పాఠశాల తలుపులు తీసుకెళ్లాడని దాడి చేసి కొట్టడంతో మనస్థాపం చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామ పంచాయతీ దైవాలగూడ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. షాబాద్ ఎస్సై-2 సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... దైవాలగూడ గ్రామానికి చెందిన మాసని నర్సింహులు(35) అదే గ్రామానికి చెందిన పాఠశాలకు తీసివేసిన తలుపులను తీసుకొచ్చి తన ఇంటికి పెట్టుకున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుడుగా పనిచేస్తున్న హైదర్‌అలీ తనకు తెలీకుండా తలుపులు ఎలా తెచ్చావని నర్సింహులును బూతులు తిడుతూ కొట్టడంతో మనస్థాపం చెందాడు. దీంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే షాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు లేక చికిత్సకు ఆలస్యం
బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు షాబాద్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం బాధితుడు నర్సింహులును గ్రామస్తులు తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో స్వీపర్ భీమయ్య, నైట్ వాచ్‌మెన్ తమకు తెలిసిన వైద్యం చేసి అక్కడ నుంచి 108లో షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నర్సింహులు మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సబ్యులకు అప్పగించారు. మృతునికి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆరేళ్ల క్రితం భార్య ఆత్మహత్య
వీధినపడ్డ పిల్లలు
మృతుడు నర్సింహులు భార్య ఆరు సంవత్సరాల క్రితమే కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు వీధిన పడ్డారు. కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.