ఉందిలే మంచికాలం...

''అక్కా! చూశావా ఈ అన్యాయం. రోజుకో స్వామి విశ్వరూపాలు టీవీలో 'ప్రత్యక్ష'మవుతున్నాయి. వారిని గుడ్డిగా నమ్మి అనేకులు వేలకు వేలు తగలేసుకున్నారు. ఇప్పుడు చూడు'' అంటూ హడావిడిగా లోపలికి అడుగుపెట్టింది దివ్య.''రావే రా! రావడంతోనే కంగారు పెట్టేస్తావు కదా?! ముందీ మంచినీళ్లు తాగి నిదానంగా కూర్చో!'' నవ్వుతూ ఎదురైంది స్వర్ణ. దివ్య సేదతీరాక, ''చూశానే! టివీలో ఇవేగా వరసగా చూపిస్తున్నారు. ప్రజల బలహీనతల్ని తెలివిగా ఉపయోగించుకుంటూ కోట్లు సంపాదించుకుంటున్న వీరిని చూస్తుంటే ఒళ్లు మండిపోతుందనుకో!''

''అక్కా! నీకు గుర్తుందా?! విజయవాడలో అత్త వాళ్ల వెనుకింటివాళ్లు ఈ దంపతులనే ఆదిదంపతులుగా కొలిచేవారు'' గుర్తుచేసింది దివ్య.

''గుర్తులేకపోవడమేంటి! కళ్యాణం అంటూ వారి ఫోటోలకే పెళ్లిచేసి వేలమందికి భోజనం పెట్టేవారు.'' స్వర్ణ అనగానే ''అదికాదక్కా! ఊరివాళ్లందరి చేతా ఐదేసివేలు కట్టించుకుని అక్కడకు తీసుకెళ్లేవారుగా!'' అంది దివ్య.''ఇలాంటివారంతా దొంగస్వాముల వ్యాపారానికి తోడ్పడే దళారీలే. అందుకు వీళ్లకు చెప్పుకోదగ్గ లాభం ముడుతుంది. ప్రజల్ని మూకుమ్మడిగా మోసపుచ్చి కోట్లు సంపాదించే వ్యాపారంలో వీరంతా భాగస్వాములు'' అంటూ తీసిపడేసింది స్వర్ణ.

''ఆ వెధవలకు సిగ్గు లేదేంటక్కా! టివీల్లో ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారే! మత్తు పదార్థాలిచ్చి ముక్తిమార్గం చూపించడమేంటక్కా? వీళ్లుమాత్రం వేలకొద్దీ ఎదురిచ్చి వారికి 'దాసరికం' చేయడమేంటీ... వొళ్లు తెలీకుండా దొర్లడానికి కాకపోతే...'' అంటూ ఆవేశపడిపోయింది దివ్య.

''ఏం చేస్తామే! నిరక్షరాస్యత, పేదరికం, అమాయకత్వం కలబోసుకున్న ప్రజలకు బాబాలేం మాట్లాడినా కాసింత ఓదార్పుగా అనిపిస్తుంది. తమ ఈతిబాధలను ఓపిగ్గా విని, చిటికెడు విభూదితో నయం చేసేస్తామనే వాళ్లు దిగొచ్చిన దేవుళ్లా కనిపిస్తారు. ఇక వీరు నమ్మి వందలు, వేలు తగలేసుకుంటారు. తర్వాత ఎలాగూ లాభంలేదని తెలుసుకుని మానేస్తారనుకో. కానీ ఈలోగా ఎంతోమందికి మహిమ కలవాడని చెప్తారుగా! ఆ ప్రచారం చాలు ఈ దొంగస్వాములకు కోట్లు కూడగట్టుకోవడానికి!'' అంటూ నిట్టూర్చింది స్వర్ణ.''అదికాదక్కా! వారికంటే తెలీదు. ప్రభుత్వం ఏంచేస్తుంది? నిజానిజాలు తేల్చగలిగి... శిక్షించే సామర్థ్యం వుండీ అశక్తుల్లా చూస్తున్నట్లేగా! అంటే వీరంతా ప్రజలు దయతలచి ఇచ్చిన పదవులను దుర్వినియోగం చేయడమేగా! ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకుంటూ... అక్రమార్జనలతో కులాసా చేస్తున్న ఆషాఢభూతుల పీచమణచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?!'' ఆవేదన వ్యక్తంచేసింది దివ్య.

''నువ్వు చెప్పింది నిజమేనే! కానీ ఈ మోసగాళ్లకి కొమ్ముకాస్తుందే ప్రభుత్వం. అందరికంటే ముందు కాళ్లపైబడి సాష్టాంగ నమస్కారాలు చేస్తోంది ఈ సోకాల్డ్‌ నాయకులే! వారికి ప్రజాక్షేమంకంటే స్వలాభం ముఖ్యం. అయినా నేటి నాయకుల్లో ఆమాత్రం విచక్షణ వుందనుకోవడం మన భ్రమ. ఎందుకంటే రాజాకీయాన్ని అన్నిటికన్నా గొప్ప వ్యాపారమని వచ్చినవారే వీరంతా!''అంది స్వర్ణ నిర్వేదంగా.''లేదక్కా! అలా అనకు. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుంది. సెన్సేషనల్‌ వార్తలకోసం కాక ప్రజలను జాగృతపరచేలా మీడియా తయారైననాడు ఇలాంటి లొసుగులెన్నో బైటపడతాయి. ఏది పాలో, ఏది నీరో ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు వారి చైతన్యమే దొంగస్వాముల భరతం పడుతుంది. అప్పుడు పుట్టకో కల్కి, చెట్టుకో శాంభవిలు తయారు కారు.'' అంది దివ్య నిశ్చయంగా.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్