రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగన్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా తమపట్ల అవినీతి మంత్రులంటూ ఆరోపణలు చేయడం సరైంది కాదని రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ మండంలోని హైదర్షాకోట్, ఫిరంచెరువు, హిమాయత్ సాగర్ గ్రామాల్లో రూ.కోటి 50 లక్షలతో స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌తో కలిసి వివిధ పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని పత్రికల్లో అవినీతి మంత్రులంటూ తమ ఫొటోలతో హెడ్డింగుల్లో రాయడం తమకు బాధ కలిగిస్తోందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల కోసం ఎన్నో జిఓలను ఇచ్చామన్నారు. ఆ జిఓల ద్వారా అధికారులే లాభపడతారని తమకు తెలీదన్నారు. అధికారులను అరెస్టు చేసి.. మంత్రులను అరెస్టు చేయడం లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ అత్యున్నత న్యాయస్థానం, సిబిఐ తమను విచారించాయన్నారు. శ్రీ లక్ష్మి అరెస్టులో తమ ప్రమేయం లేదన్నారు. తప్పు చేస్తే న్యాయస్థానం ముందు నిలుస్తామన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు.
నగరానికి ధీటుగా శివారు ప్రాంతాల అభివృద్ధి
నగరానికి ధీటుగా శివారు ప్రాంతాల అభివృద్ధి సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. జిల్లాలో రాజేంద్రనగర్ మండల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. అభివృద్ధి దిశలో మండలం దూసుకుపోతుందన్నారు. ఇంద్రారెడ్డి కుటుంబం ఎనిమిది సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి పనులతో అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి ప్రసుత్తం కిరణ్‌కుమార్ సర్కారు వరకు రాజేంద్రనర్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. మారుతున్న కాలానికి శివారు గ్రామాలు నగరానికి ధీటుగా అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభాతో పాటు కాలనీల సంఖ్య పెరుగుతోందన్నారు. చుట్టూ రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో అనేక విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. రాజేంద్రనగర్ నియోజక వర్గం తమకు కుటుంబం లాంటిందన్నారు. ఎలాంటి సమస్యల వచ్చినా పరిష్కరించడానికే నిత్యం తపిస్తామని చెప్పారు.
మణికొండ, నార్సింగి, హైదర్షాకోట్ నుంచి భైరవగూడ వరకు రోడ్లను వెడల్పు చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రోడ్ల విస్తీర్ణం చేయడానికి ఎన్ని నిధులైనా కాంగ్రెస్ సర్కారు ఇవ్వనుందని తెలిపారు. రెండు రిజర్వాయర్లున్నా ఇక్కడి ప్రజలకు నీటి సమస్య శశ్వాత పరిష్కారానికి మంజీరా నీటిని తీసుకురానున్నామని తెలిపారు. మంజీరా నీళ్లు నిలిచి పోయిన హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్, దర్గా, ఖలీజా ఖాన్ గ్రామాలకు కొత్తగా పైపులైన్ కోసం రూ.30 లక్షలతో వేయనున్నట్లు తెలిపారు. పైపులైను పూర్తి కావడంతో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు.
20 రోజుల్లో.. రెండో దశ గ్రామాలకు మంజీరా : మంత్రి
రాజేంద్రనగర్ మండలంలో రెండో దశ గ్రామాలకు మరో 20 రోజుల వరకు మంజీరా నీటిని అందిస్తామని మంత్రి సబితారెడ్డి హమీ ఇచ్చారు. రెండో దశ పనులు పూర్తైందన్నారు. అయితే వర్షాకాలం రాకముందే ఖానాపూర్, కోకాపేట్, గండిపేట్, వట్టినాగులపల్లి గ్రామాల ప్రజలు మంజీరా నీటిని అందించనున్నట్లు తెలిపారు. మరో దశలో మణికొండ, మంచిరేవుల, నార్సింగి, పుప్పాల్‌గూడ, నేక్నాంపూర్ గ్రామాలకు మంజీరా నీటిని అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సమస్యలు పరిష్కరించాలంటూ దళితుల వినతి
మొదటి సారిగా మండలంలోని హైదర్షాకోట్ గ్రామంలో 56 లక్షలతో బిటి రోడ్డు పనులను శంకుస్థాపన చేస్తున్న మంత్రి సబితారెడ్డి గ్రామానికి చెందిన దళితులు మొర పెట్టుకున్నారు. ఇళ్ల పట్టాలు, ఇల్లు, రేషన్ కూపన్లు, రోడ్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఎమ్మార్వో ముకుందారెడ్డి, ఎంపిడిఓ డి.సుజాత, మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, నవాబు ముంతాజ్, పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు ఆంజనేయలు, కట్ట అశోక్‌కుమార్ పాల్గొన్నారు.