డాక్టర్ ఎం, రమాదేవి,
జనవిజ్ఞాన వేదిక,
సమత స్టేట్ కన్వీనర్.
బీహార్‌లో 59శాతం కుటుంబ హింసకు గురవుతున్నారు. 19శాతం లైంగిక వేధింపులకు బలవుతున్నారు. మహిళలపై గృహహింస జాతీయ సగటు 37శాతం. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే 14శాతం భౌతికహింస, 35శాతం లైంగికహింసను అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంటూ స్త్రీలు బతుకును వెళ్లదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. నిజానికి భారతదేశంలో ఎయిడ్స్‌కన్నా గృహహింసవల్ల ఎక్కువమంది మహిళలు చనిపోతున్నారు. మహిళలపై నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వరసగా మూడేళ్లు అగ్రస్థానంలో వుంది. మహిళల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు, వాటి అమలుకు ప్రత్యేక యంత్రాంగాలు వున్నా అవన్నీ ముసుగుతన్నాయని భావించాల్సి వస్తోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమై నేటికి నూరేళ్లు. స్త్రీలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు వుండటం ద్వారానే పురోగతి అనేది ఈ సారి ఐక్యరాజ్యసమితి నినాదం. 18,19 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మహిళా ఉద్యమాల స్ఫూర్తితో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలైంది. ఈ నేపథ్యంలో సమాన అవకాశాలు, సమాన హక్కులు ఎంత వరకు సాకారమయ్యాయి. ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఒకసారి పరిశీలిద్దాం. నేటి ఆధునిక మహిళ అనేక రంగాలలో తన పాత్రను అద్వితీయంగా పోషిస్తుంది. చిన్న ఉద్యోగం నుంచి రాష్ట్రపతి పదవి వరకు తన ఉనికిని చాటుతుంది. స్త్రీకి వున్న మనసు, భావం, మేధ వినియోగించుకుంటే కుటుంబం, సమాజం, దేశం, తద్వారా ప్రపంచం ప్రగతిపథంలో పయనిస్తుందని కందుకూరి, గురజాడ వంటివారు ఏనాడో చెప్పారు.అయితే ఇప్పటికీ మహిళలు బయటికి రావటాన్ని ఆర్థిక ప్రయోజనాల రీత్యా అంగీకరిస్తున్నారే తప్ప అభివృద్ధి, సమానస్పృహతో చేస్తున్నది చాలా తక్కువ. అంతకంతకు మహిళలకు అవకాశాలు మెరుగు పడుతున్నట్టు, అన్నిటా మహిళలే ముందంజలో వున్నట్లుగా కనిపిస్తున్నదంతా నేతిబీరకాయలో నెయ్యి చందమేనని... నిజానికి మహిళల అభివృద్ధి ఆ రీతిలో లేదననేది అంగీకరించాల్సిన కఠోర వాస్తవం.
భ్రూణహత్యలు:
ఆడపిల్లకు జీవించే హక్కు కాలరాయబడుతుంది. ఆడపిల్లనే సాకుతో భ్రూణహత్యలు పెరిగాయి. దేశంలో ఆడపిల్లల శాతం తగ్గింది. ప్రతీ వెయ్యిమంది పురుషులకు మహిళల సంఖ్య 927. అట్టడుగు కులాలలో అది 919కి దిగజారింది. దీనికి నిరక్షరాస్యత, పోషకాహార లోపమే కాకుండా సమాజ ఒత్తిడి, వేళ్ళూనుకున్న పితృస్వామ్యభావజాలం ముఖ్య కారణాలు ఇటీవల యునిసెఫ్ మాతృమరణాలకి, పేదరికానికి వున్న సంబంధం గురించి అధ్యయన రిపోర్ట్ వెల్లడించింది. దాని ప్రకారం పేద దేశాలలో ప్రసవసమయంలో 300 రెట్లు స్త్రీలు మరణించే ప్రమాదంలో వున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ధనిక దేశాలల్లో కన్నా పేదదేశాలల్లో పుట్టిన పిల్లలు 14 రెట్లు అధికంగా మొదటి నెలలో చనిపోయే పరిస్థితి వుంది. చిన్న వయస్సు బాలిక గర్భందాల్చితే ఆమె ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. అలాగే 15సం|| వయస్సులో ప్రసవించే బాలిక చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా వుంది. 95 శాతం మాతృమరణాలు సంభవిస్తున్నది ఆఫ్రికా మరియు ఆసియా దేశాలలోనే. మరీ ముఖ్యంగా 35 శాతం దక్షిణాసియులే. ఈ ప్రాంతంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షలమంది 15,19 ఏళ్ళ వయసున్న బాలికలు, యువతులు ప్రసవసమయంలో మరణిస్తున్నారని యునిసెఫ్ రిపోర్ట్ ప్రకటించింది.
గృహహింస
ప్రపంచవ్యాప్తంగా గృహహింస కేసులు తొమ్మిది లక్షలకు పైబడి వుండగా, ముపైలక్షల మంది ప్రేమపేరుతో మరణిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. 2006లో గృహహింస కారణంగా తొమ్మిది లక్షల కేసులు నమోదయ్యాయి. గృహహింసనుండి రక్షణచట్టం వచ్చిన తరువాత కూడా స్త్రీలు హింసకు గురవడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతున్నాయో అర్థంచేసుకోవచ్చు.
దురదృష్టమేమిటంటే పాపులేషన్ కౌెన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 88 శాతం గృహిణులు భర్తలు భార్యలను కొట్టడం తప్పేమీ కాదని వెల్లడించారట. ఈ పరిస్థితి మారాలంటే స్త్రీలు పితృస్వామిక భావజాలం నుండి బైటపడాలని, మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరముందని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.
ఆడపిల్లల అక్రమరవాణా:
ప్రపంచవ్యాప్తంగా మహిళల అక్రమరవాణా వ్యాపారంపై యేటా దాదాపు 32వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. మాదకద్రవ్యాలు, అయుధాల రవాణా తర్వాత మనుషుల రవాణాయే అతి పెద్ద అక్రమ వ్యాపారంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మహిళల అక్రమ రవాణాలో మొదటి స్థానంలో వున్నది. ఇందులో చిన్నపిల్లల నుండి పాతికేళ్ళలోపు అమ్మాయిలే 80 శాతం వున్నారు. గ్రామాల్లోని పేదవారు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు, సినిమా వ్యామోహం, ప్రేమపేరుతో నమ్మి మోసపోయినవారిని ప్రలోభపెట్టి వారికి తెలియకుండానే ఈ వృత్తిలోకి దింపుతున్నారు.న్యాయస్థానాలు మొట్టికాయలేస్తేనో, మానవహక్కులసంఘాలు ఉద్యమించినప్పుడో అప్పటికప్పుడు స్పందించడమే తప్ప... వ్యభిచార నిరోధకానికి ప్రభుత్వం చేస్తున్న కృషి దాదాపు శూన్యం. వ్యభిచార కేసులలో సెక్స్‌వర్కర్లను అరెస్టుచేయటం సమస్యకు పరిష్కారం కాదు. వ్యభిచార నిరోధకానికి అనేక దేశాలు పకడ్బందీగా చట్టాలు రూపొందిస్తుండగా... మన కేంద్ర సర్కారు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వల్లే పరిస్థితులు ఆందోళనకర స్థాయికి దిగజారుతున్నాయి. పట్టపగలు కూడా ఆడపిల్లలకు రక్షణ లేని దురదృష్టకర పరిస్థితి. ప్రేమ పేరుతో ఆడపిల్లలపై యాసిడ్‌దాడులు, అఘాయిత్యాలు ఇటీవలకాలంలో మరింత పెరిగాయి. ప్రేమను నిరాకరించే అధికారం ఆడపిల్లలకు లేదని పురుషాహంకారంతో విర్రవీగే ఉన్మాదులు ఈ సమాజంనుండే పుట్టుకొస్తున్నారు. ఒంటరి మహిళలకు, భర్తను కోల్పోయిన వారికి రక్షణ కరువైంది. దేశంలో గంటకు 18 అత్యాచారాలు నమోదవుతున్నాయి. మహిళల పట్ల వివక్ష ఎక్కువగా వున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూ ఎన్‌ఎఫ్) విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక వెల్లడించింది. పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో వున్నాయి. మనకన్నా చిన్న దేశమైన సోషలిస్టు క్యూబా 22 ర్యాంకులో నిలిచింది.
ఉన్నత స్థానాలు పొందినా...
పార్లమెంటులో మహిళాప్రాధాన్యం 9 శాతం వుంటే, అసెంబ్లీలలో అంతకన్నా తక్కువగా వుంది. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వంతో చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఒక ప్రహసనంలా తయారైంది. మొత్తం ఐఎఎస్‌లో మహిళల వాటా పదిశాతం, కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగుల్లో 7.5 శాతం వుంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వున్న 526 జడ్జీలలో16 మంది మాత్రమే మహిళలు. అసంఘటిత రంగానికి చెందినవారిలో 96 శాతం మహిళలే అయినా, వారికి ఉద్యోగ రక్షణ కరువైంది. సంఘటిత రంగంలో మహిళా ఉద్యోగినుల రేటు ఎనిమిది శాతం నుండి రెండు శాతానికి పడిపోయింది. వివాహానంతరం బాధ్యతలు సరిగ్గా నెరవేర్చలేరని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఎక్కువ పనిగంటలు కేటాయించలేరనే సాకుతో అనేక సంస్థలు తక్కువ జీతంతో ఎక్కువ పనిని చేయించుకుంటున్నాయి.
ఆంక్షలు ఆడవాళ్లకేనా?
''మహిళల వస్త్రధారణలో కనిపిస్తున్న విచ్చలవిడితనమే వారిమీద లైంగికదాడులకు దోహదం చేస్తుంది. స్త్రీలు సమాజభద్రత, పవిత్రతని కాపాడేవిధంగా వస్త్రధారణని కట్టుబాట్లలో వుంచుకోవడం మంచిది'' అని సాక్షాత్తూ కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
శతాబ్దాలుగా సకల పాపాలకూ మూలంగా స్త్రీలను దూషించడానికి అలవాటుపడ్డ పితృస్వామిక భావజాలానికి కొనసాగింపే ఈ వ్యాఖ్యలు. ఏరోజు పత్రికలు తెరిచినా ఆరేడేళ్ల ఆడపిల్ల నుండి అరవయ్యేళ్ల స్త్రీల వరకూ అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్న వార్తలు కనిపిస్తాయి. వారు కూడా ఈ విచ్చలవిడి వస్త్రధారణకే బలవుతున్నారా? తాగుబోతు తండ్రులు తప్పతాగి కన్నకూతుళ్లపై అత్యాచారాలకు ఒడిగడుతుంటే ఏ ఒక్క న్యాయమూర్తికీ మద్యాన్ని నిషేధించాలన్న ఆవేశం కలగలేదా? అక్కడ సమాజ భద్రత, పవిత్రత గుర్తుకురాదా? అభివృద్ధి పేరుతో స్త్రీలకే మాత్రం సంబంధంలేని అవలక్షణాలని అంటకడ్తున్నారు. అందులో భాగమే ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న పబ్బులు, నైట్‌బజార్లు, సెక్స్‌టూరిజం, ఇంటర్‌నెట్ శృంగారం, ఎస్కార్ట్ గర్ల్స్, కాల్‌గర్ల్స్, ఫ్రెండ్స్ క్లబ్స్, మసాజ్ కేంద్రాలు. అంతగా నిబద్ధత కలవారు విశృంఖలత్వాన్ని, కౌమారప్రేమలను ప్రోత్సహిస్తున్న చలనచిత్రాలను, మీడియాను నియంత్రించవచ్చుగా? పజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు పేరుకు సమానమే కానీ, ఆచరణలో సమానత్వం మచ్చుకైనా కనిపించదు. అన్నిరంగాల్లో పురుషులతో పోటీపడుతూ, భారతదేశంలాంటి దేశాల్లో స్త్రీ తన మనుగడకు ఎంతగా శ్రమిస్తున్నా బలంగా వేళ్లూనుకున్న భూస్వామ్య భావజాలం అడుగడుగునా ఎలా వెంటాడి వేధిస్తోందో అర్థమవుతుంది. అందుకే మార్చి 8 అంటే ఉత్సవం, పండుగ కాదు. మహిళల హక్కుల సాధనకు స్ఫూర్తినిచ్చే రోజు. ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, సమానత్వంకోసం సాగే పోరాటాలకు మహిళలంతా ఏకమవ్వాలి. సమానహక్కులు, అవకాశాలకోసం మహిళాలోకం ఉద్యమించాలి.
ఆడపిల్లల స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంశాలు:
1. ప్రపంచవ్యాప్తంగా చదువుకోని 110 మిలియన్ పిల్లల్లో 60% ఆడపిల్లలు.
2. 18 సం|| నిండే నాటికి బాలురకన్నా బాలికలకు 4.4 సం|| విద్యాకాలం తక్కువ.
3. ప్రపంచం మొత్తంమీద ప్రాథమిక పాఠశాలల్లో నమోదుకాని 30 మిలియన్ పిల్లల్లో 60% మంది ఆడపిల్లలే.
4. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ బారిన పడినవారిలో బాలురకన్నా బాలికలే ఎక్కువ.
5. ప్రతి సంవత్సరం 1,46,000 మంది యువతులు ప్రసవసమయంలో మృత్యువాత పడుతున్నారు.
6. 13 మందిలో ఒక స్త్రీ ప్రసవసమయంలో మరణించే ప్రమాదంలో వున్నారు.
7. 450 మిలియన్ ఆడపిిల్లలు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.