నిబంధనలు పాటించని కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్లగా మండలంలోని కళవళ్ళ గ్రామానికి చెందిన గుర్రం బ్రహ్మయ్య (46) కందుకూరు నుంచి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తూ మార్గమధ్యలో ఉన్న నలదలపూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నలదలపూరు గ్రామంలోకి వెళ్లే దారిలో మోపాడు సప్లయి ఛానల్ పనులకు సంబంధించి రోడ్డుపై భారీ గుంతలను తీసి పనులు చేస్తున్నారు. పనులు జరుగుతున్నట్లు bటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. దీంతో గమనించని బ్రహ్మయ్య యదావిధిగా రోడ్డు ఉందనుకొని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు భారీ గుంతలో పడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెల్లవారేంత వరకూ bవరికీ తెలియలేదు. ఆదివారం ఉదయాన్నే ప్రజలు గుంటలో శవం ఉందని గుర్తించారు. విచారిస్తే కళవళ్ళకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. బ్రహ్మయ్య బంధువులు వచ్చి మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అధికారుల నిర్లక్ష్యమే మృతికి కారణం
సంబంధిత ఇరిగేషన్ అధికారులతో పాటు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఫలితంగానే బ్రహ్మయ్య మృతి చెందినట్లు బంధువులు మోదేపల్లి క్రిష్ణయ్య, గుర్రం తిరుపతయ్య ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.