
మనకు మేలుచేసే కీటకాలలో ఇవి అతి ముఖ్యమైనవి. ఇవి తేనెను మాత్రమే కాక మైనం (వ్యాక్స్), పుప్పొడిలాంటి పదార్థాలను కూడా మనకందిస్తాయి. మధురమైన తేనె మనకు సముతుల ఆహారంగా ఉపయోగపడుతుంది. వీని ఉప ఉత్పత్తులు ఇతర పరిశ్రమల స్థాపనకు ఉపయోగపడుతున్నాయి. పరపరాగ సంపర్కం ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి పంటల్లో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా నాలుగు జాతుల తేనెటీగలను గుర్తించినప్పటికీ పుట్ట తేనెటీగలు (ఎపిస్ సెరేనా ఇండికా), ఐరోపా తేనెటీగలు (ఎపిస్ మెర్లిపెరా) పెంపకానికి అనుకూలమైనవి. తేనెటీగలు సంఘజీవులు. ప్రతి తేనెపట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతుటీగలు, కొన్ని వేల కూలి ఈగలు కలిసి జీవిస్తాయి. ఇవి నిర్వహించే విధులు వేర్వేరుగా, స్పష్టంగా నిర్ధారించి ఉన్నాయి. తేనెటీగలు మకరందం, పుప్పొడి సేకరించే క్రమంలో లాభాన్ని పొందుతాయి. తేనెను తయారుచేసుకొని నిల్వ చేసుకుంటాయి. తర్వాత దీనిని ఆహారంగా ఉపయోగించుకుంటాయి. మనం తేనెటీగల్ని పారదోలి, తేనెను మనం సేకరిస్తాం. కృత్రిమంగా తేనెటీగలను పెంచుతున్నాం. ఇది కుటీరపరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, తోటలు విస్తీర్ణంగా పెంచే ప్రాంతాల్లో తేనెటీగల్ని పెంచుతున్నాం. తేనెను వాణిజ్యపరంగా అమ్ముతున్నాం. మకరందం, పుప్పొడి సేకరించే క్రమంలో తేనెటీగలు పరాగ సంపర్కానికి తోడ్పడతున్నాయి. తద్వారా అధికోత్పత్తికి తోడ్పడుతున్నాయి. కృత్రిమంగా సస్యరక్షణ మందులు విస్తారంగా వాడటంతో తేనెటీగల పెంపకం తగ్గిపోయింది. బిటి విషం కలిగిన పంటల (బిటి వంగ, పత్తి) ప్రభావాలు తేనెటీగల పెంపకంపై ఎలా ఉందో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
రాణి ఈగ
ఇది సంపూర్ణంగా వృద్ధి చెందిన ఆడ ఈగ. జీవితకాలంలో ఇది ఒక్కసారే పోతుటీగతో సంపర్కం జరుపుతుంది. ఆ సమయంలోనే జీవితకాలమంతా పెట్టే గుడ్లకు సరిపడా మగ బీజ కణాలను సేకరిస్తుంది. వీటిని బీజకోసంలో నిల్వ చేసుకుంటుంది. రాణి ఈగ ప్రధానపని గుడ్లు పెట్టడం. తేనెపట్టును అజమాయిషీ చేయడం. ఇది ఫలదీకరణం చెందిన, చెందని గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందని గుడ్లు పోతుటీగలుగా వృద్ధి చెందుతాయి. ఫలదీకరణం చెందిన గుడ్లు కూలి ఈగలుగా (వర్కర్లు) మారతాయి. జీవితకాలం రాణిఈగ కూలి ఈగలు ఉత్పత్తి చేసే 'రాజాహారం'తో బతుకుంది.
పోతుటీగ
రాణి ఈగతో సంపర్కం చేస్తుంది. ఇంకేమీ పనిచేయదు. దీని జీవితకాలం రెండు, మూడునెలలే.
కూలి ఈగలు
ఇవి సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు. పునరుత్పత్తి తప్ప తేనె పట్లలో అన్నిపనులూ ఇవే చేస్తాయి. ఇవి ఆరు వారాలు జీవిస్తాయి. మొదటి మూడువారాలు పట్టు లోపల పనులను చేస్తాయి. అంటే మైనపు గదులను శుభ్రం చేయడం, లద్దె పురుగులకు ఆహారాన్ని అందించడం, మైనపు గదుల్ని నిర్మించడం లాంటివి, ఆ తర్వాత మూడువారాలు ఇవి పట్టు వెలుపల పనులు చేస్తాయి. ముఖ్యంగా శత్రువుల నుండి పట్టును రక్షించడం, పుప్పొడి, మకరందం, నీటిని సేకరించడంలాంటి పనులు చేస్తాయి.
ఉపయోగాలు..
తేనెను ముఖ్యంగా మందుల్లో వాడతారు. దీనితో తయారు చేసిన మందులు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించవు. సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా దీనివల్ల ఎలాంటి హానీ జరగదని దీనిని వాడతారు. కీళ్ళనొప్పులకు, వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి, పళ్ళ నొప్పులకు, కొలిస్ట్రాల్ తగ్గించడానికి, జలుబుకి, గుండెజబ్బులకి, రోగనిరోధక శక్తి పెంచుకో వడానికి, అజీర్తి రోగానికి, ఫ్లూలాంటి రోగాలను తగ్గించడానికి, మొటి మల నివారణ, చర్మరోగాల నివారణకు ఉపయోగిస్తారు. క్యాన్సర్ నయం చేయడానికి, అలసిపోయినప్పుడు తిరిగి శక్తిని పొందడానికి కూడా తేనె ఉపయోగపడుతుందని గ్రంధస్థం చేయబడింది. తేనెకు యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉన్నాయి. అందువల్ల దీనికి గాయాల్ని నయం చేసే శక్తి ఉంది. తేనె కణజాలం పునరుద్ధరణలో సహాయపడుతుంది. ఫలితంగా వాపు తగ్గుతుంది. త్వరగా గాయాన్ని నయం చేస్తుంది.
మకరందం అందించేవి..
పండ్ల మొక్కలు : నిమ్మ, నారింజ, బత్తాయి, జీడిమామిడి, అరటి, దానిమ్మ, తాడి, పుచ్చ, రేగి.
కూరగాయలు: దోస, గుమ్మడి, పొట్ల, బీర, కాకర.
నూనెగింజలు: పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుములు.
అపరాలు: పెసర, మినుము, కంది, బఠాణీ, పిల్లిపెసర, ఉలవ.
కలుపుమొక్కలు: గడ్డి చామంతి, పల్లేరు, ఉత్తరేణి, తుత్తురు బెండ
ఇతరజాతి మొక్కలు: జనుము, వేప, బ్రెజిల్ మొక్క.
ఫల మొక్కలు: ఉసిరి, నేరేడు, వెలగ, గానుగ, కుంకుడు, టేకు, యూకలిప్టస్, ములగ
సుగంధ ద్రవ్యాలు: ధనియాలు, ఉల్లి.
పుప్పొడి అందించేవి..
కొబ్బరి, జామాయిల్, జామ
కూరగాయల్లో వంగ, మిరప, టమాట.
నూనెగింజల్లో ఆముదం.
ధాన్యాల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్రలు.
పోషకవిలువలు..
మకరందం (నెక్టర్) నుండి తేనె తయారవుతుంది. దీనిలో సుక్రోజ్, నీరు వీటికి తేనెటీగలు ఎంజైమ్‌లను కలుపుతాయి. ఫలితంగా సుక్రోజ్ ఫక్రోజ్, గ్లూకోజ్‌లుగా మారిపోతుంది. నీరు ఆవిరైపోతుంది. ఇలా ఏర్పడ్డ తేనె చెడిపోదు. తేనెలో సరాసరిన 17.1శాతం నీరు, 82.4శాతం చక్కెర పదార్థం, 0.5శాతం మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చక్కెరలో 38.5శాతం ఫక్రోజ్, 35 శాతం గ్లూకోజ్, 12.9శాతం మాల్టోజ్, సుక్రోజ్ ఇతర చక్కెర రకాలు ఉంటాయి. దీనిలో రెండు శాతం వరకూ విటమిన్లు, కొన్ని మాంసకృత్తులు ఉంటాయి. విటమిన్ బి6, థయామిన్, నయాసిన్, రిబోఫ్లేమిన్, పెంటోథినెక్ ఆమ్లం మరికొన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి. కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్ మూలకాలు కూడా తేనెలో ఉండి పోషకాలను సరఫరా చేస్తాయి.
తేనె నాణ్యతను దానియొక్క విద్యుత్ ప్రసరణ శక్తి (ఎలక్ట్రికల్ కండెక్టెన్స్) ద్వారా తెలుస్తుంది. ఇది ఎక్కువగా ఉంటే తేనె నాణ్యమైనదిగా భావిస్తారు. మానోకో అనే తేనెలో విద్యుత్ ప్రసారశక్తి మామూలు పూల తేనె కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటుంది. అంటే నానోకో తేనె మంచి నాణ్యమైనదన్నమాట. సహజ తీపిలో ఫైటో రసాయనా (న్యూట్రాసూటికల్స్)ల్లో పోలిఫెనాల్స్ ఉంటాయి. ఇది యాంటి ఆక్సిండెంట్‌గా పనిచేస్తుంది. కొవ్వు, కొలిస్ట్రాల్ పదార్థాలు ఉండవు. సోడియం కూడా నామమాత్రం.ఒక టేబుల్ స్పూన్ తేనె 64 కేలరీల శక్తిని ఇస్తుంది.మధుమేహం ఉన్నవారికి తేనె మంచిది. దీనిలోని చక్కెర తిన్న వెంటనే రక్తంలో కలవదు. మొత్తం మీద తేనె గ్లైసీమిక్ సూచిక (రెండు గంటల్లోపల రక్తంలో పెరిగే చక్కెర స్థాయి) ఆరోగ్యకరంగా ఉంటుంది.
మైనంతో..
కొవ్వొత్తుల తయారీకి, అలంకార సామగ్రి (కాస్మిటిక్స్) తయారీకి, మందుల్లో, పాలిషింగ్ మెటీరియల్స్‌లో ఉపయోగిస్తారు. ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడతారు. పన్నీరు (ఛీజ్)ను నిల్వ ఉంచడానికి వీలుగా పైపూత వేయడానికి ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యానికి కూడా వాడతారు.