మా ఉరి గుడికాడ కుచ్చోని పేపరు చూస్తావుంటే... 'ఇది చానా అన్యాయం...కష్టపడేవాళ్లకి సరిగా గుర్తింపు లేకుండా పోతావుండాది' అని బాదపడిపోతా వుండాడు యేడుకొండలు.
'ఇప్పుడు దేనికిరా అంత బాదపడిపోతా వుండావు...ఏమయిందో చెప్పురా' అని అడిగినాను.
'మారెప్ప రాజీనామా చేసినాడంటరా...జడ్‌పిటిసి ఎలక్షన్లలో కాంగ్రెస్ ఓడిపోయిందానికి మారెప్పని రాజీనామా చెయ్యమని చెప్పినాడ సిఎం''
మారెప్ప రాజీనామా చేస్తే నీకేం బాద....ఆయనేం కష్టపడిపోరునాడు...'
'నీకు తెలవదా...ఆయన ఎంత కష్టపడినాడో....తెలుగుదేశం వోల్లని, కమ్యూనిస్టుల్లోని, టిఆర్‌ఎస్‌వోల్లని, చిరంజీవి పార్టీ వోల్లని, పేపర్లలో పనిచేసే విలేకరల్ని, అప్పుడప్పుడు కాంగ్రెస్ వోల్లనిగూడా తిట్టినాడు.....'
'దానికేగదరా...జనం జడ్‌పిటిసి ఎలక్షన్లలోనే ఆయన నియోజకవర్గంలో కాంగ్రెసుని ఓడించిందా...'
'పాపం మారెప్పది ఏం తప్పుండాది చెప్పా.. రాజశేఖర్ రెడ్డి ఎవుర్ని తిట్టాలనుకుంటే వాళ్లని ఆయన తిట్టకుండా మారెప్పతో తిట్టించినాడు...ఆకరికి ఇట్టామాదిర్తో మంత్రి పదవి తీసేసినాడు....ఇది అన్యాయంగాదా....'
'ఓహో అట్టంటావా....'
'మంత్రి పదవి తీసేస్తే తీసేసినాడు...కనీసం నిన్న తిరుపతిలో ఇచ్చినారే టివి నంది అవార్డులు...అదయినా మారెప్పకి ఇచ్చుండచ్చుగదా....'
'టివి సీరియల్స్‌లో నటించేవాళ్లకి నంది అవార్డులు ఇస్తారుగానీ...మారెప్పకి దేనికి ఇస్తార్రా...'
'వాళ్ల సీరియల్లు ఏదో ఒక టివీలోనే వస్తాయి... మారెప్ప తిట్టిన తిట్లు ఎన్నిరోజులు ఎన్ని టీవీల్లో వచ్చినాయో, జనాలకి ఎంత ఆనందం కలిగించినాడో నీకేం తెలుసు చెప్పా....'
'అట్టయితే మారెప్పకి ఇయ్యాల్సిందేగానీ...తిట్టుకునేదాంట్లో చానా మంది సినిమా యాక్టర్లుత పోటీ పడతా వుండారు....పవన్ కల్యాణ్, రాజశేఖర్, జీవిత, రోజ...వీళ్లంతా ఏమైపోవాల'
'వాళ్లకి టివి నంది అవార్డులు సరిపోవు...యట్టా సినిమా నంది అవార్డులు ఇస్తారుగదా...అప్పుడే బాగా తిట్టిన యాక్టర్‌కి గూడా నంది అవార్డు ఇచ్చేస్తే సరిపోతాదిలే'
'ముఖ్యమంత్రిగూడా టివి అడ్వటైజ్‌మెంట్లలో నటిస్తావుండాడు కదరా...ఆయనకి అవార్డు ఇవ్వాల్సిన పన్లేదంటావా....'
'ఆయనకి ఒక నంది ఇస్తే చాల్దు...బంగారు, వెండి, రాగి...అన్ని నందులూ ఆయనకే ఇయ్యాల...అయితే ఆయనకి గూడా ఇయ్యలేదు. నేను ముందుగానే చెప్పినాను గదా....కష్టపడేవాళ్లని సరిగా గుర్తించలేదని...పాపం మన సిఎంగూడా ఎన్నిసార్లు ఇందిరాగాంధీ పేరు చెప్పినాడు, ఎన్నిసార్లు రాజీవ్‌గాంధీ పేరు చెప్పినాడు....నోరు నొప్పెత్తుకునే మాదిర్తో చెప్పినా జనాలు పట్టించుకోలేదురా....'
'జనం గుర్తించాలంటే ఇంకొంచెం నోరు నొప్పెత్తుకునే మాదిర్తో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు చెప్పమను....అట్టనే మారెప్పకిగూడా చెప్పు....ఇప్పుడు తిట్టిన తిట్లు సరిపోలేదు.....దానికే జనం గుర్తించలేదు... ఎట్టా మంత్రి పదవిగూడా లేదుకాబట్టి....ఇంకా కొత్త తిట్లు నేర్చుకోని, ఇంకా ఎవురెవర్ని తిట్టలేదో గుర్తు చేసుకోని తిట్టమని చెప్పు....మెయిన్ ఎలక్షన్లలో అయినా గెలస్తారోమో చూద్దాం....'అని నేను తమాషాకి చెప్పేకుందికి...
నువ్వు చెప్పింది కరెక్టేరా....నువ్వు చెప్పిన ఐడియాని పాటించమని మారెప్పకి, సిఎంకి లెటర్ రాస్తార్రా..' అనేసి గుడికాడ నుంచి బయలుదేరినాడు యేడుకొండలు.
-ఆదిమూలం శేఖర్