శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో మనం అభివృద్ధి చెందామని అనుకుంటున్న తరుణంలో సమాజంలో మూఢనమ్మకాలను విశ్వసించే ప్రజలు ఇంకా ఉన్నారు. అనారోగ్యానికి గురయిన వారు డాక్టర్లను సంప్రదించకుండా , బాబాలు, మంత్రగాళ్ల దగ్గరకు వెళ్తున్నారు. వారి బలహీనతనలను ఆసరాగా చేసుకుని సొమ్ముచేసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెలో మూఢ నమ్మకాలను ప్రచారం చేసే ఓ భూతవైద్యురాలి పరిస్థితి పరిశీలిద్దాం. మీకు ఆపదలు వస్తేనే నేను గుర్తొస్తానా.. కొడకా..! ఇన్నాళ్లూ నన్ను మరచిపోయారు కదా! మీ ఇంటి పెద్ద మంచాన పడ్డాడు.. కొడకా..! కాళ్లూ చేతులూ పడిపోయాయి.. గడువు కాలం సమీపిస్తోంది.. అయినోళ్లే చెడుపు (చేతబడి) చేశారు కొడకా.. చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండాడు కొడకా.. మీ ఇంటి చుట్టూ గ్రహాలు (దుష్టశక్తులు) తిరుగుతుండాయి కొడకా! మీ గూడులో (ఇంట్లో) శాంతి లేదు కొడకా.. మీ కెవరికీ నిద్ర కూడా సరిగా పట్టదు కొడకా..' అని మెడలో ఝూటీ (పెద్ద దారపు కొరఢా) వేసుకుని ఉన్న మహిళ ఊగిపోతూ చెబుతుంటుంది.. బాధితుడు గోపాలయ్య భార్య, కొడుకులు 'అవునమ్మా! నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా.. మాకు మా దగ్గరి బంధువులే చేతబడి చేసిండ్రు (బంధువు రమణయ్య మీద అనుమానం).. నువ్వే మాపై దయచూపాలి... మమ్మల్ని గండం నుంచి గట్టెక్కించాలి' అని వేడుకుంటారు.. 'భయపడకండి కొడకా.. నేనున్నాను.. ఇదిగో.. నా నిమ్మకాయ, తీసుకో కొడకా... బయట కొంతసేపు ఉండండి.. నా భక్తురాలు మీకు నా రక్షను ఇస్తుంది.. దానిని తీసుకెళ్లి ఇంటి పెద్ద నడుముకు కట్టండి. నిమ్మకాయను ఆయన తలకింద పెట్టుకుని పడుకోమనండి.. మళ్లీ మరో వారం తప్పకుండా రండి' అంటూ ఆ మహిళ చెబుతుంది. వీళ్లు బయటకొచ్చాక అరగంటకు నకిలీ దేవత మామూలుగా నడచి వచ్చి రాగి రేకుతో తయారు చేసిన అంత్రాన్ని(తాయత్తు) ఇచ్చింది. దానికి 516 రూపాయలను తీసుకుంటుంది.. అప్పటికీ తగ్గకపోతే అమావాస్య రోజు చేతబడికి విరుగుడు చేస్తారు. 5,116 రూపాయలు తీసుకుంటారు.. ఇదీ ఇక్కడి వ్యాపారం.. నెలకు 15-20వేల రూపాయలను సంపాదిస్తుంది. మంగళ, శుక్ర, ఆదివారాలు మాత్రమే 'దేవత' ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుందట. ఈ గ్రామం మాజీ ఎంపిలు దుర్గా రామక్రిష్ణ, ఝాన్సీలక్ష్మి, మాజీ ఎంఎల్‌ఏ లలితకుమారి, సిడిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ భాస్కర్‌నాయుడు స్వగ్రామం కావడం గమనార్హం. నలగాంపల్లిలోనే గాకుండా టేకుమంద, బొమ్మాయపల్లి, మొగిలిమిట్టూరు, కీరమంద ప్రాంతాల్లోనూ 'నకిలీ' దేవతలకు అమాయకులు బలవుతున్నారు.
గోపాలయ్య సాధారణ మధ్యతరగతి రైతు. అతని సోదరుడు రమణయ్యతో పంటచేను వివాదం ఉంది. గొడవలు జరిగాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ గ్రామంలో పంచాయితీ పెట్టారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తన తమ్ముడే తనను కొట్టాడన్న బాధతో గోపాలయ్య మంచం పట్టాడు. ఆవేదనతో రోజురోజుకూ కుంగిపోసాగాడు. ఓ రోజు ఉన్నట్లుండి అతనికి మూర్చ వచ్చింది. మరో రెండు రోజుల్లో కాళ్లు, చేతులు పని చేయలేదు. డాక్టర్లకు చూపించారు. ఇది పక్షవాతమని చెప్పారు. మందులు తీసుకున్నారు. కానీ నయం కాలేదు. చుట్టుపక్కల వాళ్లు 'మందులకు తగ్గలేదంటే ఇదేదో చేతబడిగా ఉంది, భూతవైద్యునో లేక బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి గ్రామంలో దేవత దగ్గరకు వెళ్లండి' అని కొందరు సలహాలిచ్చారు. నలగాంపల్లిలో అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ ఓ మహిళకు అమ్మవారు పూనుతుంది. మంగళ, శుక్ర, ఆదివారాలు మాత్రమే దేవత ఆమె శరీరంలో ప్రవేశిస్తుంది. ఐదారు గంటలు మాత్రమే ఒంటిపై ఉంటుంది. మిగిలిన రోజులంతా మామూలుగానే ఉంటుందని అక్కడి వారి నమ్మకం.
రూ.51 చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ఒక కొబ్బరికాయ, రెండు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అరటిపండ్లు, విభూది తీసుకెళ్లి ఆమెను సంప్రదించాలి. గ్రామస్తుల సలహా మేరకు గోపాలయ్య భార్య కమలమ్మ, కొడుకు చెప్పినవన్నీ తీసుకుని వెళ్లారు. దేవతకు మొక్కుకున్నారు. ఇంతలో ఓ మహిళ మెడలో ఝూఠీ వేసుకుని పూనకం వచ్చినట్లు ఊగుతుంది. కూర్చుని తాను దేవతనని, భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు అవతరించానని చెబుతుంది. ఇంతలో మరో వ్యక్తి 'మీ టోకెన్ రెండవది, సిద్ధంగా ఉండండి' అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో మరో మహిళ వీరి పక్కన చేరి చొరవతో 'మీరెక్కడివారు, మీ సమస్యేంటి' అని అడిగింది. 'నేను అమ్మ భక్తురాలిని. అమ్మను నమ్ముకున్నాను. గిట్టనివారు నాకు చేతబడి చేశారు. ఇక్కడికి వచ్చాక నయమయ్యింది. అందుకే నెలకు నాలుగైదు సార్లు ఇక్కడకు వస్తాను' అని అడక్కుండానే తన గురించి చెప్పింది. 'అవును అంతా నిజమే చెబుతారా' అని గోపాలయ్య భార్య నమ్మకంగా అడిగింది. ఇంతకీ మీ సమస్య ఏంటని అడిగి తెలుసుకుంటుంది. వివరాలన్నీ చెప్పిన తరువాత 'సరే నాకు వేరే పని ఉంది' అని చెప్పి ఆ భక్తురాలు వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన కొంతసేపటికి వీరికి పిలుపు వచ్చింది. 'మీకు ఆపదలు వస్తేనే నేను గుర్తొస్తానా కొడకా.. ఇన్నాళ్లూ నన్ను మరచిపోయారు కదా.. మీ ఇంటి పెద్ద మంచాన పడ్డాడు.. కాళ్లూ చేతులు పడిపోయాయి.. గడువు కాలం సమీపిస్తోంది.. అయినోళ్లే చెడుపు (చేతబడి) చేశారు కొడకా.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండాడు కొడకా, మీ ఇంటి చుట్టూ గ్రహాలు (దుష్టశక్తులు) తిరుగుతుండాయి కొడకా.. మీ ఇంట్లో శాంతిలేదు...' అంటూ ఊగిపోతుంది.
గోపాలయ్య భార్య 'అవునమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, మాకు మా దగ్గరి బంధువులే చేతబడి చేసిండ్రు' అని సమాధానమిస్తుంది. 'నువ్వే మాపై దయ చూపాలి.. మమ్మల్ని గండం నుంచి గట్టెక్కించాలి' అని వేడుకుంటారు. 'భయపడకండి కొడకా.. నేనునున్నాను.. ఇదిగో నా నిమ్మకాయ. తీసుకో కొడకా.. బయట కొంతసేపు ఉండండి. నా భక్తురాలు మీకు నా రక్షను ఇస్తుంది. దానిని తీసుకెళ్లి ఇంటి పెద్ద నడుముకు కట్టండి. నిమ్మకాయను ఆయన తలకింద పెట్టుకుని పడుకోమనండి.. మళ్లీ వారానికి తప్పనిసరిగా రండి' అంటూ చెబుతుంది. వీళ్లు బయటకు వచ్చిన అరగంటకు ఆ మహిళ (నకిలీ దేవత) రాగి రేకుతో తయారు చేసిన అంత్రాన్ని వీళ్లకు ఇచ్చింది. దానికి రూ.516 రూపాయలను తీసుకుంటుంది. ఆమె చెప్పినట్లే గోపాలయ్య భార్య చేస్తుంది. తన భర్తకు రమణయ్య కుటుంబం చేతబడి చేసిందని ఊరంతా ప్రచారం చేసింది. దీంతో మళ్లీ ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. వారం తరువాత మళ్లీ వచ్చి ఆ దేవతతో 'నువ్వు చెప్పినట్లే చేశాం.. అయినా ఫలితం లేదు.. మా ఆయనకు నయం కాలేదు' అని వాపోతుంది. 'భయపడకు కొడకా.. పెద్ద మాంత్రికుని చేత చెరుపు చేయించారు.. మీ ఇంటికి తూర్పు భాగంలోని ఓ చెట్టుకింద చెరుపు చేసి పాతి పెట్టారు. దాన్ని బయటకు తీసి కాల్చేయాలి.' అని చెబుతుంది. దీంతో భీతిల్లిన గోపాలయ్య భార్య 'ఎలాగైనా నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లీ' అంటూ వేడుకుంటుంది.'నా భక్తుడు మీ ఇంటికొస్తాడు.. అతడే మీకు చేసిన చెరుపును తొలగిస్తాడు' అని చెబుతుంది. ఆ తరువాత ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చి 'వచ్చే అమావాస్య రోజున మీ ఇంటికొస్తాను. మీకు చేసిన చెరుపును తొలగిస్తాను. పూజకు ఒక కోడి పుంజు లేదా మేకపోతు, 16 నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, 101 ఆకులు, వక్కలు, 11 టెంకాయలు, ఇతర సామాగ్రి కావాలి.. ఇవన్నీ సమకూర్చుకుని నాకు ఫోన్ చేయండి' అని నెంబర్ ఇచ్చాడు.
అమావాస్య రానే వచ్చింది. గోపాలయ్య ఇంటికి ఈ భక్తుడు వెళ్లాడు. పూజ మొదలు పెట్టాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వారి ఇంటి ఆవరణలో ఓ గోతిని తీశాడు. అందులో ఏదో ఒక మూటను బయటకు తీశాడు. మేకపోతు లేదా కోడిని గొంతుకోసి నిమ్మకాయలను పిండి ఏదేదో మంత్రాలు చదివాడు. ఆ తరువాత ఆ మూటను విప్పి చూడగా అందులో 'తలవెంట్రుకలు, నిమ్మకాయ, మట్టి, కోడిగుడ్డు'లను విప్పి చూపించాడు. ఇవన్నీ గోపాలయ్యవేనని, ఆయనను చంపడానికి బంధువులు చేసిందేనని నమ్మించాడు. ఇక ఏ భయమూ లేదని వారిని నమ్మించాడు. త్వరలోనే అతను కోలుకుంటాడని చెప్పి అక్షరాలా 5,116 రూపాయలకు తగ్గకుండా వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. గుడి వద్ద అమ్మవారుగా చెలామణి అవుతున్న మహిళ, వీరితో ముందుగానే వివరాలను సేకరించిన మరో మహిళ, గోతిలోనుంచి చెరుపు బయటకు తీసిన వారంతా బంధువులు కావడం గమనార్హం. అమావాస్యకు ముందు రోజు రాత్రే ఆ భక్తుడు గొయ్యి తీసి వెంట్రుకలు, నిమ్మకాయలను మూటగట్టి పెట్టి వెళ్లడం వారు గమనించలేని వాస్తవాలు. ఇలా అనేకమంది అమాయకులు వీరిచేతిలో మోసానికి గురవుతున్నారు. వీరందరినీ మోసగిస్తున్న మహిళ మాత్రం ఆస్తులను, కూడగట్టుకుంటోంది. ఇదేవిధంగా బంగారుపాళ్యం మండలంలోని టేకు మంద, బొమ్మాయపల్లి, మొగిలిమిట్టూరు, కీరమంద తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున నకిలీ దేవతలు చెలామణి అవుతూ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ దురాగతాలను అడ్డు కునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉంది.
అమాయకులను మోసం చేస్తున్నారు
ఎం.లోకనాధనాయుడు, నలగాంపల్లి
దేవత అనేది ఒక కులానికి చెందిన వారిలోనే మాత్రమే ఎక్కువగా వస్తోంది. మేమూ పూజలు చేస్తున్నాం. మాకు ఎవరికీ రాలేదు. కావాలనే దేవత వస్తున్నట్లు నటిస్తున్నారు. దీనివల్ల వారు ఆర్థికంగా అభివృద్ధి అయ్యారు. సామాన్యులు మూఢనమ్మకాల్లో కూరుకుపోతున్నారు. చైతన్యవంతులను చేయాల్సి ఉంది.
ఇది మానసిక వ్యాధి
డాక్టర్ పి.లక్ష్మీప్రసూన, సైక్రియాటిస్టు, రుయాస్పత్రి
ఇదొక మానసిక వ్యాధి. దెయ్యాలు, దేవతలు శరీరంలోకి ప్రవేశించాయంటూ పూనకం వచ్చినట్లు ఊగడాన్ని 'కన్వర్షన్ డిజార్డర్' అంటారు. మనస్సులోని ఒత్తిడిని ఆ విధంగా బహిర్గతం చేస్తుంటారు. నమ్మేవాళ్లున్నంత కాలం ఇలాంటి ప్రచారాలకు కొదవే ఉండదు.