిస్ నగరంలో ఆంటోని ఫ్లాబర్గ్ వీధిలో ఒక ప్రాంతం. అప్పటిదాకా ప్రజ్వరిల్లిన విప్లవాగ్ని సన్నగిల్లుతోంది. సైనికులు విప్లవకారుల మీద, ప్రజల మీదా విరుచుకుపడుతున్నారు. రక్షణ శ్రేణిని నిర్మించుకున్న విప్లవయోధులు ఆ వీధిలోని ప్రతి అంగుళాన్నీ కాపాడుతున్నారు. ఇంతలో సైనికులు తుపాకులతో విరుచుకు పడ్డారు. ప్రజలు తుపాకీగుళ్ల నుంచి తప్పించు కునేందుకు పారిపోతున్నారు. ఇంతలో రక్షణ దుర్గం మీద ఒక వ్యక్తి మెరుపులా ప్రత్యక్షమయ్యాడు. చిరిగిన చొక్కాతో, ఒక చేతిలో ఎర్రజెండా, మరో చేతిలో కత్తి పుచ్చుకున్నాడు. కొద్దిసేపట్లోనే తుపాకీ గుళ్లకు బలై కూలిపోయాడు. అతడెవరో కాదు; మన కథానాయకుడు రూదినే. ఫ్రెంచి విప్లవంలో ఒక సమిధ అయ్యాడు. సిద్ధాంతాలు చెప్పడానికే కాదు, చెయ్యడానిక్కూడా అని నిరూపించిన మేధావిగా అతణ్ణి సాటి విప్లవకారులు కొనియాడారు.
వ్యాసకర్త ఫోను : 9493474836