రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అంటరాని తనాన్ని నిషేదించింది. కానీ నేటికీ గ్రామాల్లో రెండు గ్లాసుల విధానం, దళితులకు కాగితాల్లో టిఫిన్ పెట్టి ఇతరులకు ప్లేట్లలో పెట్టడం, అగ్రకులాల వీధుల్లోకి దళితులు రాకుండా కంచెలు వేయడం చూస్తున్నాం. దేవాలయాల్లోకి దళితులను రానివ్వడం లేదు. క్షౌరశాలలో క్షౌరాలు చేయక పోవడం, దళితుల వినాయకున్ని అగ్రకుల వీధుల్లో ఊరేగింపు చేయనీయడం లేదు. తెల్లబట్టలు వేసుకుంటే సహించ లేక పోతున్నారు. దసరా పండుగనాడు దళితులను జమ్మిఆకు తీసుకోనివ్వడం లేదు. రచ్చబండల మీద కూర్చోనీయక పోవడం ఇలా అనేక రూపాల్లో వివక్ష కొనసాగుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు చెన్నరులో కూడా వివిధ రూపాల్లో వివక్షరూపాలున్నాయి. ఇలాంటివి పోవాలంటే పోరాటమే మార్గమని అనేక సందర్భాల్లో రుజువైంది. ''విప్లవం విజయవంతమవ్వాలంటే అసంతృప్తి ఉంటేనే చాలదు. రాజకీయ, సామాజిక హక్కుల సాధన పట్ల ధృఢమైన విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం''. అన్న అంబేద్కర్ సూక్తి చెప్పినట్లు చెన్నరులోని మదురై జిల్లా పేరయూర్ తాలూకాలోని ఉత్తమపురం గ్రామంలో ఏళ్లతరబడి జరిగిన పోరాటం ఫలించింది.
'1989వ సంవత్సరం తరువాత తొలిసారిగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాము' ఉత్తమపురానికి చెందిన పొన్నయ్య అనే దళితుని మాటలివి ...
దళితులకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు), తమిళనాడు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి సాగించిన సుదీర్ఘ పోరాటం విజయం సాధించింది. గ్రామంలో ఇరు వర్గాల అంగీకారం మేరకు గురువారం సాయంత్రం గ్రామ దళితులు ముత్తలమ్మాళ్ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించారు. మదురై జిల్లా పేరయూర్ తాలూకాలోని గ్రామం ఉత్తమపురం. ఈ గ్రామంలో దళితులతో పాటు మరో కులానికి చెందిన వారిపై అగ్రవర్ణాలు ఆధిపత్యాన్ని చెలాయించేవారు. దళితులను గ్రామంలోని ప్రధాన వీధుల్లోకి, ఆలయంలోకి అనుమతించేవారు కారు. 1948, 1964, 1989లో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇరు వర్గాలకూ చెందిన అనేక మంది గాయాలు పాలయ్యారు. 1989వ సంవత్సరంలో దళితులు ఆలయంలోకి ప్రవేశించకుండా పెత్తందార్లు గోడను నిర్మించారు. ప్రధాన వీధిలోకి, ఆలయం పక్కనే ఉన్న బస్సు షెల్టర్ వద్దకు దళితుల రాకను నిషేధించారు. బస్సుల కోసం దళితులు చెట్ల నీడలోనే వేచి ఉండాల్సి వచ్చేది. ఆలయ ఉత్సవాలకు అన్ని చెట్లకూ విద్యుద్దీపాలు అలంకరించి దళితులు నిలబడ్డారనే కారణంలో కొన్ని చెట్లకు నిలిపివేశేవారు. ఈ విషయమై సిపిఎం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు నిర్వహించింది. దళితులకు అండగా సిపిఎం నిర్వహించిన భారీ ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్ కూడా పాల్గొన్నారు. దీంతో ఘర్షణలకు కారణమైన ఆలయాన్ని మూసివేశారు. అనేక ఉద్యమాల అనంతరం 2008, మే 6న దళితుల రాకను నిషేధిస్తూ నిర్మించిన గోడను కూల్చివేశారు. 2007వ సంవత్సరంలో తమిళనాడు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఏర్పడింది. సిపిఎం చేసే ఉద్యమాలలో ఈ సమితి కూడా పాల్గొంది. ఇరు వర్గాలతో సంప్రదించి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు జిల్లా కలెక్టర్, పోలీసులు చర్చలు నిర్వహించారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య ఈ ఏడాది అక్టోబర్ 22న ఓ అవగాహన కుదిరింది. దళితులకు ఆలయ ప్రవేశం, ఆలయ సమీపంలో ఇరు వర్గాలకూ ఉపయోగపడే విధంగా బస్సు షెల్టర్ నిర్మాణం, దళితులు తమ వీధుల్లోకి రానివ్వకుండా నిర్మించిన గోడ స్థానంలో రోడ్డు ఏర్పాటు, ఇరు వర్గాలూ పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకోవడం, తదితర అంశాలకు సంబంధించి ఇరు వర్గాల అంగీకారంతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై ఇరు వర్గాలవారూ సంతకాలు చేశారు. దళిత కాలనీ నుంచి సిపిఎం జిల్లా నాయకులు సెల్లకన్ను, ముత్తురాణి, తమిళనాడు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఎం తంగరాజు, ఎస్‌కె పొన్నుతాయి, తదితరులు వెంటరాగా సాయంత్రం 4.30 గంటల సమయంలో 11 మంది దళితులు బయలుదేరారు. ఆలయ ముఖద్వారం వద్ద అగ్రవర్ణాల పెద్దలు వారిని లోపలికి ఆహ్వానించారు. ఇరు వర్గాలూ ఉమ్మడిగా పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో త్వరలో జరగనున్న కుంభాభిషేకానికి హాజరుకావాలని కోరగా అందుకు దళితులు సమ్మతించారు. మదురై రూరల్ ఎస్‌పి ఆశ్రా గార్గ్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నెలకొన్న సమస్య కొద్ది రోజుల్లోనే అంతా మారిపోతుందనుకోవడం లేదన్నారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. కానీ, ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామంలో ఏర్పాటుచేసిన పోలీసు పికెటింగ్ కొంతకాలం కొనసాగిస్తామన్నారు.
స్వాగతించిన సిపిఎం, టిఎన్‌యుఇఎఫ్
ఉత్తమపురంలో దళితుల ఆలయ ప్రవేశాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణన్, తమిళనాడు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి సంపత్ ఒక ప్రకటనలో స్వాగతించారు. రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను కూడా దళితులు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒప్పందం మేరకు ఈ ఆలయ ప్రవేశం జరిగినా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృత్త కాకుండా చూడాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దళితు లపై కొనసాగుతున్న వివక్షను రూపుమాపేలా ప్రభు త్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.