ఆగని అఘాయిత్యాలు

  • మహిళలకు రక్షణ కరువు
  • నీరుగారుతున్న మహిళా చట్టాలు
  • నాయకుల బెదిరింపులతో రాజీలు

ఆకాశంలో సగం, అన్నింటిలో సగం అని చెప్పుకోవడం వరకే పరిమితమైంది. మహిళలపై జరుగుతున్న హింసను రూపుమాపాలని, ఇది ఒక సామాజిక సమస్యగా ఉందని అనేక దశబ్దాలుగా మహిళలు, ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. ఆధునిక సమాజంలో మహిళలు వివిధ రంగాల్లో మెరుగుదల సాధించినా అనేక ప్రాంతాల్లో మహిళలు దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారు. బ్రూణహత్యలు, పుట్టిన తర్వాత స్త్రీగా వివక్ష, అణచివేతలకు గురవుతున్నారు. పని ప్రదేశాల్లో, వ్యవసాయ భూముల్లో, చదువుకునే చోట, గృహాల్లో ఇలా ఎక్కడ చూసినా హింసను ఎదుర్కొంటున్నారు. మహిళల కోసం తెచ్చిన చట్టాలు ఉన్నోళ్లకు చుట్టాలుగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహిళలపై జరిగిన హత్యలు, అత్యాచారాలపై ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం...

మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల మండలం అనంతాపురంలో ఈనెల 2న ప్రేమ పేరుతో ఒక యువతి ని ఓ యువకుడు వంచించాడు. మనస్థాపం చెందిన పదో తరగతి చదివే దళిత మహేశ్వరి(15) కిరోషిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటివి అనేక ఘటనలు ఇక్కడ జరిగాయి. వాటిలో కొన్ని ఇటిక్యాల మండలం శనగపల్లికి చెందిన దళిత నీరజ గద్వాలలో సరస్వతీ విద్యామందిర్‌లో పదో తరగతి చదువుతుండేది. 2009 ఫిబ్రవరి 24న కనిపించకుండా పోయింది. 2009 మార్చి 7న పిజెపి కాల్వలో శవమై తేలింది. 2006లో గద్వాల మండలం గుంటిపల్లికి చెందిన ఏడో తరగతి చదివే దళిత మేరిపై అదే గ్రామానికి చెందిర కొందరు అత్యాచారం చేసి పిజెపి కాల్వలో పడేశారు. ధరూర్‌ మైలగడ్డకి చెందిన దళిత రంగమ్మ అదే గ్రామ అగ్రకుల భూస్వామి పొలానికి కూలీకి వెళ్లేది. ఆ అమ్మాయిని కొందరు లోబర్చుకోవడంతో గర్భవతి అయ్యింది. దీంతో ఆ గ్రామంలో పంచాయితీ నిర్వహిం చారు. అనంతరం బలవంతంగా అబార్షన్‌ చేయించడంతో రక్తస్రావమై చనిపోయింది. పోస్టు మార్టం రిపోర్ట్‌లో కూడా అబార్షన్‌ చేయడం వల్లే చనిపోయినట్లు తేలింది. గట్టు మండలం పెంచికలపాడుకి చెందిన నర్సింగమ్మ(13)పై 2005లో ధరూర్‌ మండల కేంద్రంలోని ఆర్‌బిసి సెంటర్‌లో పని చేసే వాలంటీర్‌ గర్భవతిని చేశాడు. 2013 జనవరి 13న ధరూర్‌ మండలం మన్నాపురం గ్రామానికి చెందిన కుర్వ శాంతిపై అదే గ్రామానకి చెందిన యువకులు అత్యాచార యత్నం చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల వత్తిళ్లతో కేసు నీరుగారిపోయే పరిస్థితి ఉంది. 2012 మే 16న వడ్డెపల్లి మండలం కలుకుంట్లలో శివమ్మపై అత్యారం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2012 జూన్‌ 14న ఇటిక్యాల మండలం బీచుపల్లి గ్రామంలో ఇంద్రజపై అత్యాచారం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నాలుగు సంఘటనలు కూడా 14 ఏళ్ల లోపు బాలికలపైనే జరిగాయి. గద్వాల డివిజన్‌లో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగిన కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి. రాజీల వల్ల కొన్ని, బెదిరింపుల మరికొన్ని కేసులు నీరుగారి పోయాయి.

ఆధునిక సమాజంలోనూ పురుష్యాధిక్యతను, హింసను మహిళలు తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుండి విముక్తి కోసం మహిళలు, మహిళా సంఘాలు చేస్తున్న పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు సాధించినా అవి అమలుకు నోచడం లేదు. చట్టాలపైనా, హింసకు గల కారణాలపైనా పాలకులు విపరీతార్థాలు తీస్తున్నారు. వీటన్నింటికీ మహిళలే కారణమని కొందరు పాలకులు, రాజకీయ నాయకులు తప్పుడు సంకేతాలి స్తున్నారు.

చట్టాలు ఉన్నోడికి చుట్టాలు

ఎంతో మంది మహనీయులు సమాజా భివృద్ధికి ఆటంకంగా ఉండే సాంఘిక దురాచారాలయిన బాల్య వివాహాలు, వరకట్నం, హంసలపైనా చర్చించారు. చట్టాలు రూపొందించారు. సమాజంలో మహిళలు ఉన్నత స్థాయిలో ఉంటే తప్ప ఏ దేశం పురోగభివృద్ధిచెందదని పోరాడి చట్టాలు సాధించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చైతన్య స్ఫూర్తి భారత మహిళలకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలిగాయి. 1990 తరువాత వచ్చిన సంస్కరణలు మహిళల జీవన శైలిపై ఏరకమైన ప్రభావం చూపుతున్నాయో ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుషులోరు అన్న గురజాడ మహిళలంటే మట్టి అనుకుంటున్నారా అని పాలక వర్గాలను హెచ్చరించారు. ఆ బాటలోనే మహిళా చైతన్యం విరబూసింది. ఇలాంటి సంఘసంస్కర్తలు మహిళాభివృద్ధి కోసం చేసిన త్యాగాలు, వారి పోరాటాలతో వచ్చిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. . వీరేశలింగం, జ్యోతిరావుపూలే, రాజారామ్మోహన్‌రారు, డాక్టర్‌ బిఆర్‌ అండేద్కర్‌ వంటి వారి అడుగుజాడలు ఎప్పటికీ సజీవం. ప్రగతిశీల భావాలతో అనాగరిక చర్యలను తిప్పి కొట్టిన సంఘసంస్కర్తలు, మహనీయుల జయంతులు, వర్ధం తులను కూడా రాజకీయంగా వినియోగించుకుం టున్న పాలకులు అటువంటి వారి ఆశయాలకు గోరీ కడుతున్నారు. ఉన్నత స్థానాలలో ఉన్న నాయకులే వస్త్రధారణలే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పటికీ గిరిజన, గోండు జాతులు, చిన్నారులు ఏ వస్త్రధాణలో ఉన్నారు. వీధికో బెల్టుషాపుకు అనుమతిస్తూ బాగా తాగి అత్యాచారాలు చేయడాని ప్రోత్సహిస్తున్నారు. జరిగిన అత్యాచారాల్లో 80 శాతం మద్యం మత్తులో చేసినవే అని పోలీసు స్టేషన్లలో చేసిన ఫిర్యాదులే ఇందుకు ఉదాహరణ.

ప్రపంచీకరణ విష వలయంలో మహిళలు

మద్యపానం, బెల్టుషాపులు, అర్ధనగ చిత్రాల ప్రదర్శన, టీవీ సీరియళ్లు, నేర చరిత్ర, సినిమాలు, డిస్కోథెక్‌ల సంస్కృతి, సాంకేతికత వీటన్నింటినీ కలబోసుకున్న ప్రపంచీకరణ మహిళల జీవితాలకు శాపంగా మారింది. పాలకులు సరిగ్గా ఇవే అంశాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచీకరణ స్త్రీలను అంగడి సరుకుగా నిలబెట్టింది. అటువంటి ప్రపంచీకరణ విధానాలపై మహిళలు తిరగబడక తప్పదు.

చదువుకు దూరమవుతున్న దళిత బాలికలు

బాలికలు అత్యాచారాలకు బలవుతుండటంతో చదువులకు దూరమవుతున్నారు. గద్వాల డివిజన్‌ అక్షరాస్యతలో వెనుబడింది. ఇందులో దళిత మహిళల అక్షరాస్యత శాతం అట్టడుగున ఉంది. ఇప్పుడిప్పుడే దళితులు తమ పిల్లలను చదివించుకో వాలనుకుంటున్న తరుణంలో వివిధ సంఘటనలతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. వివిధ రూపాల్లో వేధించడం వల్ల బాలికలు చదువులకు దూరమవ్వడమే కాక తనువు చాలిస్తు న్నారు. ఇటిక్యాల మండలం శనగపల్లికి చెందిన నీరజ (10వ తరగతి), గద్వాల మండలం గుంటిపల్లికి చెందిన మేరీ(7వ తరగతి), అనంతపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(10వ తరగతి), గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన నర్సింగమ్మ(ఆర్‌బిసి సెంటర్‌ విద్యార్థినీ)లు వివిధ రూపాల్లో వివక్షతకు గురై మృతి చెందారు. విద్యార్థినీలు మృత్యువాత పడుతుండటంతో చాలా మంది దళిత బాలికలకు చదువుకోవడానికి విముకత చూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా చదివించాలనే ఆలోచన చేయడం లేదు.

మాన ప్రాణాలకు దిక్కులేదు

ప్రభుత్వం మహిళా చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చట్టాలు నీరుగారిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నేరాలను అరికట్టాలి. 2004 నుంచి 70 మంది దళిత మహిళలు డివిజన్‌లో కుల రక్కసికి బలైపోయారు. ఈ అఘాయిత్యాల కారణంగా దళిత యువతులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారు. నేటికి పాఠశాలల్లో అంటరానితనం రాజ్యమేలుతుంది. అగ్రవర్ణ కులాల యువకులు దళిత బాలికలను మోసం చేస్తూ మానప్రాణాలను తీస్తున్నా ప్రభుత్వం ఒక్క నేరస్తుడిని కూడా తగిన శిక్ష వేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దళిత స్త్రీలకు, వారి పిల్లల రక్షణ కల్పించాలి. దళితులపై జరిగే హత్యలు, అత్యాచారాలు అరికట్టాలి. పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సంఘటన స్థలానికి పోయి విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలి. పోలీసులు, కుల సంఘాల నాయకులు గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తూ కేసులను నీరు గారుస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే దాడులను అరికట్టవచ్చు. ఇతర కులాల్లో సంఘటనలు జరిగితే పోలీసులు వెంటనే స్పందిస్తారు. దళిత మహిళలకు మాత్రం న్యాయం జరగడం లేదు. న్యాయంకోసం దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. మహిళా మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం.

జి.ఆశన్న - కెవిపిఎస్‌ గద్వాల డివిజన్‌ ప్రధాన కార్యదర్శి