మందుల్లేవు.. మహాప్రభో ..!

  • ప్రభుత్వాసుపత్రుల్లో దయనీయస్థితి
  • రోగులకు తప్పని ప్రయి'వేటు'

ప్రభుత్వాసుపత్రులు, పిహెచ్‌సిల్లో మందుల కొరత నెలకొంది. అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులకు స్వాంతన ప్రశ్నార్థకమైంది. సర్కారు దావఖానాలపై నొప్పి నివారణ మాత్రులు, విటమిన్ల లోపాల మూలానా సంక్రవించే వ్యాధుల నివారణకు అవసరమైన మందులు ప్రభుత్వాసుపత్రుల్లో లభించడం లేదు. ప్రభుత్వపరంగా కేటాయించిన నిధులతో సమకూరుతున్న మందులు రోగాలను టైఫాయిడ్‌, మలేరియా, విష జ్వరాలు ప్రబలతున్న సందర్భాల్లో మందుల కొరత ఇబ్బంది పెడుతోంది. వైద్యులు ప్రయివేటు మందుల దుకాణాలకు చీటీలను రాస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వాసుపత్రుల పరిసరాల్లో అనేక మందుల దుకాణాలు వెలుస్తున్నాయి. పిహెచ్‌సిల్లో సూదిమందు ప్రాధాన్యం తగ్గిపోతోంది.

ఇదీ కేటాయింపు విధానం

పిహెచ్‌సి కేంద్రాలకు ప్రతి మూడు నెలలకు రూ.50 వేల విలువ చేసే మందులను, ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి మూడు నెలలకు రూ.70 వేలు విలువ చేసే మందులను వైద్యఆరోగ్యశాఖ కేటాయించాలి. మందులను వైద్య సిబ్బంది జిల్లా కేంద్రాల్లోని 'సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌' నుంచి పొందాల్సి ఉంటుంది. సిడిఎస్‌ నుంచి సమకూర్చుకున్న మందులు సరిపడని పరిస్థితుల్లో పిహెచ్‌సి కేంద్రాల్లోని అత్యవసర నిధుల నుంచి, ఆసుపత్రుల్లో సలహా సంఘాలకు సమకూర్చిన నిధుల నుంచి మందులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొదటి మూడు నెలలకు కేటాయించిన మందులు సరిపడని పరిస్థితుల్లో పిహెచ్‌సిలకు రెండు మూడు నెలలకు కేటాయించే నిధుల గురించి మందులను సమకూర్చుకునే అవకాశం ఉంది.

చొరవచూపని సిబ్బంది

పిహెచ్‌సి కేంద్రాలు, ఆసుపత్రులకు మూడు నెలలకు కేటాయిస్తున్న నిధులతో సమకూర్చుకున్న మందులు సరిపోని నేపథ్యంలో సిబ్బంది రెండు, మూడు నెలలకు కేటాయించే నిధుల నుంచి మందులను తీసుకురావడం లేదు. ఉన్నవాటితోనే సరిపెడుతున్నారు. లేని పరిస్థితుల్లో రోగులకు ప్రయివేటు దుకాణాల నుంచి కొనుగోలు చేసి తీసుకురావాలని సూచిస్తున్నారు. వైద్యం పొందేందుకు ఆర్థికస్థోమత లేని నిరుపేదల కుటుంబాలకు చెందిన రోగులు ఇచ్చిన అరకొర మందులతో సరిపుచ్చుకుంటున్నారు.

దారుణ పరిస్థితులు

జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పిహెచ్‌సిలో మందుల కొరత సమస్యలను సృష్టిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోగులు అవస్థలు పడుతున్నారు. నిజానికి జిల్లాలో 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఏడు పట్టణ, రెండు పిపి యూనిట్లు పనిచేస్తున్నాయి. తొమ్మిది వైద్యశాలలు సైతం ఉన్నాయి. 27 పిహెచ్‌సిల ద్వారా 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ చెబుతోంది. ఇకపోతే 441 ఉపకేంద్రాలు గ్రామీణ రోగులకు అందుబాటులో ఉన్నాయని అంటోంది. చేవెళ్ల, పరిగి, గండ్వీడ్‌, కుల్కచర్ల, బషీరాబాద్‌, బంట్వారం, మోమిన్‌పేట తదితర మండలాల్లోని పిహెచ్‌సిల్లో మందుల కొరత ఉందని సమాచారం. సాధారణ జబ్బులకు సైతం మందుల్లేకపోవడం దారుణమని రోగులు ఆరోపిస్తున్నారు. జ్వరం, పడిసం, తలనొప్పి తదితర చిన్న చిన్న జబ్బులకు మందుల కొరత పేదలను వేధిస్తోంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్