ఆ పాఠశాలలో పాఠాలు చెప్పాలన్నా....చదువుకోలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే... ఎప్పుడు ఏ రాయి వచ్చిపడిద్దో...ఎవరికి గాయాలవుతాయో తెలియని పరిస్థితి. ఇది ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిథిలోని రామతీర్ధం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. అటు మండల పరిషత్‌కు ఇటు ఆర్.ఎల్.పురం పంచాయతీకి గ్రానైట్‌గనుల వలన కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. పైన సిమెంటు రేకులు.. చూట్టూ తాటాకు దడులతో ఈ పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాల ఇటీవల ప్రమాదంలో 14 మంది మృతి చెందిన హంస మినరల్స్ పక్కనే ఉంది. క్వారీ అంచునే వంద అడుగుల దూరంలో ఉంది. పాఠశాల చుట్టూ ఆర్‌ఆర్ గ్రానైట్స్, వీనస్ గ్రానైట్స్, హంస గ్రానైట్స్ క్వారీయింగ్ నిర్వహిస్తున్నారు. ఆ క్వారీలలో ప్రతిరోజూ మధ్యాహ్నాం, సాయంత్రం బ్లాస్టింగ్ నిర్వహిస్తుంటారు. బ్లాస్టింగ్‌లో పగిలిన రాళ్లు ఎగిరి వచ్చి పాఠశాలపై పడుతుంటాయి. బయట ఆడుకుంటున్న విద్యార్థులపై పడి గాయపడిన సందర్భాలున్నాయి. వివరాల్లోకి వెళితే...రామతీర్థం ప్రాంతంలో గ్రానైట్ రాకపూర్వమే రామతీర్థం సెంటర్‌లో ప్రభుత్వం కంకర కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలాల్లో ఇళ్లు ఏర్పాటు చేసుకొని కార్మికులు నివసిస్తున్నారు. ప్రభుత్వం రామతీర్థం దేవాలయం ప్రాంతంలో నివసించేవారి కోసం ఆ కాలనీలో పాఠశాలను ఏర్పాటు చేసింది. దేవాలయం సెంటర్ నుంచి 15 మంది, రామతీర్థం కాలనీ సెంటర్‌లో 20 మంది విద్యార్థులు మొత్తం 35 మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, 35 మంది విద్యార్థులతోపాటు ఆ సెంటర్‌లో మరో అంగన్‌వాడీ కేంద్రం కూడా నడుపబడుతోంది. అయితే విద్యాబోధన సజావుగా జరగటానికి గ్రానైట్ క్వారీయింగ్ ఆటంకంగా మారింది. నిత్యం గ్రానైట్ బ్లాస్టింగ్, ప్రొక్లయిన్ల శబ్ధాలతో రణగోన ధ్వనులు వినిపిస్తున్నాయి. పాఠశాలలో రికార్డులు భద్రపర్చుకోవడానికి వసతి లేదు. ఉపాధ్యాయులు కూర్చోవడానికి కుర్చీలు లేవు. చీమకుర్తి మండలంలోని పాఠశాలల్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పక్కాభవనాలు, ప్రహారీగోడలు ఉన్నాయి. కానీ రామతీర్థంలోని పాఠశాలలో ఆ సౌకర్యాలు మృగ్యమయ్యాయి. పాఠశాల భవనం నిర్మాణానికి గతంలో నిధులు మంజూరైనా ఎందుకు కట్టడానికి జంకుతున్నారో అధికారులు సమాధానం చెప్పాలి. ఈ పాఠశాల ఉన్న కాలనీ కింద అత్యంత విలువైన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఈ కాలనీని ఇక్కడ నుండి ఖాళీ చేయించి లీజులు పొంది క్వారీయింగ్ చేయాలని గత కొన్నేళ్ళుగా లాబీయింగ్ జరుగుతోంది. ఇటీవల ఈ కాలనీని లీజు ఇచ్చారు. వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
శాసనమండలిలో చర్చిస్తా: దాచూరి
హంస మినరల్స్ క్వారీలో జరిగిన దుర్ఘటనను పరిశీలించటానికి ఇటీవల సంఘటనా స్థలాన్ని సందర్శించిన శాసనమండలి సభ్యులు డి రామిరెడ్డి అనంతరం ఈ పాఠశాలను చూసి ఆశ్చర్యపోయారు. పాఠశాల విషయాన్ని శాసన మండలిలో చర్చిస్తానని తెలిపారు. తక్షణం పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.