రజకులు మేర పెంచాలని అడగడమే నేరమైంది. మాకే ఎదురు చెబుతారా అని పెత్తందార్లు దాడి చేశారు. రజకులను సాంఘిక బహిష్కరణ చేశారు. ఇతరులు రజకులకు సహకరిస్తే సాంఘీక బహిష్కరణ చేస్తామని గ్రామంలో దండోరా వేయించారు. దీంతో రజకులు నెలల తరబడి భయంతో జీవనం సాగిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని పెత్తందారులు రజకుల మధ్య రాజీ చేసినా రజకులపై దాడులు ఆగలేదు. ఇటీవల పెద్దమ్మ జాతర సందర్భంగా పెత్తందారులు రజకులను మరోమారు పిలిపించారు. గ్రామంలో అందరి బట్టలు ఉతకాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి బట్టలు వేయాలని రజకులే అడగాలని పెత్తందార్లు హుకుం జారీ చేశారు. రజకులు తాము ఇంటింటికి వెళ్లి బట్టలు వేయాలని అడగబోమని, మాపై దాడి చేశారు కాబట్టి వాళ్లే వచ్చి అడిగితే ఉతుకుతామని చెప్పారు. మాకే ఎదురు చెబుతారా అని పెత్తందారులు మరోసారి రజకులపై దాడి చేశారు. రజకుల్లో పురుషులంతా గ్రామం వదిలి పారిపోయారు. పెత్తందార్లకు ఎదురుచెబితే దళితులపై, బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేయడం ఈ ప్రాంతంలో పరిపాటిగా మారింది. పెత్తందార్లు, అగ్ర వర్ణాల వారు ఏమి చెబితే అదే వినాలి. లేదంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సిందే. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో రజకులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం.
టంగుటూరు గ్రామంలో రజకులపై వివక్ష కొనసాగుతుంది. గ్రామంలో 30 రజక కుటుంబాలు ఉన్నాయి. కులవృత్తితోనే ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 2012 మేలో ఈ కుటుంబాలు మేర పెంచాలని అడగడంతో పెత్తందారులు సాంఘీక బహిష్కరణ చేశారు. ఈ నెల 20న పెత్తందార్లు రజకులను పెద్దమ్మ జాతర ఉందని దేవాలయం వద్దకు పిలిపించారు. గ్రామంలో కొందరి బట్టలు రజకులు శుభ్రం చేయడం లేదని, పెద్దమ్మ జాతర సందర్భంగా గ్రామంలోని అన్ని ఇళ్లలో బట్టలు శుభ్రం చేయాలని తెలిపారు. ఇళ్ల వద్దకు వెళ్లి బట్టలు వేయాలని రజకులే అడగాలన్నారు. అయితే రజకులు తాము 10 నెలల నుంచి కొందరి బట్టలు శుభ్రం చేయడం లేదనీ, ఇప్పుడు వెళ్లి అడిగితే తమకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. తమను సాంఘిక బహిష్కరణ చేసిన వారు వచ్చి అడిగితేనే బట్టలు శుభ్రం చేస్తామని తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన పెత్తందార్లు రజక నాగమద్దిలేటి, బాలయ్య, పెద్దన్న, పెద్ద మద్దిలేటి, శ్రీనివాసులు, బాల మద్దిలేటిలపై దాడి చేసి గాయపరచారు. దీంతో భయపడిన రజకులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. పశువులు, గొర్రెలు, మేకలు ఉన్న రజక కుటుంబాల్లో మహిళలు వాటిని వదిలి వెళ్లలేక ఇళ్ల వద్దనే బిక్కు బిక్కు మంటూ భయంతో జీవనం సాగిస్తున్నారు. గాయాలైన రజకులు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే రజకులు గ్రామంలోకి వచ్చినా అన్ని విధాలా వివక్షకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదనపు జెసి రామస్వామి, బిసి కార్పొరేషన్ ఎడి రవిచంద్రారెడ్డి గ్రామంలోకి వచ్చి తూతూ మంత్రంగా విచారణ చేసి అందరు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేతప్ప రజకులపై జరిగిన దాడి గురించి విచారణ చేపట్టలేదు. 2012 మేలో గ్రామంలోని రజకులు తమకు ఏడాదికి రూ. 1800 మేర సరిపోవడం లేదని గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. పెత్తందార్లు, అగ్ర వర్ణాల వారు రజకులకు మేర పెంచడం వీలు కుదరదనీ, పాత మేరకే బట్టలు శుభ్రం చేయాలని ఆదేశించారు. సౌడు, సున్నంపొడి, నీలిమందు ధరలు పెరిగాయని రజకులు తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందనీ మేర పెంచాలని వేడుకున్నారు. పెత్తందార్లు మూడేళ్ల వరకు మేర పెంచేది లేదనీ, పాత మేర ప్రకారమే బట్టలు శుభ్రం చేయాలని హుకుం జారీ చేశారు. రజకులు తాము ఈ మేరకు బట్టలు శుభ్రం చేయలేమని తెలిపారు. దీంతో ఆగ్రహించి అగ్ర వర్ణాల వారు రజకులపై అప్పట్లో దాడి చేశారు. రజకులు బట్టలు శుభ్రం చేయడం మానేశారు. అగ్ర వర్ణాల వారు రజకులకు గ్రామంలో ఎవరైనా పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు అంగళ్లలో అమ్మరాదనీ, వారి వద్ద సరుకులు కొనరాదనీ, ఎవరూ మాట్లాడరాదనీ, ఎలాంటి పనులకు పిలువరాదని దండోరా వేయించారు. రజకులను సాంఘీక బహిష్కరణకు గురి చేశారు.
దీంతో రజకులు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించారు. గ్రామంలోని కొందరు పెత్తందార్లపై కేసులు నమోదు చేశారు. ఆర్‌డిఓ ఆధ్వర్యంలో డిఎస్పీ విచారణ చేసి రజకులకు, అగ్రవర్ణాల వారికి రాజీ కుదిర్చారు. రాజీ సమయంలో ఏడాది వరకు రూ. 1800 మేరకే రజకులు బట్టలు శుభ్రం చేయాలని అధికారులు ఒప్పించారు. రజకులు అదే మేరకు బట్టలు శుభ్రం చేయడం మొదలు పెట్టారు. అయితే గ్రామంలో 70 ఇళ్లు రజకులకు బట్టలు వేయలేదు. పెద్దమ్మ జాతర సందర్భంగా గ్రామంలో ఉన్న అందరి బట్టలు శుభ్రం చేయాలని 2013 ఫిబ్రవరి 20న గ్రామ పెద్దలు రజకులను గ్రామ చావిడి వద్దకు పిలిపించారు. గతంలో తాము బట్టలు శుభ్రం చేస్తామని చెప్పినా బట్టలు వేయలేదని అలాంటి వారి ఇళ్ల వద్దకు వెళ్లి తాము బట్టలు వేయాలని అడగలేమని, వారే వచ్చి బట్టలు వేస్తామంటే శుభ్రం చేస్తామని రజకులు తెలిపారు. అగ్రవర్ణాల వారు తాము రజకులను బట్టలు శుభ్రం చేయాలని అడగేది లేదని, వారే తమ ఇళ్ల వద్దకు వచ్చి బట్టలు వేయాలని అడుక్కోవాలని తెలిపారు. మాకూ ఆత్మగౌరవం ఉందనీ వారే మా బట్టలు ఉతకాలని అడగాలని రజకులు చెప్పారు. దీంతో రజకులపై మరోసారి దాడి చేశారు. గతంలో రజకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అది మనసులో ఉంచుకొని నిత్యం దాడులు చేస్తున్నారని రజకులు వాపోయారు. తమ పశువులను పొలాల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. తమను పనులకు పిలువడం లేదని రజకులు చెప్పారు. మరోసారి దాడి చేయడంతో రజకులు ప్రాణభయంతో వణికి పోతున్నారు. ఆచారం పేరుతో గ్రామంలో రజకులతో తక్కువ మేరకే బట్టలు శుభ్రం చేయించాలని అగ్ర వర్ణాల వారు ఒత్తిడి తెస్తున్నారు. కులవృత్తి మానేస్తే తాము గ్రామంలో బతకడమే కష్టమని తెలిపారు. మేర చాలక కుటుంబ పోషణ భారమవుతుందని రజకులు పేర్కొంటున్నారు. తాము గ్రామం వదిలి వెళ్లలేక, ఇక్కడ బట్టలు శుభ్రం చేయలేక అగ్ర వర్ణాల వారి చేతుల్లో దాడులకు గురవుతున్నామని వాపోతున్నారు. జిల్లా అధికారులకు మొర పెట్టుకున్నా తూతూ మంత్రంగా దాడులు చేసినప్పుడు స్పందిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులు చేసినప్పుడు ఐదుగురిపై కేసులు నమోదు చేయడం, తర్వాత వారి సమస్య గురించి అధికారులు పట్టించుకోవడం లేదు.
రజకులపై దాడి చేసిన వారిపై కేసునమోదు
రజకులపై దాడి చేసిన విజయభాస్కర్‌రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, పుల్లారెడ్డి, నాగేశ్వరరెడ్డి, గోపాల్‌రెడ్డిపై నందివర్గం ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి కేసునమోదు చేసి రిమాండుకు పంపారు. వీరిపై ఐపిసి 324, 147, 148, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మేర పెంచమని అడిగినందుకు దాడులు చేస్తున్నారు : కాశమ్మ
మేర పెంచాలని అడిగినందుకు తమపై కక్ష కట్టి దాడులు చేస్తున్నారు. మేర గిట్టడం లేదని, సౌడు, సున్నంపొడి, నీలిమందు ధరలు పెరిగాయి. గ్రామం నుండి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న కుందూకు వెళ్లి బట్టలు శుభ్రం చేయాలి. దీంతో తమకు మేర చాలడం లేదని అడిగినందుకు రెడ్డిగార్లు తమపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం, బ్యాళ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. ఏడాది పాటు బట్టలు శుభ్రం చేస్తే కుటుంబానికి రూ. 1800, ఇస్త్రీకి రూ. 300 ఇస్తున్నారు. ఈ సమస్యలన్నీ చెప్పినా మాకులపోళ్లపై దాడులు చేసి గాయపరిచారు.
పశువులు ఉండటంతో ఊరు వదిలి వెళ్లలేదు: మధు
గొర్రెలు, పొట్టేళ్లు, పశువులు ఉండటంతో గ్రామం వదిలి వెళ్లలేదు. పెద్దమ్మ జాతర ఉందని మాట్లాడాలని పిలిపించి దాడి చేసి గాయపరిచారు. మాకులపోళ్లను ఊర్లో బతకనీయడం లేదు. మాకు గ్రామంలో ఎవరూ సహకరించడం లేదు. పశువులను మేపుకోవడానికి పొలాల వద్దకు వెళితే రానివ్వడం లేదు. అన్ని విధాలుగా తాము వివక్షకు గురవుతున్నాం. తమకు న్యాయం చేయాలి.
భయం భయంతో బతుకుతున్నాం : లక్ష్మిదేవి
దాడులు జరిగినప్పటి నుంచీ మగవాళ్లు ఇళ్ల వద్ద ఉండటం లేదు. మేము భయం భయంగా బతుకుతున్నాం. మేర పెంచాలని గత సంవత్సరం అడిగాం. అప్పటి నుంచి తమపై అగ్ర వర్ణాల వారు దాడులు చేస్తున్నారు. పనులకు పిలువడం లేదు. కొన్ని ఇళ్ల వారు బట్టలు కూడా వేయడం లేదు. దీంతో అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాం.
రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి: నాగరాజు
రజక సంఘం జిల్లా నాయకులు
జిల్లాలో రక్షకులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. ఆత్మకూరు మండలం కురుకుంద, గడివేముల మండలం ఘని, మంచాలకట్ట, కోవెలకుంట్ల మండలం కానాల తదితర గ్రామాల్లో మేర పెంచమంటే రజకులపై పెత్తందార్లు దాడులు చేస్తున్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. ఎస్పీ, జిల్లా కలెక్టర్, బిసి వెల్ఫేర్ అధికారి దాడులు జరిగిన గ్రామాలను సందర్శించాలి. మూడు నెలలకు ఒక సారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. టంగుటూరు గ్రామంలో రజకులకు తగిన రక్షణ కల్పించాలి.