మెనోపాజ్‌- 2

పాశ్చాత్యదేశాలలో 40-60యేళ్లలోపు మెనోపాజ్‌ వస్తుంది. సగటున ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు మెనోపాజ్‌ వచ్చే వయసు 51. కానీ అందరికన్నా తక్కువగా ఇండోనేషియా, ఫిలిఫ్ఫైన్స్‌లోని మహిళలకు 44యేళ్లకే మెనోపాజ్‌ వస్తుంది. అలాగే దేశమేదైనా గానీ కవలలకు త్వరగా మెనోపాజ్‌ వస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇందుకు వారిరువురూ కలిసి అండాలను పంచుకోవడమే కారణం.

మెనోపాజ్‌లో అడుగుపెట్టిన స్త్రీలలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులొస్తాయి. వాటిలో ముఖ్యమైనవి...

* ఎముకల్లో కాల్షియం తగ్గుదల

* కీళ్లనొప్పులు

* మతిమరుపు

* హార్టెటాక్‌

చెమటలు: శరీరంలో భరించలేనంత వేడిగా అనిపించడం. ఇది 75 శాతం మహిళలు ఫిర్యాదుచేస్తారు. ఈ చెమటలకు కారణం దేహంలో ఒకవిధమైన (ఎల్‌హెచ్‌) హార్మోను విడుదలకావడం. ఈరకం చెమటలు ఎండాకాలంలో, అదీ రాత్రిపూట ఎక్కువగా పడతాయి. దీనివల్ల స్త్రీలు నిద్రలేమికి గురవుతారు.

ఈ చెమటలు, వేడి ఎలా వుంటాయంటే ప్రారంభంలో తలలో వొత్తిడి కలుగుతుంది. తరువాత తలలో, మెడలో, ఛాతి పైభాగంలో వెచ్చదనం కలుగుతుంది. గుండెల్లో దడ రావచ్చు. తరువాత మొత్తం శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెమటల్తో తడిసిపోతారు. దీనివల్ల వారు విపరీతమైన చికాకుకు గురవుతారు. ఈ చెమటలు 10-20 నిమిషాలు ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత 0.2 డిగ్రీ సెలిసియస్‌ తగ్గొచ్చు. ఇలాంటి వేడి, చెమటలు 20శాతం ఆడవాళ్లకు సంవత్సరంకంటే తక్కువ కాలం వుంటాయి. 25-50 శాతం ఆడవాళ్లలో ఐదేళ్లు అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. చెమటలు భరించలేని వాళ్లకు చాలా తక్కువ మోతాదులో ఈస్ట్రోజన్‌ ఇవ్వడం సహాయపడుతుంది. అయితే దీన్ని గైనకాలజిస్టు సలహాతోనే తీసుకోవాలి.

ఆస్టియో పోరమ్‌: ఎముకల్లో కాల్షియం తక్కువవడమే దీనికి కారణం. ప్రతీ ఒక్కరికీ ఎముకల్లోని కాల్షియం నష్టపోవడం జరుగుతుంది. కానీ ఎముకల్లోకి తిరిగి కాల్షియం వచ్చి చేరుతుంది. కనుక ఎటువంటి బాధలూ వుండవు. కానీ ఈ వయసు వచ్చినవారికి కాల్షియం బైటికి వెళ్లడమే తప్ప తిరిగి వచ్చి చేరడం వుండదు. దాంతో సమస్యలు ఎదురవుతాయి. మెనోపాజ్‌ వచ్చిన మహిళలకు ప్రతీ సంవత్సరం ఎముకల్లో 0.75శాతం కాల్షియం తగ్గిపోతుంది. ఇలా తగ్గినపుడు నడుము వంగిపోతుంది. వీరు పొరపాటున కింద పడినపుడు మణికట్టు, కాళ్ల ఎముకలు విరుగుతాయి.

ఈ వయసులో ఎముకలు విరిగాయంటే చాలా బాధపడాల్సివస్తుంది. కనుక తగిన జాగ్రత్త వహించాలి. అంతేకాదు, ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి!

డా. శ్యామలాంబ, ఎంబిబిఎస్‌. (మిగతా సమస్యలు వచ్చేవారం...)

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్